నూటికి నూరు శాతం బాబు వైపే...!


ఆంధ్ర ప్రదేశ్  జనాభాలో 80 శాతం మంది  చంద్రబాబు వైపే ఉన్నారట .
ఈ విషయాన్ని ప్రభుత్వమే  చెప్పుకుంది.
దీన్ని మా మిత్రుడికి చెబితే  అతను చాలా కోప్పడ్డాడు.
ఎందుకురా అంత కోపం అని నేను గట్టిగానే అడిగాను కూడా.
దాంతో వాడు కొంత తగ్గి..80 శాతం ఏంటిరా బాబూ.. నూటికి నూరు శాతం మంది చంద్రబాబు వైపే చూస్తున్నారు అన్నాడు.
నాకేదో అనుమానం వచ్చింది.

ఎందుకంటే మావాడు శుద్ద వెటకారి.
ఓ మాట అన్నాడంటే దాని వెనక ఏదో ఒక ఆంతర్యం ఉండి ఉంటుంది.
అందుకే చెవులు రిక్కించి పెట్టుకుని..వాడిని అడిగాను. 
నూటికి నూరు శాతం మంది చంద్రబాబు వైపే ఉన్నారంటావా? అని అడిగాను.
అవునురా..నూటికి నూరు శాతం మంది చంద్రబాబు వైపే చూస్తున్నార్రా అన్నాడు.
నాకు అప్పటికీ అర్ధం కాలేదు.

ఒరేయ్ నేను సీరియస్ గా అడుగుతున్నానురా...నిజంగానే నూటికి నూరు శాతం మంది చంద్రబాబు వైపే ఉన్నారంటావా? అని అడిగాను.
వాడు నవ్వేసి నిజంరా బాబూ..నీ మీద ఒట్టు. నూటికి నూరు శాతం మంది చంద్రబాబు వైపే చూస్తున్నారు అన్నాడు.
అంటే చంద్రబాబు నాయుడిగారి పాలన అంత బాగుందంటావా? అని అడిగాను.
వాడు వెటకారంగా నవ్వేసి అది నాకు తెలీదు కానీ..జనం మాత్రం ఆయన ఎప్పుడు తమ దగ్గరకి వస్తారా అని ఎదురు చూస్తున్నార్రా అన్నాడు.
నాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది.
ఓ నలభై శాతం మందో..యాభై శాతం మందో..మరీ కాదంటే అరవై శాతం మందో ప్రభుత్వం వైపు ఉన్నారన్నా  నమ్మలేని పరిస్థితి. అలాంటిది ఏకంగా నూటికి నూరు శాతం మంది ప్రభుత్వం వైపు ఉండడమేంటా అని నేను అయోమయంగా చూస్తున్నారు.
నా పరిస్థితిని అర్ధం చేసుకున్న మా వాడు చెప్పడం మొదలు పెట్టాడు.

"ఒరేయ్ ఇపుడు రైతులు ఉన్నార్రా. వాళ్లంతా రుణమాఫీ ఎప్పుడు జరుగుద్దా అని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు కదా చంద్రబాబు. అది  నెరవేర్చలేదాయె. చంద్రబాబు కనిపిస్తే మా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు సారూ అని కాలర్ పట్టుకుని నిలదీయడానికి రైతులంతా చంద్రబాబు వైపు చూస్తున్నారు.
డ్వాక్రా మహిళలు ఉన్నారు కదా.  వాళ్లు కూడా రుణమాఫీ ఎప్పుడు చేత్తావు దొరా అని నిలదీయడానికి రెడీగా ఉన్నారు. బిజెపితో కలిసి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు కదా. అది ఎప్పుడు తెస్తారు బాబూ అని కడిగి పారేయడానికి మొత్తం జనం అంతా  కోపంగా గుర్రుమంటూ చూస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు కదా. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగమూ లేదు.భృతీ లేదు. మా సంగతేంటి బాబూ అని  అడగడానికి యువతీ యువకులంతా ఉస్సూరు మంటూ ఎదురు చూస్తున్నారు. కాపులను బిసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు కదా. ఆ హామీ నెరవేర్చకపోగా కాపులకు..బిసిలకు మధ్య చిచ్చు పెడుతున్నారు కదా చంద్రబాబు.దానిపై  ఆయన్ని నిలదీయడానికి కాపులు..బీసీలు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.  ఇలా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ కూడా  చంద్రబాబు నాయుడి పాలనలో తమకు ఏ మేలూ జరగలేదని ముఖం మీదే చెప్పేయాలని చాలా కసిగా ఎదురు చూస్తున్నారు. అంటే రాష్ట్రంలో నూటికి నూరు శాతం మందీ కూడా చంద్రబాబు వైపే చాలా కోపంగా చూస్తున్నారు. పాపం చంద్రబాబు నాయుడికి మొహమాటం ఎక్కువ కాబట్టి సర్వే చేసేవాళ్లని పిలిచి  తన వైపు నూటికి 80 మంది ఉన్నారని చెప్పమన్నాడు. సర్వేవాళ్లు అదే చెప్పారు. నిజానికి నూటికి నూరు మందీ కూడా చంద్రబాబు ప్రభుత్వం వైపే చాలా ఆగ్రహంగా చూస్తున్నారన్నమాట" అన్నాడు మావాడు.

నాకు ఒళ్లు మండింది. 
ఏ విషయం కూడా సరిగ్గా స్పష్టంగా చెప్పడం రాదేంట్రా నీకూ అని కోపంగా అడిగేశాను.
వాడు నా వైపు జాలిగా చూసి ..గట్టిగా నవ్వేశాడు.
నాకూ కోపం వచ్చింది. చంద్రబాబుకి ఫాలోయింగ్ ఎక్కువరా అన్నాను.
మా వాడు మళ్లీ నవ్వేసి అవున్రోయ్..అందరూ బాబు నే వెంటాడుతున్నారు.  అని నర్మగర్భంగా  అన్నాడు.
అందులో ఏదో మడత పేచీ ఉందేమో అని అనిపించింది.
కానీ అదేంటో నా మట్టి బుర్రకి అర్ధం కాలేదు.
---------------------
-కవికాకి
----------------------

Back to Top