చంద్రబాబు వచ్చాకే ఎన్టీఆర్‌ కుటుంబంలో కష్టాలు

ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య మిస్టరీగా మారింది

ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని అనుమానం

కోడెల సెల్‌ఫోన్, ఉమామహేశ్వరి లెటర్‌ ఏమైనట్టు..?

చంద్ర‌బాబును న‌మ్మిన నందమూరి కుటుంబాన్ని చూస్తే జాలేస్తోంది

హరికృష్ణను మానసిక క్షోభకు గురిచేసి హింసించాడు

బాబు దరిద్రపు కొడుకు కోసం జూ.ఎన్టీఆర్‌ను వాడుకొని వదిలేశాడు

చంద్రబాబు ఎంత దుర్మార్గుడో.. ఎన్టీఆరే స్వయంగా చెప్పారు

వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి

తాడేపల్లి: చంద్రబాబు నమ్మి మోసపోతున్న నందమూరి కుటుంబాన్ని చూస్తే జాలేస్తుందని, గొర్రె కసాయివాడిని నమ్మినట్టుగా.. తండ్రి ఎన్టీఆర్‌ చావుకు కారణమైన హంతకుడు చంద్రబాబును నమ్మి కుటుంబమంతా మోసపోతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి అన్నారు. హరికృష్ణ మరణానికి కూడా చంద్రబాబే కారణమని, చంద్రబాబు కారణంగా హరికృష్ణ మానసికక్షోభ అనుభవించాడని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి మరణం తనను కలచివేసిందన్నారు. ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని అనుమానం ఉందన్నారు. ఆత్మహత్యకు ముందు ఉమా మహేశ్వరి రాసిన లెటర్‌ చంద్రబాబు అక్కడకు చేరిన తరువాతే మాయమైందని ఆరోపించారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మి పార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్‌ మరణానికి కారకుడు అయిన హంతకుడు చంద్రబాబును నమ్మిన నందమూరి కుటుంబం. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను చూస్తే జాలేస్తుంది. ఎన్టీఆర్‌ మరణం తరువాత జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే.. ఎన్టీఆర్‌ మరణానికి చంద్రబాబే కారకుడు.. ఆ విషయాన్ని ఎన్టీఆర్‌ స్వయంగా చనిపోకముందు ఆడియో, వీడియోల రూపంలో చెప్పారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో.. ఎటువంటి వెన్నుపోటు తనకు జరిగిందో ఎన్టీఆర్‌ వివరించారు. 

ఆ తరువాత హరికృష్ణ.. ముందు మంత్రి పదవి ఇచ్చాడు.. ఆరు నెలలు తిరక్కుండానే మంత్రి పదవి లాక్కొని మానసిక క్షోభకు గురిచేశాడు. చంద్రబాబు చేసిన పనికి హరికృష్ణ ఒక రకమైన ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోయాడు. హరికృష్ణ చాలా సందర్భాల్లో చాలా తీవ్రంగా చంద్రబాబును విమర్శించారు. అతన్ని ఎదురించాలని ఒక పార్టీకి పెట్టుకొని ప్రయత్నం చేశాడు. చంద్రబాబు చేసిన పనికి హరికృష్ణ చివరి వరకు బాధపడ్డాడు. అందుకే ఈరోజుకూ ఆయన కొడుకులు కల్యాణ్‌రామ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ చంద్రబాబుతో మాట్లాడరు. దానికి కారణం అందరికీ తెలుసు. వాళ్ల నాన్నకు జరిగిన ద్రోహానికి వారు మాట్లాడరు. బాధతోనే హరికృష్ణ ప్రయాణం చేస్తూ మరణించాడు. పరోక్షంగా హరికృష్ణ మరణానికి చంద్రబాబే కారణం అని నేను నమ్ముతున్నాను. 

