నరకానికి కేరాఫ్ గా మారిన సంక్షేమ హాస్టళ్ళు

హాస్టల్ విద్యార్థుల్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్‌

ఎన్టీఆర్ జిల్లా:  సంక్షేమ వసతి గృహలు నరకానికి కేరాఫ్ గా మారాయని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్  ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర  మండిప‌డ్డారు. సంక్షేమ వసతి గృహల సమస్యలపై   జి. కొండూరు మండలం కుంటముక్కల  డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల  వసతి గృహాన్ని స్థానిక ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ, గ్రామ సర్పంచ్ కుమారి లతో కలిసి బుధవారం సందర్శించారు.  విద్యార్థులతో మాట్లాడారు. వంటశాలని పరిశీలించారు. భోజనం, కూర, సాంబారు నాణ్యతను రుచి చూశారు.  బాత్ రూమ్, మరుగుదొడ్ల ని పరిశీలించారు. 

ఈ సంద‌ర్భంగా మీడియాతో  రవిచంద్ర, లక్ష్మి తిరుపతమ్మ  మాట్లాడుతూ.. కుంటముక్కల లోని డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల హాస్టల్ వసతి గృహంలో నెలకొన్న సమస్యల్ని సంక్షేమాధికారులు విస్మరించారన్నారు.  మొత్తం 715 మంది ఉంటున్న హాస్టల్ లో భోజనం నాసిరకంగా ఉందన్నారు. కూరగాయలు కుళ్ళిపోతున్నాయన్నారు. వంటశాల పక్కనే మురుగునీరు, వ్యర్ధాలు పడేస్తున్నారన్నారు. దీనివల్ల ఈగలు, దుర్గంధం వస్తున్నా కుడా పట్టించుకోవడం లేదన్నారు. ఈడుపుగళ్ళు నుండి ఇక్కడికి మార్చిన ఐఐటీ, నీట్ మెడికల్ అకాడమీ లో విద్యార్థుల బోధనకి బోటనీ, కెమిస్ట్రీ అధ్యాపకుల్ని ప్రభుత్వం ఇప్పటి వరకూ నియమించ లేదని తెలిపారు. అధ్యాపకుల నియామకం లేకుండా కార్పొరేట్ కళాశాలలతో ప్రభుత్వ ఐఐటీ అకాడమీ విద్యార్థులు ఎలా పోటీ పడతారని ప్రశ్నించారు. హాస్టళ్ళ నిర్వహణ అధ్వాన్నంగా ఉందన్నారు. కనీస వసతులు కల్పించడం లేదన్నారు. సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ నిలయాలుగా మారాయన్నారు. గతేడాది నుండి సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి ప్రభుత్వం ఒక్క రూపాయి కుడా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని విమర్శించారు. సమీక్షా సమావేశాలకు టీ, బిస్కెట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న మంత్రి లోకేష్ కి దళిత, గిరిజన, బహుజన విద్యార్థుల అవస్థలు కనిపించడం లేదాని ప్రశ్నించారు. లోకేష్ కుమారుడిని హాస్టల్లో చేర్పిస్తే విద్యార్థుల వెతలు లోకేష్ కి అర్ధమవుతుందన్నారు. గత జగన్ ప్రభుత్వం పాఠశాల హాస్టల్ విద్యార్థులకు 850 రూపాయల నుండి 1400 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచిందన్నారు. కేవలం 75 రూపాయలున్న కాస్మోటిక్ ఛార్జీలు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తే జగన్ అధికారం చేపట్టగానే దాన్ని 170 రూపాయలకి పెంచారని తెలిపారు. 

ప్రతీ వసతి గృహంలో విద్యార్థులకి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని నాటి సీఎం వైయ‌స్ జగన్ అందించారని ర‌విచంద్ర‌ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా కుడా విద్యార్థులకి డైట్ ఛార్జీలు పెంచలేక విద్యార్థుల్ని గాలికొదిలేసిందని దుయ్య బట్టారు. మరుగుదొడ్లు, బాత్ రూమ్ లు అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు. వీటి నిర్వహణను విస్మరించిందన్నారు. దోమ తెరలు, చాపలు, పెట్టెలు, దుప్పట్లు, గ్లాసులు ఇంకా విద్యార్థులకు పంపిణీ చేయలేదన్నారు. హాస్టళ్ళ నిర్వహణకు 143 కోట్లు కేటాయించామని సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి డోలా వీరాంజనేయులు ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. కేటాయించిన 143 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని మంత్రి ని ప్రశ్నించారు. ఏ రోజు ఏమి భోజనం, కూరలు అందిస్తున్నారో జగన్ హయాంలో మెనూ ప్రకారం టంచన్ గా అందించారన్నారు. కూటమి ఏడాది పాలనలో మెనూ అమలు లేదు. మెనూ చార్టులు లేవన్నారు. కేవలం ప్రచారం తప్ప సంక్షేమం లేదని పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచి పరిష్కారం అయ్యేంత వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. హాస్టల్ ని సందర్శించినవారిలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు వై. నంద రెడ్డి, వెంకటాపురం ఎంపీటీసీ వై. విజయ శ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్ రెడ్డి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి,  మండల అధ్యక్షులు జె. నాగ తేజ సాయి, నాయకులు ఐ. శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Back to Top