రాయచోటి : అన్నమయ్య జిల్లా లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అన్నమయ్య జిల్లాను యథావిధిగా కొనసాగించకపోతే ప్రజాపోరాటాలకు దిగాల్సిందేనని కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాపై కూటమి ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని తీవ్రంగా విమర్శించారు. అన్నమయ్య జిల్లాను విభజించకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాయచోటిలో నిర్వహించిన మహా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. శివాలయం చెక్‌పోస్ట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నేతాజీ సర్కిల్, జామియా మసీదు సర్కిల్, గాంధీ బజార్, వైయస్ఆర్ సర్కిల్ మీదుగా బంగ్లా సర్కిల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా “మదనపల్లి వద్దు – రాయచోటి ముద్దు” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. ఈ ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. జిల్లాను మూడు ముక్కలు చేసేందుకు ప్రయత్నం మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలనే పేరుతో అన్నమయ్య జిల్లాను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లి జిల్లాలో మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాలను చేర్చుతున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని, మిగిలిన రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా కొనసాగుతుందని తొలుత భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తూ, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వస్తోందని తెలిపారు. అదే సమయంలో రాజంపేటను వైయస్ఆర్ జిల్లాలోకి, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి కలుపుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, దీని వెనుక అన్నమయ్య జిల్లానే లేకుండా చేయాలనే కుట్ర ఉందని ఆరోపించారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తొలగిస్తున్నారన్న వార్తలతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టంగా అన్నమయ్య జిల్లాను ఎటువంటి విభజన చేయవద్దని స్థానికులు తమ అభిప్రాయాన్ని వెల్లడించినప్పటికీ, కూటమి ప్రభుత్వం జిల్లాను మూడు ముక్కలు చేసేందుకు సిద్ధమవుతుండడం దుర్మార్గమని విమర్శించారు. నేడో రేపో అన్నమయ్య జిల్లాను విభజించనున్నట్లు సమాచారం రావడం ఆందోళన కలిగిస్తోందని, ఇది పూర్తిగా రాజకీయ క్రీడలో భాగంగానే జరుగుతోందని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జిల్లాల విభజన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అన్నమయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రాయచోటిలో ఆందోళనలు మిన్నంటుతున్నాయని, ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.