తాడేపల్లి: అబద్ధాలు, క్రెడిట్ చోరీలతో తనను తాను మేథావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప, రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదని ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. వైయస్ఆర్ కడప జిల్లాలో రెండో విడత అన్నదాత సుఖీభవ నగదు జమ సందర్భంగా చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై మండిపడ్డారు. ఈ ఒక్క పథకం ద్వారా రెండేళ్లలో రైతులకు దాదాపు రూ. 17 వేల కోట్లు మోసం చేశాడని వివరించారు. ఏకంగా 7 లక్షల మంది రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో కేంద్రం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండానే అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకి ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానని నమ్మించి తీరా గెలిచాక రెండేళ్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం కౌలు రైతులను అసలు రైతులుగానే గుర్తించడం లేదని, ఏడాదిన్నర కూటమి పాలనలో వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకున్న పాపాన పోలేదని చెప్పారు. పథకంలో 7 లక్షల మంది రైతులు ఎందుకు తగ్గిపోయారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● పంచ సూత్రాలు కాదు.. పచ్చి అబద్ధాలు మార్కెటింగ్ చేసుకునే సామర్థ్యం తప్ప, ప్రజలకు మేలు చేసే ఆలోచన లేని నాయకుడు దేశంలో చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఉండరు. ప్రపంచంలో ఏదైనా బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని దానిపై ఆయన ముద్రేసుకుని దానికి సృష్టికర్త తానే అన్నట్టు ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకి అలవాటు. వైయస్ఆర్‌సీపీ హయాంలో నాటి సీఎం వైయస్ జగన్ ప్రారంభించిన వైయస్ఆర్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చిన చంద్రబాబు వైయస్ఆర్ కడప జిల్లాలో రెండో విడత నిధులు పంపిణీ కార్యక్రమం చేపట్టాడు. ఈ క్రాప్ చేయడం చేతకాని వ్యక్తి వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తీసుకొస్తానని చెబుతున్నాడు. గడిచిన ఐదేళ్లూ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత మాజీ సీఎం వైయస్ జగన్ గారిదైతే, అకౌంట్‌లో నగదు చేసే విధానం నేనే తీసుకొచ్చానని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నాడు. దళారీ వ్యవస్థ అనేది లేకుండా బటన్ నొక్కి డీబీటీ కింద నగదు జమ చేసిన మొనగాడు వైయస్ జగన్ అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పంచ సూత్రాల పేరుతో పాత పద్ధతిలో వ్యవసాయం చేయొద్దని చెబుతున్నాడు. పంచసూత్రాల పేరుతో ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ విధానాలను తీసుకొచ్చి తానే కనిపెట్టినట్టు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏఒక్క కుటుంబానికి సాయం చేసి ఆదుకున్న పాపానపోలేదు. ● వైయస్ జగన్ చేసిన పనులు చెప్పి క్రెడిట్ చోరీ ఎంతసేపటికీ పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే రైతులకు మేలు చేసే మాట ఒక్కటీ చెప్పలేకపోయాడు. వైయస్ఆర్‌సీపీ హయాంలో సీఎంయాప్‌ను తీసుకొచ్చి రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ చేస్తే చంద్రబాబు కొత్తగా యాప్ తీసుకొస్తానని చెబుతున్నాడు. గ్రోమోర్ సెంటర్ ను చూసి ఆదర్శంగా ఉందని మాట్లాడుతున్న చంద్రబాబు.., గత వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతులకు అండగా అద్భుతంగా పనిచేసి దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు నీతి అయోగ్ తో ప్రశంసలు పొందిన ఆర్బీకే సెంటర్లను నిర్వీర్యం చేశాడు. ఏపీలో అమలవుతున్న ఆర్బీకే వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నీతిఅయోగ్ సూచిస్తే వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే కుట్రతో నిర్వీర్యం చేసి రైతులను నిలువునా ముంచిన నీచుడు చంద్రబాబు. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్‌గా మార్చి అరటి, దానిమ్మ వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన ఘనత వైయస్ జగన్ హయాంలోనే జరిగింది. వేగన్‌లు పెట్టి విదేశాలకు పంపుతామని ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నాడు. వైయస్ జగన్ చేసిన మంచి పనులకు తన స్టాంప్ వేసుకుని క్రెడిట్ చోరీ చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు. గడిచిన ఐదేళ్లలో రైతులకు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిందో సీఎం చంద్రబాబు స్టడీ చేసుంటే ప్రతిదీ కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పుకునేవాడు కాదు. ● ఏడాదిన్నరలో రైతులకు చేసింది శూన్యం రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలో చేసింది శూన్యం. