కుందువానిపేటలో సామూహిక‌ గృహప్రవేశాలు

 హుదుహుద్ ఇళ్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

శ్రీకాకుళం జిల్లా : వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన హుదుహుద్ ఇళ్లలో లబ్ధిదారులకు గృహప్రవేశం చేయనివ్వకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకోవ‌డంతో మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఆధ్వ‌ర్యంలో సామూహిక గృహ ప్ర‌వేశాలు నిర్వ‌హించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులను ఇళ్లకు తీసుకెళ్లి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందుకోసం రూ.12 వేల కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించామని తెలిపారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో కొత్త కాలనీలు నిర్మించామని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ నిలిచిపోయాయని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. “సంపద సృష్టిస్తాం, మరింతగా అభివృద్ధి చేస్తాం” అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు పేదల అవసరాలపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తయిన ఇళ్లకే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు నిర్మించడం చిన్న విషయం కాదని, అందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి, కనికరం అవసరమని ధర్మాన పేర్కొన్నారు. వైయస్సార్, తర్వాత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలోనే పేదల కోసం నిజమైన సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని అన్నారు.  ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో లబ్ధిదారులు ప్రవేశించకుండా మధ్యలో బ్రోకర్లు, అధికార పార్టీ నాయకులు అడ్డుపడటం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు సంబంధించిన శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఉన్నప్పటికీ అక్రమంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అందుకే లబ్ధిదారులను స్వయంగా తీసుకువచ్చి గృహప్రవేశం చేయించామని తెలిపారు.

రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా దిగజారిపోయిందని ధర్మాన తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు కాకపోవడం, సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం కావడం, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రజలకు సంబంధించిన ఏ వ్యవస్థ కూడా సమర్థంగా పనిచేయడం లేదని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదన్నారు. జొన్న రైతులకు రూ.2400 మద్దతు ధర ఇస్తామని చెప్పి చివరకు కొనలేమని చెప్పడం మోసమని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేక బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.

మత్స్యకారుల కోసం రూ.360 కోట్లతో బుడగట్లపాలెంలో మంజూరైన ఫిషింగ్ హార్బర్ పనులను కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే స్థానిక మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగేవని, గుజరాత్‌కు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదికాదన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే ప్రభుత్వాలను గుర్తించాలని, ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ధర్మాన ప్రజలకు సూచించారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలవవని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ధ‌ర్మాన‌ హెచ్చరించారు.
 

Back to Top