ఏ ఎండకాగొడుగు పెట్టేయ్ గురూ

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు వచ్చాడు.

విక్రమార్కుని చూడగానే చెట్టుకొమ్మకి వేలాడుతోన్న శవంలోంచి బేతాళుడు నవ్వాడు.

"ఏంటి విక్రమార్కా మొత్తం చుట్టాలంతా ఏట్లో కొట్టుకుపోయినట్లు ఏంటి అంత డల్ గా ఉన్నావు" అని అడిగాడు బేతాళుడు.

విక్రమార్కుడు కాస్త చికాగ్గా మొహం పెట్టి...

"ఏం చెప్పమంటావు బేతాళా ఈ ఏడాది ఇంత వరకు సరైన వానలే కురవలేదు.ఎండాకాలాన్ని మించిపోయి ఒకటే ఉక్కపోత.ఈ  నైరుతీ రుతుపవనాలు ఎక్కడికి పోయాయో అర్ధం కావడం లేదు. అస్సలు భరించలేకుండా ఉన్నానయ్యా బాబూ" అని నిట్టూర్చాడు.

బేతాళుడు  బాధగా చూశాడు. బేతాళుడికి కూడా కంటతడి వచ్చింది." అవును విక్రమార్కా...ఓ పక్క వర్షాలు లేక..మరో పక్క ఎలాంటి సాయం అందక రైతులు ప్రాణత్యాగాలు చేసి మా లోకానికి వచ్చేస్తున్నారు.వారిని చూస్తూ గుండె చెరువైపోతోంది విక్రమార్కా" అన్నాడు.

విక్రమార్కుడే తేరుకుని..."ఈ ప్రభుత్వాలు రైతులను ఎప్పుడు ఆదుకుంటాయో ఏంటో " అని ..గట్టిగా ఓ సారి ఊపిరి పీల్చుకున్నాడు.

బేతాళుడు  ఓ సారి ఆవలించి..."మరి కథ మొదలు పెట్టమంటావా" అన్నాడు.

"ఇంకెందుకు ఆలస్యం చెప్ప"ు అన్నాడు విక్రమార్కుడు.

బేతాళుడు చెప్పడం మొదలు పెట్టాడు.

"విక్రమార్కా...ఆంధ్ర ప్రదేశ్ విభజన కు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో  రాష్ట్రంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏపీని చీలిస్తే...కొత్త రాజధాని కట్టుకోడానికి నాలుగున్నర..అయిదు లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలన్నారు.బిజెపితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మా రెండు పార్టీలనూ గెలిపిస్తే ప్రత్యేక హోదా తేవడంతో పాటు రాష్ట్రాన్ని అందరూ అసూయ పడే రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు.పోలవరం ప్రాజెక్టును ఆగమేఘాల మీద నిర్మిస్తామన్నారు.కొత్త కొత్త కాలేజీలు..ప్రాజెక్టులు సాధిస్తామన్నారు. ఇన్ని కబుర్లు చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇపుడు అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా వీటిలో ఏ ఒక్కదాన్నీ సాధించలేదు.

ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంటే...తెలుగుదేశం సభ్యులు దాని గురించి మాట్లాడ్డం లేదు. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న టిడిపి మంత్రుల్లో కొందరు ప్రత్యేక హోదా అసాధ్యం కాబట్టి వేరే రూపంలో నిధులు తెస్తామన్నారు.ఇంకొందరేమో ప్రత్యేక హోదా సాధించి తీరతామంటూ ఇప్పటికీ మభ్యపెడుతున్నారు.రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోయారు.ఏపీకి రెవిన్యూ లోటు 15 వేల కోట్ల రూపాయలు ఉంటుందని తేల్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే విదిల్చింది.మిగతా నిధులను రాబట్టుకోవడానికి తెలుగుదేశం అస్సలు ప్రయత్నించడమే లేదు. బిజెపి మిత్ర పక్షమైన టిడిపి ఎందుకు నోరు మెదపలేకపోతోంది? కేంద్రం పై ఒత్తిడి తేడానికి ఎందుకు భయపడుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.ఈ లెక్కన ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో యాభై ఏళ్లు అవసరం అవుతాయేమో.దీనికంతటికీ కారణం ఏంటంటావు?

అలాగే ఇంకో ప్రశ్న. టిడిపి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. కొన్ని వేల నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవులను పాలక పక్ష నేతలకు ఇచ్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు.అయినా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు పదవులు ఎందుకు ఇవ్వడం లేదు?

వీటికి సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావా...అంటూ బేతాళుడు సాగతీస్తోండగానే

విక్రమార్కుడు కల్పించుకుని ఎన్ని సార్లు రిపీట్ చేస్తావయ్యా బాబూ..నా తల వెయ్యి చెక్కలైపోతుంది

అంతే కదా. నీకు సమాధానాలు చెప్పకపోతే కదా. సరిగ్గా విను అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.

ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగడానికి కానీ..రాజధాని నిర్మాణానికి నిధులు రాబట్టుకోడానికి కానీ...రెవిన్యూ లోటును  సాధించుకోడానికి కానీ...చంద్రబాబు నాయుడికి నోరు పెగలడం లేదు. దానిక్కారణం ఒకటే. అప్పట్లో ఎన్నికల్లో ఓట్లు కావాలి కాబట్టి..రాష్ట్ర విభజన తెచ్చిన ఆందోళనలో ఉన్న  తెలుగు ప్రజలను మచ్చిక చేసుకోడానికి ఈ హామీలన్నింటినీ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు.

తీరా అధికారంలోకి వచ్చాక..ఒక దాని తర్వాత వివాదాల్లో చిక్కుకోవడం..ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం.. జరిగిపోయాయి.ఇపుడు కానీ బిజెపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే..తను ప్రశాంతంగా ఉండనివ్వరని చంద్రబాబు భావించారు.అందుకే  ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో కూడా మాట్లాడద్దని తన పార్టీ ఎంపీలకు రహస్య సందేశాలు అందించారు.

ఇక నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే..పదవులు భర్తీ చేయనంత వరకు వాటిని ఆశించే నేతలంతా చంద్రబాబు నాయుడిక అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయన చుట్టూరా తిరుగుతూ విధేయంగా ఉంటారు. అదే చేతిలో అధికారం ఉంది కదా అని పదవులన్నీ భర్తీ చేస్తే...పదవులు వచ్చిన వాళ్లు బానే ఉంటారు కానీ..రాని వాళ్లు మాత్రం అసంతృప్తితో రగిలిపోతారు. అది మొదలైందంటే పార్టీ పని మటాషే. పదవుల కన్నా..వాటిని ఆశించే వారే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటారు. అంచేత పదవులు ఇవ్వడం ద్వారా పది మందిని సంతోష పెడితే..వంద మందిలో  ఆగ్రహం రాజేసినట్లే అవుతుందని చంద్రబాబు నాయుడికి తెలుసు.అందుకే త్వరలోనే పదవులు భర్తీ చేస్తా అంటూ.. తరచుగా అంటారే తప్ప వాటిని ఎన్నటికీ భర్తీ చేయరు." అని విక్రమార్కుడు చెప్పడం ముగించాడు.

నువ్వు కానీ సివిల్ సర్వీసెస్ కి  అప్లయి చేస్తే టాపర్ గా నిలుస్తావు విక్రమార్కా అని పొగిడి బేతాళుడు తిరిగి చెట్టెక్కేశాడు.

-వీర పిశాచి
Back to Top