భేతాళ కథ

అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా...
విక్రమార్కుడు మళ్లీ చెట్టుమీది శవాన్ని భుజాలకెత్తుకుని ముందుకు నడవసాగాడు.
భేతాళుడు ఏమీ మాట్లాడ్డం  లేదు.
విక్రమార్కుడికి డౌట్ వచ్చింది.
ఏంటి భేతాళా బతికున్నావా..లేక  బాల్చీ తన్నేశావా? అని అనుమానంగా అడిగాడు.
శవంలోని భేతాళుడు బద్దకంగా ఆత్మ విరుచుకున్నాడు.
విక్రమార్కా బాగా మత్తుగా నిద్రపట్టేసిందయ్యా.. ఇప్పటికీ కళ్లు మూతలు పడిపోతున్నాయి...అంటూ గట్టిగా ఆవలించాడు.
ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టు అన్నాడు విక్రమార్కుడు.
భేతాళుడు హుషారుగా కదిలి విక్రమార్కా ఇపుడు నీకు రెండు కథలు చెబుతాను. రెండు ప్రశ్నలు వేస్తాను.వాటిని సావధానంగా విని జవాబులు చెప్పు. వీటికి సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావో నీ తల  ఒక్కో ప్రశ్నకీ వెయ్యి చొప్పున రెండు వేల ముక్కలవుతుంది అన్నాడు.
చెప్పేదేదో సూటిగా సుత్తిలేకుండా..కథని సాగదీయకుండా చెప్పు అన్నాడు విక్రమార్కుడు.భేతాళుడు  చెప్పడం మొదలు పెట్టాడు.
విక్రమార్కా ...ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మాల వేశాడు.చిత్రంగా కొన్నేళ్ల క్రితం ఈ రాహుల్ గాంధీ ఆయన తల్లి సోనియా గాంధీల నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ నేతగానే ఉన్న వై.ఎస్.ఆర్. పై బురద జల్లారు. చివరకు ఆయన పేరును ఎఫ్.ఐ.ఆర్. లో కూడా చేర్చి అవమానించారు. బోఫోర్స్ కుంభకోణంలో  అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పేరు ఎఫ్.ఐ.ఆర్. లో ఉండేది. రాజీవ్ గాంధీ మరణానంతరం ఎఫ్.ఐ.ఆర్. లోంచి రాజీవ్ గాంధీ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. వై.ఎస్.విషయంలో మాత్రం ఆయన చేయని నేరాన్ని ఆయనపైనా ఆయన కుటుంబం పైనా ఆపాదిస్తూ ఎఫ్.ఐ.ఆర్. లో వై.ఎస్. పేరు ఇరికించింది.అప్పుడు వై.ఎస్.ను అవమానించిన రాహుల్ గాంధీ ఇపుడు వై.ఎస్. కు ఎందుకు నివాళి అర్పించారంటావ్?
దీనికి సమాధానం  ఆలోచించుకునే ముందు రెండో కథ కూడా చెప్పేస్తాను అది కూడా విని రెండు ప్రశ్నలకూ ఒకే సారి బదులిద్దువుగాని అని రెండో కథ మొదలు పెట్టాడు భేతాళుడు.
2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేసిన తెలుగుదేశం...బిజెపి పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చాయి. అలాగే బ్రహ్మాండమైన రాజధాని నగర నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రమే భరిస్తుందని భరోసా ఇచ్చాయి. రెండు పార్టీలూ చెట్టాపట్టాలేసుకుని..పవన్ కళ్యాణ్ ను అరువు తెచ్చుకుని ప్రచారం ఊదర గొట్టాయి. ఎన్నికలయిపోయాయి.అక్కడ బిజెపి..ఇక్కడ టిడిపి-బిజెపి కూటమి అధికారంలోకి వచ్చాయి. ఇప్పటికే 14 నెలలు నిండిపోయింది కూడా. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరికదా..అసలు అది సాధ్యమే కాదని బిజెపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.బిజెపి-టిడిపి కూటమికి ఓటేస్తే ప్రత్యేక హోదా సాధించుకుంటామని నమ్మబలికిన చంద్రబాబు నాయుడేమో అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడ్డం లేదు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని పట్టుబట్టడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టిన బిజెపి ...దానితో జట్టు కట్టిన చంద్రబాబు ఇపుడు ఎందుకు ప్రత్యేకహోదా ఊసెత్తడం లేదో అర్ధం కావడం లేదు.
