తాడేపల్లి: మోసం చేయడమే చంద్రబాబు నైజం అని, ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన హామీలేవీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్న విషయం ఆరు నెలల్లోనే తేలిపోయిందని వైయస్ఆర్‌సీపీ మహిళా నాయకురాలు, ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాలను వంచించాయని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె ఆక్షేపించారు. మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది: – ఎన్నికలకు ముందు మాట చెప్పడం.. అధికారంలోకి వచ్చాక మోసం చేయడం చంద్రబాబుకి తెలిసిన విద్య. – రైతులు ఏ విధంగానూ నష్టపోకూడదని గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ వారికి ఎంతో అండగా నిలబడ్డారు. విత్తనం నుంచి పంటల విక్రయం వరకు వారికి అడగుడుగునా తోడుగా నిలబడ్డారు. – అంతకు ముందు 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారు. చంద్రబాబు మీద రైతు వ్యతిరేకి అనే ముద్ర ఉంది. రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ధాన్యం సేకరణ, ఎమ్మెస్పీ లేదు: – కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో రైతన్నలు దారుణంగా మోసపోయారు. వారు అన్ని విధాలుగా నష్టపోయారు. రైతులకు ప్రకటించిన రూ.20 వేల పెట్టుబడి సాయం లేదు. వారికి తగిన విత్తనాలు, ఎరువులు అందడం లేదు. – ఎలాగోలా కష్టపడి పంట పండించినా ఇప్పుడు ధాన్యం సేకరణ సక్రమంగా లేదు. కనీస మద్దతు ధర అంతకన్నా లేదు. నాడు వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ధాన్యం రంగు మారినా, తడిసినా, మొలకెత్తినా రైతులను వేధించకుండా కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తేమ శాతం పేరుతో రైతును దోచుకుంటున్నారు. – పంటలకు కనీస మద్దతు ధర చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దళారులు, మిల్లర్లు కలిసి రైతు కష్టాన్ని దోచుకు తింటున్నారు. – ఒకప్పుడు రైతుకు అండగా నిలిచిన ఆర్బీకే వ్యవస్థను సర్వనాశనం చేశారు. నాడు మద్దతు ధర దక్కడం లేదని ఏ ఒక్క రైతు కూడా రోడ్డుమీదకొచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది నేడు ఒక్క రైతుకైనా మద్దతు ధర లభించిందా?. రైతులంతా రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు. – కర్నూలులో టమోట రైతు 50 పైసలకు తెగనమ్ముతుంటే, హెరిటేజ్‌తోపాటు బయట మార్కెట్‌లో కేజీ రూ.50 పెట్టి కొనాల్సి వస్తోంది. బాబు పాలనలో ఇంత దారుణంగా ఉంది రైతుల పరిస్థితి. – 75 కేజీల ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1725 ఎక్కడా లభించడం లేదు. ప్రతి బస్తాపై రైతులు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. వైయస్ఆర్‌సీపీ రైతు పోరు: – తీవ్ర దుర్భర స్థితి ఎదుర్కొంటున్న రైతులకు న్యాయం చేసే దిశలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ కార్యక్రమం చేపట్టింది. – ధాన్యానికి కనీసం మద్ధతు ధర కల్పించడంతో పాటు, ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పార్టీ కోరుతోంది. మరో డైవర్షన్: – దీంతో ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయట పడతాయనే భయంతో చంద్రబాబు, ఎక్కడిక్కడ పోలీసులను ప్రయోగించి మా పార్టీ నాయకులను అడ్డుకున్నారు. మీడియాపైనా ఆంక్షలు విధించారు. – మరోవైపు విజన్ డాక్యుమెంట్–2047 పేరుతో నానా హంగామా చేస్తున్నారు. ఇలా అడ్డదారిలో కుటిలమైన రాజకీయాలు చేయడమే చంద్రబాబుకి తెలిసిన విద్య. – చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు అర్థమైంది. ఆయన కష్టాలను నేరుగా అనుభవిస్తున్న ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తమది మంచి ప్రభుత్వమని మీడియా ద్వారా ఎంత ఊదరగొట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నాడు కచ్చితంగా మద్దతు ధర. అదనపు లాభం: – వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంటలకు కచ్చితంగా మద్దతు ధర లభించింది. అందుకోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలు ధాన్యం సేకరణ వరకు కూడా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు మేలు చేసేలా వ్యవహరించారు. – నాడు వైయస్ జగన్ పాలనలో పారదర్శకంగా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గన్నీ బ్యాగ్‌లు, లేబర్, రవాణా (జీఎల్‌టీ) ఛార్జీలు. అవన్నీ ప్రభుత్వమే భరించింది. టన్ను ధాన్యం 25 కిమీల రవాణాకు రూ.468, టన్ను ధాన్యం గోనె సంచులకు రూ. 85, టన్ను ధాన్యంపై హమాలీలకు రూ.220 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. – అదే విధంగా రూ.1750 కనీస మద్దతు ధర. ఒకవైపు తప్పనిసరిగా కనీస మద్దతు ధర. మరోవైపు జీఎల్‌టీ మొత్తాన్ని ప్రభుత్వం భరించడం వల్ల, రైతులకు రెండు విధాలుగా ప్రయోజనం కలిగింది. వాటితోపాటు ధాన్యం తరలించేందుకు ఇబ్బంది లేకుండా ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున కార్పన్ ఫండ్ కేటాయించారు. – 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో 17.94 లక్షల రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరించగా, ఆ తర్వాత 5 ఏళ్లలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 39.10 లక్షల రైతుల నుంచి రూ.67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?: – హైదరాబాద్‌లో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మరణిస్తే, హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో తొక్కిసలాటకు 29 మంది బలయ్యారు. ఆ ఘటనకు పూర్తి బాధ్యుడు అప్పటి సీఎం చంద్రబాబు. మరి ఆ లెక్కన చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?. – కందుకూరులో ఇరుకు సందులో మీటింగ్ పెట్టి ఏడుగురిని, మరో చోట చీరల పంపిణీ పేరుతో చేసిన ప్రహసనానికి ముగ్గురు బలయ్యారు. – ఇంత మందిని బలిగొన్న చంద్రబాబు సంతోషంగా బయట తిరగడం అత్యంత దారుణం. ఇంత మందిని దగా చేసిన చంద్రబాబు ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోక తప్పదని నందమూరి లక్ష్మీపార్వతి తేల్చి చెప్పారు.