అమరావతి: రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులు సత్తా చాటారు. అదే జోరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనిపిస్తోంది. మున్సిపాలిటీల్లో వైయస్ఆర్‌సీపీ జెండా రెపరెపలాడుతోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైయస్ఆర్‌సీపీ తన హవాను కొనసాగించింది. వైయస్ఆర్ జిల్లాలో తిరుగేలేదు.. పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో 31 వార్డులు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ లోని 20 వార్డుల్లో 12 స్థానాల్లో, బద్వేలు మున్సిపాలిటీలోని 35 వార్డులకు గాను 10 వార్డుల్లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులకు గాను 9 వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైయస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు కార్పొరేషన్‌లో వైయస్ఆర్‌సీపీ పాగా.. చిత్తూరు కార్పొరేషన్ పరిధలోని 50 డివిజన్లకు గాను 30 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైయస్సార్సీపీ కైవసం చేసుకంది. దీంతోపాటు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైయస్సార్సీపీ ఖాతాలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను వైయస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, నగరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 16 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 19 డివిజన్లను వైయస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. వైయస్ఆర్ సీపీ ఖాతాలో డోన్, ఆత్మకూరు మున్సిపాలిటీలు.. కర్నూల్ జిల్లాలోని డోన్, ఆత్మకూరు మున్సిపాలిటీలను వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. డోన్ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు గాను 22 వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరధిలోని 24 వార్డులకు గాను 15 వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు కార్పొరేషన్‌లోని 34, 35 డివిజన్లలో వైయస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో, ఆదోని మున్సిపాలిటీలో 9 వార్డుల్లో, నందికొట్కూరు మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 4 వార్డులో వైయస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్ కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డులు వైయస్సార్సీపీ ఖాతాలో చేరాయి. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నివాసం ఉండే 15వ వార్డులో వైయస్సార్సీపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ నుంచి టీడీపీ అభ్యర్థి నాగమణి వైదొలగడంతో ఈ వార్డు వైయస్సార్సీపీ ఖాతాలో చేరింది. తిరువూరు నగర పంచాయతీలోనూ వైయస్సార్సీపీ 2 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డులకు గాను 3 వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. గిద్దలూరు మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైయస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవం. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ 33 వార్డులకు 33 వార్డులు వైయస్ఆర్‌సీపీ ఖాతాలో చేరాయి. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాలిటీల్లోనూ వైయస్సార్సీపీ హవా కొనసాగింది. రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులను, తుని మున్సిపాలిటీలోని 30 వార్డులకుగాను 15 వార్డులను వైయస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డులు, ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డులు, గుంతకల్లు మున్సిపాలిటీలోని 3 వార్డులు, తాడిపత్రిలో 2 వార్డులను వైయస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. విశాఖ జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డులను వైయఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో వైయస్సార్సీపీ 9 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 25 వార్డులకు గాను 13 వార్డుల్లో, ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 6 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.