విక్రమార్కా ఇపుడు చెప్పు  ప్రత్యేక హోదా విషయంలో అసలు ఏం జరుగుతోంది?
రెండు కథలనీ విన్న  విక్రమార్కుడు రెండు నిముషాలు కళ్లు మూసుకుని ఆలోచించి ఆలోచన తట్టిన వాడై చిరునవ్వుతో కళ్లు తెరిచాడు.
భేతాళా...మొదటి ప్రశ్నకు సమాధానం చెబుతా విను.
వై.ఎస్.రాజశేఖర రెడ్డి  అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో దిక్కులేని దీన అయ్యింది. ఆ సమయంలో ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డిని సిఎం ని చేయాలని ఏకంగా 150 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేసి హైకమాండ్ కి సమర్పించారు.అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకూ...హై కమాండ్ పెద్దలకూ కూడా అంత చిన్న వయసులో జగన్ మోహన్ రెడ్డికి అంత ఆకర్షణ ఉండడం..మద్దతు లభించడం నచ్చలేదు. అందుకే రోశయ్యను సిఎం చేశారు.వై.ఎస్.మరణవార్త తట్టుకోలేక గుండెలు పగిలి మరణించిన వందలాది మంది అభిమానులను పరామర్శించి రావాలని జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రారంభించారు.దానికి ఊహించని స్పందన రావడంతో హై కమాండ్ కన్ను కుట్టింది.ఓదార్పు ఆపమంది. జగన్ మోహన్ రెడ్డి ఆపలేదు.అంతే కాదు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతే తమని కాదని వెళ్లిపోయిన జగన్ మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తే  వై.ఎస్.ను గుండెల్లో దాచుకున్న తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడతారని భయపడ్డ కాంగ్రెస్ జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. జగన్ మోహన్ రెడ్డితో పాటే ఆయన తండ్రిపేరునూ ఎఫ్.ఐ.ఆర్. లో చేర్చింది.అయితే  రాజశేఖర రెడ్డిని ఇప్పటికీ గుండెల్లో దాచుకుని అభిమానించే ప్రజలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టారు.ఆ ఘోర పరాభవాన్ని జీర్ణించుకోడానికి 14 నెలల సమయం పట్టింది. ఇపుడు ఏపీలో మళ్లీ జనంమధ్య తిరగాలంటే వై.ఎస్.ను తమవాడిని చేసుకుంటేకానీ లాభం లేదని కాంగ్రెస్ హై కమాండ్ తెలుసుకుంది.అందుకే రాహుల్ గాంధీ  ఏ నాయకుడిని అయితే తాము అవమానించారో..ఆ నాయకునికే దండ వేసి పాపం కడిగేసుకున్నామని అనుకుంటున్నారు.
ఇక రెండో ప్రశ్నకు బదులు విను.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాజధానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని చంద్రబాబు పట్టుబట్టారే తప్ప విభజన వద్దనలేదు. విభజన తర్వాత ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని నమ్మించి ఓట్లు సంపాదించుకున్నారు.ఇపుడు కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు ఒత్తిడి తేలేకపోతున్నారు. అందుకు కారణం చంద్రబాబు నాయుడి అవినీతే. ఒక పక్క ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చంద్రబాబు నాయుడు ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో..ఎక్కడ ముఖ్యమంత్రి పదవి ఊడుతుందో నని భయపడుతున్నారు.ఈ కేసు విషయంలో తనని కాపాడతారన్న ఉద్దేశంతోనే  బిజెపి ప్రభుత్వంపై ఆయన ఒత్తిడి తేలేకపోతున్నారు. ఓటుకు నోటే కాదు..చంద్రబాబు పై ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఐ.ఎం.జి.భూ కుంభకోణం కేసును కూడా బిజెపి ప్రభుత్వం తిరగతోడుతుందేమోనని  చంద్రబాబు వణికిపోతున్నారు.ప్రత్యేక హోదా గురించి కేంద్రప్రభుత్వం తో పేచీ పెట్టుకుంటే తన రాజకీయ భవిష్యతు నాశనమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోడానికే ఆయన రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి..ప్రత్యేక హోదా డిమాండ్ ను అటకెక్కించారు. అని విక్రమార్కుడు ముగించాడు.
రెండు సమాధానాలకూ సంతృప్తి చెందిన భేతాళుడు  విక్రమార్కుని భుజం పై మాయమై తిరిగి చెట్టుకు వేలాడాడు.
------------------
-వీర పిశాచి

Back to Top