స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ డిమాండ్‌

విశాఖపట్నం వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ.

స్టీల్‌ ప్లాంట్‌పై చంద్రబాబువి దుర్మార్గమైన వ్యాఖ్యలు

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చర్యలను ఆయన అడ్డుకోవాలి

లేని పక్షంలో ఆయన ఆంధ్రద్రోహిగా మిగలడం ఖాయం

చంద్రబాబుపై కొండా రాజీవ్‌ ధ్వజం

కోవిడ్‌ టైంలో హైదరాబాద్‌ ఇంట్లో పడుకుంది చంద్రబాబే

నాడూ పని చేసి ఆక్సిజన్‌ అందించిన వీఎస్‌పీ కార్మికులు

అలాంటి కార్మికులపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు

స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఎన్నికల ముందు ఒకమాట

ఆ తర్వాత మరోమాట. సంస్థ ప్రైవేటీకరణకే మొగ్గు

స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు సీఎం చంద్రబాబు ద్రోహం

ప్రెస్‌మీట్‌లో కొండా రాజీవ్‌ తీవ్ర ఆక్షేపణ

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వంతో నవరత్నాలు హోదా పొందిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వైట్‌ ఎలిఫెంట్‌ అంటూ, కార్మికులు ఇళ్లల్లో పడుకుని జీతాలు అడుగుతున్నారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు వెంటనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చర్యలను ఇకనైనా సీఎం చంద్రబాబు అడ్డుకోవాలని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన కొండా రాజీవ్‌ స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయన ఆంధ్ర ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో కొండా రాజీవ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

సంస్థ ప్రైవేటుపరమే బాబు లక్ష్యం:
    ఉత్తరాంధ్ర ప్రగతితో పాటు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి దశ, దిశను మార్చిన గొప్ప సంస్థ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌. విశాఖ నగరాన్ని ఏకంగా ఉక్కు నగరం అని పిల్చుకునే స్థాయికి తీసుకెళ్లింది ఆ సంస్థ. అలాంటి స్టీల్‌ ప్లాంట్‌ను అవహేళన చేయడంతో పాటు, అందులో పని చేసే కార్మికులను కూడా చంద్రబాబు అవమానించేలా మాట్లాడ్డం బాధాకరం. కేవలం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ రకంగా మాట్లాడారు. 
    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్నదే కూటమి ప్రభుత్వ నిర్ణయమైతే, అదే మీ పరిపాలన విధానం అయితే ఎన్నికల ముందు ఎందుకు ఈ మాట చెప్పలేదు చంద్రబాబూ?. ఎన్నికల మందు ప్లాంట్‌ కార్మికుల వద్దకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పి వారిని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఆ తర్వాత వారి అవసరం లేదు కాబట్టి, అదే కార్మికులను నోటికొచ్చినట్లు నిందిస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అత్యధిక మెజార్టీ అందించిన నియోజకవర్గం గాజువాక. అక్కడ సింహభాగం ఓట్లు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులవే. మీ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గంలో ఉన్న అతి పెద్ద సంస్థ అయిన స్టీల్‌ ప్లాంటునే మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే.. రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల పరిస్ధితి ఏంటన్నది చెప్పనవరం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం అవసరం లేదు. 

కార్మికుల కష్టం, త్యాగం గుర్తులేదా బాబూ?:
    ఇంటికి తాళాలు వేసుకుని పడుకుంది కార్మికులు కాదు. కరోనా వంటి విపత్తులు సంభవించినప్పుడు చంద్రబాబునాయుడే హైదారాబాద్‌లో తన ఇంటికి తాళాలు వేసుకుని పడుకున్నారు. ఆ సమయంలో కూడా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి, కోవిడ్‌ సమయంలో దేశానికి ఊపిరిలూదారు. అలాంటి కార్మికులను ఇంత అవమానకరంగా మాట్లాడ్డం సిగ్గుచేటు.
    సంస్థ ప్రైవేటీకరణ మీ స్టాండ్‌ అని ఎన్నికల ముందు చెప్పకుండా కార్మికులను మోసం చేశారు. అదే సయమంలో నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేశారు. కానీ వాస్తవం ప్రజలకు, కార్మికులకు అర్ధమయింది. జగన్‌గారు పదవిలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద ఈగ వాలనివ్వలేదు. కేవలం ఆయన వల్లనే ఆ 5 ఏళ్లు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కూడా చెప్పారు.

కూటమి ప్రభుత్వం రాగానే..:
    గత ఏడాది ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు, కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగిస్తున్నారు. మిగిలిన వారిని వీఆర్‌ఎస్‌ పేరుతో సాగనంపుతున్నారు. పదవీ విరమణ చేసిన వారి స్ధానంలో కొత్త నియామకాలు లేవు. మరోవైపు స్టీల్‌ ప్లాంట్‌ను 32 విభాగాలు చేసి, అమ్మేసే పని మొదలుపెట్టారు. ఆ దిశలో మరో ముందడుగే.. మొన్నటి (శనివారం) చంద్రబాబు వ్యాఖ్యలు.
    స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుతున్నామని, అందుకోసం కేంద్రం నుంచి ప్యాకేజీ కూడా సాధించామని పదే పదే కూటమి నేతలు, ఆ ప్యాకేజీలో కనీసం ఒక్క రూపాయి అయినా కార్మికుల సంక్షేమం కోసం వారి ఖాతాల్లోకి వెళ్లిందని చూíపగలరా? లేదా ప్యాకేజీ డబ్బులతో స్టీల్‌ ప్లాంట్‌ను ఆధునికీకకించారా? అవసరమైన ముడిసరుకు కొన్నారా?. ఆ నిధులతో ఏం చేశారో చెప్పండి.
    నిజానికి ఆ ప్యాకేజీ సంస్థ బ్యాంక్‌ రుణాలకే సరిపోయింది. అంటే ప్లాంట్‌ను కాపాడుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పని చేయడం లేదని స్పష్టమవుతోంది. భిలాయ్, భద్రావతి, సేలం వంటి చోట్ల ఉన్న స్టీల్‌ ప్లాంట్లకు రూ.65 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. మరి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏం పాపం చేసింది?. అది కేవలం సీఎం చంద్రబాబు అసమర్థత కాదా?.

చంద్రబాబు స్టీల్‌ప్లాంట్‌ ద్రోహి:
    ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజల దృష్టిలో ఏ విధంగా అయితే ద్రోహులుగా మిగిలిపోయారో.. అదే విధంగా స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కూడా చంద్రబాబుగారు చరిత్ర మర్చిపోలేని ద్రోహిగా మిగలడం ఖాయం. చంద్రబాబు స్టీల్‌ ప్లాంట్‌ ద్రోహి. 
    తాము గత ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెల్చి, కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎందుకు కాపాడలేకపోతున్నారు?. అందుకే ఇప్పటికైనా ప్రచారాలు, డాబు, దర్పాలను పక్కనపెట్టి స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏం చేయబోతున్నారో చంద్రబాబుగారు చెప్పాలని కొండా రాజీవ్‌గాంధీ స్పష్టం చేశారు.

Back to Top