విజయనగరం : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన ద్వారాలు తెరిచే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్ఆర్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ మొదలు నిర్వాసితుల పునరావాసం, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, జీఎంఆర్‌తో ఒప్పందాలు, మౌలిక సదుపాయాల కల్పన వరకు ప్రతి కీలక ప్రక్రియ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తుచేశారు. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావడం హర్షణీయం విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడాన్ని వైయస్ఆర్‌సీపీ హర్షిస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడే ప్రతి ప్రాజెక్టును మేము స్వాగతిస్తాం. అయితే ఆ ప్రాజెక్టు సాకారం కావడానికి ఎవరు ఏం చేశారన్న వాస్తవాలను కూడా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. భూసేకరణ నుంచి అనుమతుల వరకు జగన్ ప్రభుత్వంలోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో అత్యంత కీలకమైన భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులు, జీఎంఆర్ సంస్థతో ఒప్పందాలు, నిర్మాణానికి అవసరమైన ఆర్థిక మద్దతు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన ప్రక్రియలన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. విమానాశ్రయానికి అవసరమైన భూముల సేకరణను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు భూములు కోల్పోయిన 404 కుటుంబాలకు పునరావాసం కల్పించాం. మౌలిక వసతుల కోసం వందల కోట్లు విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల కోసం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టింది. విమానాశ్రయం నిర్మాణంతో పాటు దానికి అవసరమైన అనుబంధ మౌలిక వసతులపైనా వైయస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2023 మే 3న శంకుస్థాపన.. చెప్పినట్లుగానే 2026లో పూర్తి 2023 మే 3న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజే 2026 నాటికి విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని స్పష్టంగా ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే పనులు పూర్తయ్యాయి. ఇది వైఎస్ జగన్ దూరదృష్టికి, ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నిదర్శనం. 2019 శంకుస్థాపనతో పరిపాలనా పురోగతి ఏంటి? 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన శంకుస్థాపన తర్వాత పరిపాలనా పరంగా ఎలాంటి పురోగతి జరిగిందో చెప్పాలి. ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన అధికారిక సమాచారంలో కూడా ఆ అంశం లేకపోవడం గమనార్హం. కేవలం శంకుస్థాపన చేయడం వేరు.. ఒక ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, అనుమతులు, ఒప్పందాలు పూర్తి చేసి నిర్మాణాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం వేరు. పూర్తయిన ప్రాజెక్టుకు ఇప్పుడు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని కీలక దశలను పూర్తి చేసుకుని నిర్మాణం సాగిన ప్రాజెక్టుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. క్రెడిట్ దక్కాల్సిన వారికి దక్కాలి. చరిత్రను మార్చే ప్రయత్నాలు సరికావు. రైతులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని పూర్తిగా చెల్లించకుండా ప్రచారానికే పరిమితం కావడం బాధాకరం. కనెక్టివిటీ రోడ్లకు నిధులు తెచ్చింది జగన్ ప్రభుత్వమే విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు అవసరమైన రోడ్ల కోసం కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిధులు సమకూర్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఆ పనులను ఆశించిన స్థాయిలో వేగవంతం చేయలేదు. ఉత్తరాంధ్ర ప్రజల కలను సాకారం చేసింది వైఎస్ జగన్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల. ఆ కలను కార్యరూపంలోకి తీసుకొచ్చి సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే. చరిత్రను వక్రీకరించి క్రెడిట్‌ను మార్చే ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న దూరదృష్టి, చిత్తశుద్ధి వల్లే ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాకారమయ్యాయి’’ అని మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి. సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంత, నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైహింద్ కుమార్, పద్మనాభం ఎంపీపీ కంటుబోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.