బాబోయ్..యమడేంజర్‌

 

 
’గాల్లో ఈమానాలు ఎగర్తాన్నాయంటే నావల్లే. యాడ్నో సముద్రంలో ఓడలు తేలిపోతాన్నాయంటే నా వల్లే. అమెరికాలో వుండే నీకొడుకుతో మాట్లాడతాన్నావంటే నా వల్లే..’ ఈ తీరుగా మాటలు యాడైనా ఇనబడ్డాయంటే...ఠపీల్నున గుర్తొచ్చేది మా పెద్దాయప్పే. ఆయప్ప గురించి చెప్పాలంటే...సానా కథుండాదప్పా. మా ఊర్లో ఆయప్ప గురించి తెలీంది ఎవరికి? మసిబూసి మారేడుకాయచేస్తాడని’ పెద్దోళ్లు అంటాట్టరే...ఆయప్పది నూటికి నూరుపాళ్లు ఆ తీరేనప్పా. ఆయన తీరుగా అరచేతిలో వైకుంఠం చూపించే మొగసాలోడు ఈ భూపెపంచకంలోనే వుండడంటే వుండడంతే!! ఆయప్ప గురించి చెప్పుకుంటూ పోతే సానా కథుందిలేప్పా...ఇంతకూ ఆ పెద్దాయప్ప పేరు చెప్పనే లేదు కదూ...? సీనియరు సింగబాబూ అని ఆయప్ప పేరు. ఒరిజినల్‌ సింగ్రాబాబైతే...సీనియరు సింగబాబూ అని ఆయనకు ఆయనే తగిలించుకున్నాడు.
ఇక మా ఊర్లో ఆయప్ప రాజకీయాల గురించి చెప్పుకోవాలంటే చాలానే వుంది. ఆయప్ప కుళ్లు రాజకీయాలకు కలిసొచ్చినంత కాలం బానే ఏలుకున్నాడు సామీ!! బానే ఎనకేసుకున్నాడు కూడా. కానీ...ఎప్పుడూ చేతికి వాచీ లేదు. ఉంగరం లేదని ఏడస్తానేవుంటాడు. ఆయప్ప అనుకుంటే...స్విట్జర్లాండ్‌ వాచీ కంపెనీ కొనుక్కునేంతటోడు. లలితాజ్వువెలరీ షాపును ఇంట్లోనే పెట్టేసుకునేటోడు అని ఊర్లో జనాలు చెవులు కొరక్కుంటుంటారు. అంటే అర్థమేంది...ఆయప్పను జనాలు పెద్దగా నమ్మరంతే. అయినా, ఆయప్ప అవన్నీ పట్టించుకుంటేనా...ఆయప్ప తీరదే. బుద్దీ మారదు. గుణమూ మారదు.
మా ఊరు ఒకప్పుడు బాగా పెద్దగుండేదట. అటోళ్లు మాకొద్దూ మీతో యవ్వారం అని గొడవలేపితే...ఏదో చేస్తాడనుకున్న ఆ సీనియరు సింగబాబు...అలాగే కానిచ్చుకోండి..నాకేమీ అభ్యంతరం లేదన్నాడు. అంటే..అప్పుడు ఆయప్పను కూడా ఓ మాట అడిగే పరిస్థితి వుండేదిలే. అట్లాంటోడు...మళ్లీ నాకేమీ తెలీదంటూ మాయచేశాడు. పాపం మా ఊరు పరిస్థితి మళ్లీ రెడ్డొచ్చే మొదలాడు మాదిరి తయారయింది. అప్పట్లో ఆస్పత్రి, స్కూలు, పంచాయితీ ఆఫీసులు...ఇలా అవీ ఇవీ అన్ని ఆ పక్క ఉన్నాయి. అవన్నీ ...ఇప్పుడు అక్కడే ఉండిపోతే, మా వూరికి మళ్లీ అన్నీ కొత్తగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిగో ఇక్కడే మళ్లీ సింగబాబు కలిసొచ్చింది. నలుగురితో తిరిగినోడు...చాలా కాలం పాటు ఊరికి పెద్దగా ఉన్నోడు అని బాబును నమ్ముకుని ఆయప్పకే పెద్దమనిషి పోస్టు కట్టిపెట్టారు మా ఊరి జనం. ఏందో చేస్తాడనుకుంటే...ఏదేందో చేసేశాడు ఆయప్ప.
