చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్.. 

యువతను మోసం చేయడంతో బాబు సిద్ధహస్తుడు 

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు జక్కంపూడి రాజా మండిపాటు

తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం ప్రచారంలో ముందంజలో ఉన్నా, పనితీరులో మాత్రం పూర్తిగా వెనుకబడి ఉందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు జక్కంపూడి రాజా జక్కంపూడి రాజా విమర్శించారు. సోమ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ..కూట‌మి ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు.  “యువతను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. 2014, 2024 ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లు దోచుకుని, గెలిచాక వారిని పూర్తిగా మోసం చేశారు” అని అన్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు.

జాబ్ క్యాలెండర్ ఓ బూట‌కం
ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హంగామా చేసిన ప్రభుత్వం, చివరికి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని జ‌క్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, కేవలం 10 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులపై అన్యాయం అని అన్నారు. “ఇది ఉగాది పచ్చడి పెట్టినట్లా… లేక నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినట్లా?” అని ప్రశ్నించారు.

 ఉద్యోగాల కోతలు
2025 డిసెంబర్ నాటికి 10.07 లక్షల ఉద్యోగాల సంఖ్య తగ్గిందని, గత రెండేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. అలాగే 2.66 లక్షల మంది వాలంటర్లను రోడ్డున పారేశారని విమర్శించారు. మరోవైపు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలంలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, 58 వేల మంది ఆర్టీసీ కార్మికులను రెగ్యులర్ చేశామని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ అంశంపై మంత్రి లోకేష్ గానీ, టిడిపి నాయకులతో గానీ ఎప్పుడైనా చర్చకు సిద్ధమని జక్కంపూడి రాజా సవాల్ విసిరారు. త్వరలో ఈ అంశంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు.

 పెట్టుబడులపై ఆందోళన 
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంతో పెట్టుబడులు పెట్టాల్సిన కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయని, కొత్త ఉద్యోగాలు రావడం దూరమైపోయిందని అన్నారు. “కొత్త ఉద్యోగాలు రావడం దేవుడెరుగు… ఉన్న ఉద్యోగాలే పోతున్న పరిస్థితి ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Back to Top