సచివాలయం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం ప్రకటించినట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రజల ఆస్తిగానే ఉండాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేస్తుందని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నయ మార్గాలు సూచించారని తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పేర్నినాని మాట్లాడారు. సుదీర్ఘకాలం ప్రతి తెలుగు వాడు కూడా పోరాటం చేసి సుమారు 30 మంది తెలుగు ప్రజలు తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టారు. ఆత్మ బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని, కావాల్సిన ప్రత్యామ్నయ మార్గాలను వైయస్ జగన్ కేంద్రానికి వ్యక్తిగతంగాను, రాతపూర్వకంగా తెలియజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు వైయస్ జగన్ ప్రభుత్వం సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. ఈ బంద్‌కు ప్రభుత్వ సహకారం అందించడంతో పాటు, ప్రజాజీవనం స్తంభించడంతో వ్యక్తిగత, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం రేపు మధ్యాహ్నం తరువాత నడుపుతాం. ఒంటి గంట తరువాత రోడ్లపైకి వచ్చే ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపేందుకు ప్రతి ఒక్కరూ నల్లబ్యాడ్జిలు ధరించి విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోసారి ఏపీ ప్రభుత్వం మోదీని, కేంద్రాన్ని కోరుతోంది. ప్రత్యామ్నయ మార్గాలను పరిగణలోకి తీసుకొని ఆచరణలో పెట్టుకొని విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని మరొక్కసారి డిమాండు చేస్తున్నామని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు.కొన్ని వందల మంది జీవితాలతో ముడిపడిన పరిశ్రమను ప్రత్యామ్నయం లేని సమయంలో మాత్రమే ప్రైవేటీకరణ చేయాలని సూచించారు. ప్రత్యామ్నయ మార్గాలు మన ముందు ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నయ మార్గాలు కొనసాగించడం దేశానికి, ప్రజలకు శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు.