సన్మానం ప్యాకేజీలు..!

ప్రత్యేక ప్యాకేజీ తొలి
ఫలితం రుచి చూసిన తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని తెగ
బాధపడిపోయారు. ఇంత నేరుగా, ఇంత వేగంగా ప్యాకేజీ ఫలితాలు ఉంటాయని తెలిస్తే ఇది వరకే
ప్యాకేజీ పొట్లాలు తీసుకొని ఉంటే ఈ పాటికి చక్కగా జీర్ణం కూడా అయిపోయేది కదా.
అనవసరంగా రెండేళ్ల విలువైన సమయాన్ని వేస్టు చేసుకొని ఎంత నష్టపోయామో కదా అని ఆ
లెక్కలు కళ్ల ముందు మెదిలేసరికి వారి బాధ వర్ణనాతీతం.

          హోదాతో వచ్చే పరిశ్రమలు, రాయితీలు, ఉద్యోగాలు, వెనుకబడిన
ప్రాంతాల ప్రగతి.. ఇలాంటివన్నీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సంబంధించినవి. అదే
ప్యాకేజీ అయితే కోరుకొన్న తమ్ముళ్లకు కోరుకొన్నంత. పోలవరం తాత్కాలిక కట్టు కట్టి,
ఆ కట్ట మట్టికే వేల కోట్లు కట్టబెట్టి, చెంబు నీళ్ల సంధానంతో సముద్ర సంధానం
సంబరాలు జరిపినట్లు రేపు పోలవరం సంబరాలు జరపక పోతే బాబు మీద ఒట్టు.

          ఇది వరకు రాజకీయాల్లో అధి నాయకుడిని ఇంద్రుడు, చంద్రుడు అని
పక్కవాళ్లు పొగిడేవాళ్లు. పక్క వాయిద్యాల వారికి ఆ శ్రమ లేకుండా “ఎన్టీయార్ ను మామను చేసింది
నేనే, తర్వాత తాతను చేసింది నేనే, సీఎంను చేసింది నేనే, చారిత్రక అవసరం కొద్దీ ఆ
సీటు నుంచి దించి విశ్రాంతి నిచ్చింది నేనే. అయినా మొహమాటం లేకుండా ఎన్టీయార్
విగ్రహాలకు దండలు వేసేది నేనే, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్లబోతుంటే
లోకం చుట్టిన బాలుడు లోకేష్ చెబితే ఆ పదవిని త్రణప్రాయంగా త్యజించి ఈ రోజులకూ బాధ
పడుతున్నది నేనే. హైదరాబాద్ ను కట్టింది నేనే, రేవంత్ కు చెప్పింది నేనే, , సెల్
ఫోన్ కనిపెట్టింది నేనే, ఆ ఫోన్ లలో బ్రీఫ్ చేసింది నేనే. అటువంటప్పుడు ఏది నేను
కానో, ఏది నాది కాదో, ఎక్కడ నేను లేనో, చెప్పండి” అంటూ గద్గద స్వరంతో, జల జల రాలే కన్నీళ్లతో
బాబు అడిగినప్పుడు ప్రక్రతి బరువెక్కింది. గాలి స్తంభించింది. కొండలు ఊగిపోయాయి.
సముద్రం తీరం దాటింది. మిత్ర మీడియా అక్షరాల గుండెలు బరువెక్కాయి. శోకరసం, కరుణరసం
కట్టలు తెంచుకొన్నాయి. రసానుభూతిని సానుభూతిగా మార్చడానికి వారు పూసిన సెంటిమెంటు
ఆయింటుమెంటు అంతా ఇంతా కాదు.

          ఇక ఆ అయ్యకు ఈ బాబు సన్మానం. ఈ బాబుకి ఆ అయ్య కీర్తి కిరీటం.
పొగడ్తలే పొగడ్తలు. అయ్యే లేకపోతే ఆంధ్రులు అడుక్కు తింటారని ఒక ఉత్సాహవంతుడు
శపించాడు కూడా. ప్రజాస్వామ్యం మరి.

          వెనుక రేడియోలో పాత పాట ఆడియో అరిగి అరిగి ప్రత్యేక బాణీలో
వినిపిస్తోంది.

          ‘’చేతిలో చెయ్యేసి చెప్పు బాబూ,  చేసుకొన్న బాసటు చెరిగిపోవనీ” పాట విని చిర్రెత్తిన
చిన్నబాబు స్టేషన్ మార్చాడు.

          “ కెవ్వు కేక, ప్యాకేజీ రాక“ కొత్త పాట జోష్ కు చిన్నబాబు
చిందులేస్తున్నాడు. 

Back to Top