విద్యార్థుల‌కు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమ‌లు చేస్తారు లోకేష్‌

సూటిగా ప్ర‌శ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్

అనంతపురం : అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న‌ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సమస్యలపై స్పష్టమైన హామీ ఇస్తారా? లేక మళ్లీ ఖాళీ మాటలతోనే సరిపెడతారా? అని వైయ‌స్ఆర్‌  విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన నిధుల హామీలు ఇప్పటికీ అమలు కాలేదని మండిపడ్డారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరుకోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ఫీజులు చెల్లించలేక వేలాది మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే నిలిపివేసి కూలీ పనులకు వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఫీజు బకాయిల కారణంగా అనేక కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయడం, పరీక్షలకు అనుమతించకపోవడం వంటి ఘటనలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని విమర్శించారు.

రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితులు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల భారం, నిరుద్యోగ భయం కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రంలోని అనేక హాస్టళ్లలో తాగునీరు, పరిశుభ్రమైన ఆహారం, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఎన్నికల ముందు విద్యా రంగ అభివృద్ధి, పేద విద్యార్థుల సంక్షేమం పేరుతో పెద్దఎత్తున హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలన్నీ విడుదల చేసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని చంద్రశేఖర్ యాదవ్ హెచ్చరించారు.
 

Back to Top