భజనమంత్రిత్వ శాఖ


ఇదెక్కడుందని ఆశ్చర్యపోకండి. అచ్చంగా మన తెలుగు రాష్ట్రంలో, తెలుగుదేశం పాలిస్తున్న ఆంధ్రరాష్ట్రంలోనే ఉంది. దీని విధి విధానాలు చంద్రబాబు అధికారపీఠం ఎక్కగానే ఖరారు అయిపోయాయి. టిడిపి ప్రభుత్వాన్ని, టిడీపీ అధినేతను పొగిడేందుకు, సన్మానాలు చేసేందుకు, పాలాభిషేకాలు చేసేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ఈ శాఖను నియమించారు. ఈ శాఖకు నిధుల కొరతలేదు. లోటు బడ్జెట్ మాటే ఉండదు. అవసరానికి మించి కూడా నిధులు ఖర్చు పెట్టే శాఖ ఇదొక్కటే అంటారు.
ఈ శాఖ విధులు ఇలా ఉంటాయి...
చంద్రబాబు ప్రతి పనికీ రీరికార్డింగ్ వేయడం. అంటే బాబు నడక, బాబు నవ్వు, బాబు చెయ్యి, బాబు కాలు అన్నిటిలోనూ హీరోయిజాన్ని ప్రజలు గుర్తించేలా ప్రజెంట్ చేయడం.
అన్ని ప్రచార, ప్రసార మాధ్యమాల్లో బాబు నిలువెత్తు కటౌట్లు కనిపించేలా ప్లాన్ చేయడం. 
రెగ్యులర్ గా ప్రతిపక్ష నాయకుడిని ఫాలో అవుతూ ఎవరెవరికి ఆయన ఎలాంటి హామీలు ఇస్తున్నాడో గమనించి, వాటిని వెనువెంటనే కాపీ చేసి, వారికి మేలు చేస్తున్నట్టు ప్రకటనలివ్వడం. 
ఆశావర్కర్లకు వైఎస్ జగన్ జీతాల పెంపు హామీ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం తరఫున అరకొర జీతం పెంచినట్టు ప్రకటించి, వెంటనే వారి చేత ముఖ్యమంత్రికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. 
అంగన్ వాడీ టీచర్లకు తెలంగాణాలో కంటే వెయ్యి ఎక్కువే జీతం అందిస్తామని ప్రతిపక్ష నాయకుడు ప్రకటించగానే, వారిని పిలిచి మరీ వేతన హామీలిచ్చి, వారిచేత చంద్రబాబుకు హారతులు ఇప్పించడం.
యానిమేటర్లకు వేతనం 10,000 చేస్తామని జగన్ హామీ ఇచ్చిన వెంటనే వారికి 3000 వేతనం పెంపు చేస్తూ ఉత్తర్వులిప్పించి, వాటితోపాటు చంద్రబాబు ఫ్లెక్సీలు, హెరిటేజ్ పాలు అందజేసి పాలాభిషేకం చేయాలనే ఆజ్ఞలు జారీ చేయడం.
ఇలాంటి మహత్తర కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో మరేశాఖా సాధించనంత పురోగతిని ఈ శాఖ సాధిస్తోంది. ఖజానా లోటు ఉన్నా సరే ప్రచారానికి ఆటంకం కలగకుండా చూడటం ఈ శాఖ విజయం అనే చెప్పుకోవాలి. 
హోంగార్డులు, కాంట్రాక్టు ఉద్యోగులు, 108 సిబ్బంది ఇలా ఏళ్లకు ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోని శాఖలన్నీ ప్రతిపక్ష నేత వంక చూస్తే చాలు వారికి వరాలు కురిపించి, దేవుడి అవతారానికి నారా మారు పేరు అనిపించి, సన్మానాలు, సత్కారాలు, హారతులు, నైవేద్యాలు అందించే బాధ్యత ఈ శాఖ నిరవధింకగా, నిరంతరాయంగా, నిస్సిగ్గుగా నిర్వహిస్తోంది.
ఇంతకీ ఇలాంటి ఓ శాఖను ఏర్పాటు చేయాలనే అద్భుతమైన ఆలోచన బాబుగారికి ఎలా పుట్టిందా అని మరోసారి ఆశ్చర్యలో మునగకండి. పులిని చూసి నక్క వాత సామెత గుర్తు చేసుకోండి. పుట్టుకతో పులికి వచ్చిన రాజసం పెట్టుకుని తెచ్చుకునేందుకు చంద్రబాబు చేసే ప్రయత్నం పేరే...భజన మంత్రిత్వ శాఖ. 


 
Back to Top