ఎన్టీఆర్‌ కుటుంబంలో చిచ్చుపెట్టే అధికారం చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు.  ఉమా మహేశ్వరి మరణం కూడా మిస్టరీగా మారింది. నెటిజన్లు చాలా మాట్లాడుతున్నారు.. అందులో కొన్ని నమ్మాల్సినవి, కొన్ని నమ్మలేనివి ఉన్నాయి. ఏదేమైనా చంద్రబాబు వ్యక్తిత్వం, దరిద్రమైన రాజకీయ అధికార దాహం బాగా తెలిసిన మనిషి నేను. ఉమా మహేశ్వరి మరణం వెనుక కూడా ఏదో దాగి ఉందని నేను నమ్ముతున్నాను. సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలే కాకుండా.. పోలీసులు కూడా లెటర్‌ రాసి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. బాగా చదువుకున్న ఉమా మహేశ్వరి.. ఆత్మహత్యకు ముందు తప్పనిసరిగా ఒక లెటర్‌ రాసి ఉంటుంది. లేఖ ఏమైపోయింది..? చంద్రబాబు ఎంటరైన తరువాత ఉత్తరం మాయమైపోయిందని అంటున్నారు. ఇది నేను నమ్ముతున్నాను.

ఎందుకంటే.. కోడెల శివప్రసాద్‌ మరణంలో కూడా ఇలానే జరిగింది. చంద్రబాబు చేసిన అవమానాలకు, అతని కొడుకు చేసిన దుర్మార్గాలకు కోడెల బలైపోతే రాజకీయం చేసి మా ప్రభుత్వం మీద తోశాడు చంద్రబాబు. ఆరోజు కోడెల సెల్‌ఫోన్‌.. ఈరోజు ఉమా మహేశ్వరి ఉత్తరం ఏమైపోయాయి. చంద్రబాబు చేసిన అవమానం వల్లే చనిపోతున్నానని కోడెల వాయిస్‌ రికార్డు చేశారు కనుకనే ఆ ఫోన్‌ను బాబు దొంగిలించాడు. నందమూరి కుటుంబంలో చంద్రబాబు అనే వ్యక్తి లేకపోతే ప్రశాంతంగా ఉండేది. చంద్రబాబు వచ్చినప్పటి నుంచి కుటుంబ పెద్ద, కొడుకులు, కూతుర్లు, డాక్టర్‌ వెంకటేశ్వరరావును ఎంత మోసం చేశాడో అందరికీ తెలుసు. 

జూనియర్‌ ఎన్టీఆర్‌ను వరుసలన్నీ కలిపి.. కుటుంబ సమేతంగా ఇంటికెళ్లి.. ఆయన చేత ప్రచారం చేయించుకొని, పనికిమాలిన కొడుకు కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను దూరంగా విసిరేశాడు.. అంతటితో ఆగకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలకు కూడా అడ్డంపడ్డాడు. ఇది అందరికీ తెలిసిన రాజకీయమే. 

నందమూరి కుటుంబంలో ఎవరూ పైకిరాకూడదా.. అంతా నారా వారేనా..? అసలు ఎవరీ నారా వాళ్లు.. ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు.. రెండెకరాల పెద్ద మనిషి వారి నాన్న పేరు చెప్పకుండా.. మాటిమాటికి ఎన్టీఆర్‌ పేరు వాడుతున్నాడు.. ఎన్టీఆర్‌ను చంపి.. ఎన్టీఆర్‌ పేరు ఉపయోగించుకుంటూ వారి కుటుంబ సభ్యులను ఈ విధంగా నాశనం చేస్తూ.. ఏం చేయాలనుకుంటున్నాడు. ఈ కుటుంబాన్ని పూర్తిగా బలి తీసుకోవాలనుకుంటున్నావా.. చంద్రబాబూ? 

ఉమా మహేశ్వరి మరణం నన్ను కలచివేసింది. ఉమా మహేశ్వరి మరణంలో  చంద్రబాబు భాగస్వామ్యం ఉంది. ఆమె మరణానికి బాధ్యత తీసుకోకపోవడం పెద్ద తప్పు. ఆస్తుల గొడవలో ఆమె రాసిన లెటర్‌ ఎక్కడో దొంగలించావ్‌..? కుటుంబ పెద్ద  అని బాధ్యత తీసుకున్నప్పుడు, ఆ కుటుంబం కూడా బాబును నమ్మినప్పుడు ఆస్తుల గొడవ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా..? ఇప్పటికైనా నందమూరి కుటుంబాన్ని విడిచిపెట్టు. ఇంకా ఎన్నాళ్లు నువ్వు, నీ దరిద్రపు కొడుకు  పార్టీని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దోచుకుంటారు’’ అని నందమూరి లక్ష్మిపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Back to Top