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల అప్పుల గురించి మాట్లాడమంటే యాప్‌ల గురించి చెబుతున్నాడు. నకిలీ విత్తనాలతో శ్రీకాకుళం జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోతే దానిపై చంద్రబాబుకి చీమకుట్టినట్టయినా లేదు. ధరలు పతనమై రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం ఎక్కడా కలగజేసుకుని ఆదుకున్న దాఖలాలు లేవు. మామిడి, మిరప, చెరకు రైతులను ఆదుకుంటామని చెప్పిన మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయి. రైతులకు మేలు జరిగేలా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. రాష్ట్రానికి పట్టెడన్నం పెట్టే రైతులను మోసం చేస్తే చంద్రబాబుకి పుట్టగతులుండవు. ఆఖరుకి 1950లో వచ్చిన అరకు కాఫీని కూడా తానే ప్రోత్సహించానని చంద్రబాబు ప్రమోట్ చేసుకుంటున్నాడు. వ్యవసాయంలో డ్రోన్‌లు పెట్టాలి, డ్రోన్‌లకు కెమెరాలు పెట్టి పురుగులు చూడాలని చెబుతున్న చంద్రబాబు.. రైతులకు సబ్సిడీ మీద పురుగు మందులు అందించే పనిచూడాలి. రైతులకు సంతృప్తి స్థాయిలో యూరియా అందించాలి. మొంథా తుపాన్ కారణంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగిందని చంద్రబాబు చెబుతున్నాడు. రూ.390 కోట్ల మేర మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చాడు. చివరికి ఎకరాకు కేవలం రూ.12 వేలు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. కానీ బిల్డప్‌లు మాత్రం రైతులను ఇప్పటికే ఆదుకున్నట్టే చెప్పుకున్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టి రైతులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించే అవసరం లేకుండా పథకాన్ని అమలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ● 7 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ కోత రైతులు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమానికి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ. 12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు ఇచ్చిన ఘనత వైయస్ జగన్‌దే. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రైతులకు హమీ ఇచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చాక 2024లో రైతు అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. 2025లో రైతుల్లో అసహనం మొదలై ప్రతిపక్షం నిలదీయడంతో మొదటి విడత తూతూమంత్రంగా కొద్దిమంది రైతుల ఖాతాల్లో రూ.5 వేలు జమ చేసి చేతులు దులిపేసుకున్నాడు. వైయస్ఆర్‌సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతుల అకౌంట్‌లలో జమ చేస్తే, చంద్రబాబు ఏకంగా 7 లక్షల మంది రైతులకు కోత విధించి కేవలం 46.85 లక్షల మందికే పథకం వర్తింపజేశాడు. ఒకేసారి 7 లక్షల మంది రైతులకు పథకం వర్తించకుండా ఆగిపోయిందంటే రైతులు వ్యవసాయానికి దూరమైపోతున్నట్టే కదా. అంటే వ్యవసాయం గిట్టుబాటుకాక రైతులు వలస వెళ్లిపోవడమో లేదా కూలీలుగా మారిపోవడమో జరుగుతున్నట్టేగా. లబ్ధిదారుల సంఖ్య పెరగకుండా తగ్గిందంటే ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? లేదంటే పథకం అమలు తూతూమంత్రంగా అమలు చేయాలనే కుట్రతో లబ్ధిదారుల సంఖ్యను ఉద్దేశపూర్వకంగా తగ్గించైనా ఉండాలి. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. డెత్ మ్యుటేషన్ చేసుకోని రైతులకు పథకం ఆపేస్తున్నారు. చేసుకున్న తర్వాత పెండింగ్ నిధులు ఇస్తామని కూడా చెప్పడం లేదు. స్పాట్ లో డెత్ మ్యుటేషన్ చేసేలా ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ఎన్సీపీఐ అకౌంట్ లు మళ్లీ అమల్లోకి తెచ్చినాక నగదు వేస్తామని చెప్పి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేశారు. వారికి భవిష్యత్తులో నిధులు జమ చేస్తాడో లేదో చంద్రబాబు పాలన చూస్తున్న వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ● రైతు భరోసా కింద రూ.34,378 కోట్లు జమ చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.67,500 చొప్పున జమ చేశారు. ఐదేళ్లలో రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.34,378 కోట్లు జమ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 53.58 లక్షల రైతులకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంది. ఆ లెక్కన రెండేళ్లలో రైతుల ఖాతాల్లో రూ.21,433 కోట్లు జమ చేయాల్సి ఉంటే, రూ. 5 వేల చొప్పున 46.85 లక్షల మంది రైతులకు రెండు విడతల్లో ఇచ్చిన మొత్తం కేవలం 4,685 కోట్లు మాత్రమే. రెండేళ్లలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.16,746 కోట్లు కూటమి ప్రభుత్వం బకాయి పడింది. వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేశారు. అందుకోసం భూయజమానుల హక్కులను కాపాడుతూ దాదాపు 26 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందజేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడి సాయం కింద ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకానికి కౌలు రైతులను చంద్రబాబు దూరం చేశాడు. రైతులను మళ్లీ వడ్డీ వ్యాపారులకు బలి చేసే కుట్రలకు బాటలువేశాడు. వైయస్ఆర్‌సీపీ హయాంలో కౌలు రైతులకు రైతు భరోసా, సున్నా వడ్డీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి పథకాలను అమలు చేశారు. వైయస్ఆర్‌సీపీహయాంలో 2019-24 మధ్య 6.78 లక్షల మంది కౌలు రైతులకు రూ.8345 కోట్ల పంట రుణాలు అందజేయడంతోపాటు మరో 5.57 లక్షల మంది ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలకు రూ. 751 కోట్లు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. ఇదికాకుండా 3.55 లక్షల మంది రైతులకు రూ.731 కోట్లు ఉచిత పంటల బీమా, 2.42 లక్షల మంది రైతులకు రూ. 253.56 కోట్లు పరిహారంగా పరిహారంగా ఇచ్చాం. ఎవరు అన్నదాతలను ఆదుకున్న రైతు బాంధవుడో ఈ లెక్కలన్నీ చెబుతాయి. అన్నదాత సుఖీభవ పథకంలో 7 లక్షల మంది లబ్ధిదారులు ఎందుకు తగ్గిపోయారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కౌలు రైతులకు పథకాన్ని అమలు చేయకుండా మోసం చేయడంపై గొంతువిప్పాలి. మద్ధతు ధర దక్కేలా రైతులను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదో రైతులకు చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. చంద్రబాబు ఇప్పటికైనా అబద్ధాల మార్కెటింగ్ మానుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.