కాకినాడ: రాష్ట్రంలో చిన్నారులకు, మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని వైయస్ఆర్‌సీపీ నాయకురాలు వంగాగీత కూటమీ ప్రభుత్వాన్ని కోరారు. పిఠాపురంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పిఠాపురంలో అఘాయిత్యానికి గురైన దళిత బాలికను వంగా గీత బుధవారం పరామర్శించారు. కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలితో మాట్లాడారు. అనంతరం, వంగా గీత మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం సెంటర్‌లో మిట్ట మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలో జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని ఘటనలు చాలానే ఉన్నాయి. నేరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.