అప్పుడే కుంగిన క‌ల‌లు

సింగపూర్ క‌ల‌ల బాబుకు, కోచింగ్ మినిస్ట‌ర్ నారాయ‌ణ‌కు పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. నెల్లూరు నుండి శ్రీ‌కాకుళం దాకా సువిశాల స‌న్‌రైజింగ్ స్టేట్ బాగోగుల‌ను గాలికొదిలి వెల‌గ‌పూడి, ఉద్దండ‌రాయునిపాలెం పొలంగ‌ట్ల ద‌గ్గ‌ర ఇంజ‌నీర్ హెల్మెట్ పెట్టుకొని బాబు తాత్కాలిక రాజ‌ధాని నిర్మాణం చేస్తున్నారు. శివ‌రామ‌కృష్ణ క‌మిష‌న్ చెప్పినా, బంగారంలా పంట‌లు పండే భూములు రాజ‌ధాని పేరిట లాక్కోవ‌డం ఎందుక‌ని అందరూ చెప్పినా ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోస‌మే బాబు అక్క‌డే రాజ‌ధాని అన్నారు. ఢిల్లీ వారు చిల్లిగ‌వ్వ ఇవ్వ‌క‌పోయినా తాత్కాలిక రాజ‌ధాని ప‌నుల‌కు ఇసుక‌, సిమెంటు క‌లిపారు. శుభం ప‌ల‌క‌రా పెళ్లికొడ‌కా! అంటే... అని సామెత చెప్పిన‌ట్లు తాత్కాలిక నిర్మాణాలు క‌డుతున్న చోట భూమి లోప‌లికి కుంగింది. క‌డుతున్న నిర్మాణాలు క‌దిలాయి. ఏదో అప‌శ‌కునం ప‌లికిన‌ట్లుంద‌ని జ‌నం చెవులు కొరుక్కునే లోపు మంత్రి నారాయ‌ణ త‌న కోచింగ్ అనుభ‌వంతో మీడియా బ్రీఫింగ్‌కు ముందుకొచ్చారు. 
నారాయ‌ణ ప్ర‌కారం - భూమి కుంగ‌లేదు. నిర్మాణాలు క‌ద‌ల్లేదు. ఈ పుకార్లు ఎందుకు పుట్టాయో తెలీదు. అస‌లే వాట‌ర్ ఫ్రంట్ రాజ‌ధాని. వాట‌ర్ ఫ్రంట్‌లో పారుతుంటేనే ఇలావుంది రేపొద్దున నిర్మాణాల‌న్నీ పూర్త‌యి నీరెక్కువ నిలిచిన‌ప్పుడు, వ‌ర‌ద‌లొచ్చిన‌ప్పుడు, నీటి నిలువ‌తో భూమి బ‌లం త‌గ్గి పునాదులు క‌దిలిన‌ప్పుడు బాబుకు సింగ‌పూర్‌లో బ‌స ఏర్పాటు చేయ‌డానికి ఈశ్వ‌ర‌న్ ఉంటాడు. మంత్రి నారాయ‌ణ‌కు ఏదో ఒక ఊరి కాలేజీ, కోచింగ్ సెంట‌ర్ ఉండ‌నే ఉంటుంది. భావోద్విగ్న స‌న్నివేశంలో క‌న్నీళ్లు తుడుచుకుంటూ రైల్వేమంత్రి సురేష్‌ప్ర‌భును ప్ర‌త్యేకంగా ప్రార్థించి వేయించుకున్న అమ‌రావ‌తి స్పెష‌ల్ ట్రెయిన్‌లో వెళ్లిన మాములు ఉద్యోగుల‌ను ఆదుకునే నాధుడెవ‌రో?
అయినా బాబు స‌మాధానం త‌డుముకోకుండా చెప్ప‌నే చెప్పారు. ఈ అఖండ భార‌త‌దవ‌నిలో సిటీలు క‌ట్టిన మొన‌గాడెవ‌డు?  నీళ్ల‌లో తేలే ఓడ‌ల‌ను చూశాం. నీళ్ల‌లో ల్యాండ‌య్యే విమానాల‌ను చూశాం. ఇప్పుడు భూమిమీదే ఉన్నా నీళ్ల‌లో తేలిన‌ట్లు, ఊగిన‌ట్లు అనుభూతి క‌లిగించే భ‌వ‌నాల‌ను చూడ‌బోతున్నాం. బాబు అనుకున్న‌ది అనుకున్న‌ట్లు పూర్త‌యితే అందులో ఉండ‌బోతున్నాం. 
ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌కండి. ఎందుకంటే నెగ‌టివ్ వార్త‌లు చ‌దివిన వారిమీద కూడా కేసులు పెట్ట‌డానికి విన్నూత‌మైన మార్గాలు వెత‌క‌మ‌ని బాబు త‌మ్ముళ్ల‌కు చెప్పారు. 
Back to Top