కొత్తూరుకు కళ తెస్తానంటూ మాటల్జెప్పి...చేతల్తో అన్నీ సొంతింటికే జేర్చుకునే పనిలో పడ్డాడు. పెజలు కన్ను గప్పేందుకు మాత్రం ...బెమ్మాండం బద్దలయిపోయేంతగా చేస్తానని ...మాటలు చెప్పిచెప్పీ...ప్రజలు చెవుల్లో పూలు పెట్టీ..పెట్టీ...ఇక మళ్లీ బతికి బట్టకడతామా? అని బిక్కుబిక్కున... దిగులు, దిగులుగా వుండేలా చేసేశాడు.
పాపం, మామూలు జనాల కష్టాలు ఇలా పెరుక్కుంటూ పోతే, ఆయప్పతో అంటకాగి, ఆయప్పకన్నా నాలుగాకులు ఎక్కువగా నేర్చుకున్న... దొంగలబాపతు తెలివితేటలున్న పెద్దమనుషులు...రోజురోజుకు పచ్చగా కళకళలాడుక్కుంటా పెద్దాసాములైపోయిరి. కొత్తూరు కథ వాళ్లకీ బాగానే కలిసొచ్చింది. ఊరోళ్లను మరిచిపోయి...వాళ్ల కడుపులు నింపుకునే యావలో పడి చచ్చిపోయిరి. అయేమి కడుపులు సామీ...ఎంత తిన్నా ఆరాయించుకుంటాయి?! ఇసిక, మట్టి..భూములు ఇలా ఆయప్ప గార్లూ వదిలిందీ లేదు...చేసుకోందీ లేదు. ఊరు ఉసూరుమంటుంటే..వాళ్లంతా ఏ పొద్దుకాపొద్దుకాడ పండగ చేస్కునేటోళ్లు...!
ఇలా ఐదేళ్ల పొద్దాయపాయ. ఊర్లో జనాలకు అర్థం కాలే. ఈయప్పను పక్కన పెట్టకపోతే...బతికి బట్టకట్టినట్టేననుకున్నారు. ఆయప్పను నువ్వు, దిగిపో సామీ అన్నారు. అంతకు ముందు..మా ఊర్లో జనం కోసం పుట్టినట్టు, జనం కోసమే బతికిపోయిన ఓ పెద్దాయప్ప కొడుకును తెచ్చిపెట్టుకున్నారు. ఆయప్ప వాళ్ల నాయనకన్నా మంచోడుగా ఉన్నాడు. జనాలకు ఏందో చేయాలని, వాళ్ల బతుకుల్లో వెలుగులు నింపాలని ఒకటే తపిస్తాపోతాంటాడు. ఇంట్లో మనిషిలాగా బాగోగులు విచారించి, మంచి చేయాలని ఒకటే పనిచేస్తాంటాడు. ఇదిగో సామీ, ఆయప్ప ఈ మధ్యనే నాయకుడయ్యాడు. నాయకుడైనా...నేను మీ సేవకుడినేనని చెబుతాన్నాడు.
అవ్వాతాత, అక్కాచెల్లీ, అన్నాతమ్ముడు...పిల్లలు..స్నేహితులు..ఇలా ఆయప్ప ఆలోచించని మనిషే లేకుండా పాయె. అందరి మంచినీ కోరుకునే ఆయప్ప మళ్లీ వాళ్ల నాయన్ను గుర్తుచేస్తాన్నాడు. ఈయప్ప...ఆయప్ప కన్నా ఇంకా మంచిచేయాలని పరిగెత్తినంతగా పనిచేస్తాన్నాడు. మా ఊరిక బాగుపడతాందని ఊర్లో జనం ధైర్నంగా బతకడం మొదలుపెట్టారు.
పెద్దరికం పోయేసరికి తట్టుకోలేకపోయిన సీనియర్‌ సింగబాబు..మళ్లీ తన పాతకథలు మొదలుపెట్టాడు. కుళ్లు రాజకీయాల బట్ట పరిసినాడు. నమ్మినోళ్లను నమ్మినట్టుగా బెమ్మల్లో ముంచేత్తాన్నాడు. ఆయప్ప తీరే అంతా... జనం తెలివిగా లేకపోతే, మళ్లీ ముంచేయడానికి రెడీ అయిపోతున్న ఆ సింగబాబును ఓ కంటకనిపెట్టకపోతే...యమ డేంజరంతే!!

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top