రేపటి యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మెడలు వంచుదాం

 వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు నేతలతో పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్‌

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

వాడవాడలా వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరాలి

యువత పోరు కార్యక్రమం టాప్‌ ప్రయారిటీగా తీసుకుని ప్రజల ఆకాంక్షను తెలియజేద్దాం

: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు

తాడేపల్లి: రేపు చేపట్టిన 'యువత పోరు' కార్యక్రమాన్ని విజయవంతం చేసి కూటమి ప్రభుత్వం మెడలు వంచుదామని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యువత పోరు నిరసన కార్యక్రమం, వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై  తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నేతలతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

రేపటి వైయ‌స్ఆర్‌సీపీ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్‌ రిలీజ్‌ కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహించి గత వారం, పది రోజులుగా విద్యార్ధులు, యువత ఎలా నష్టపోయారో వివరించాం. రాష్ట్రంలో 80 శాతంకు పైగా ప్రభావితమయ్యే కుటుంబాలకు సంబంధించిన అంశం, ప్రధానంగా యువతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని బలంగా చెప్పగలగాలి. వైయ‌స్ఆర్‌సీపీ ఏ విధంగా హామీలు అమలుచేసింది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వైఎస్సార్‌సీపీకి - టీడీపీకి వ్యత్యాసం, వైయస్‌ జగన్‌కు - చంద్రబాబుకు వ్యత్యాసం చెప్పాలి, ఈ అంశాలన్నీ విస్తృతంగా జనంలోకి వెళ్ళినప్పుడే మనకు ఫలితాలు కూడా బావుంటాయి, ఇది కార్యకర్తలకు కూడా బలాన్నిచ్చే అంశం, వీలైనంతగా పబ్లిసిటీ పెంచి రేపటి కార్యక్రమం విజయవంతం చేయాలి, ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. 

మనం ప్రజల పక్షాన నిలిచిన పార్టీగా మనకు ప్రజల అంశమే ముఖ్యమైనదని వైయ‌స్ జగన్‌ గారు చెప్పారు, ఇది సుమారు 1.40 కోట్ల కుటుంబాలకు సంబంధించిన కార్యక్రమం, టాప్‌ ప్రయారిటీగా తీసుకోవాలి, రేపు ఉదయం 10 గంటలకు కల్లా కార్యక్రమం ప్రారంభం కావాలి, పెద్ద ఎత్తున జరగాలి, పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ముందుగా పూర్తిచేసుకుని తర్వాత దీనిని పూర్తిచేయాలి, ప్రతి నాయకుడు తప్పనిసరిగా పాల్గొనాలి, అలాగే రేపు వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం కావున ప్రతి చోటా వాడవాడలా వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి. 

యువత పోరు కార్యక్రమంలో అన్ని కాలేజీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు, యూనివర్శిటీలనుంచి పెద్ద ఎత్తున విద్యార్ధులు హాజరవ్వాలి, విద్యార్ధులు, యువత సమస్యలపై మనకు మద్దతిచ్చే ఇతర సంఘాల వారు మనకు సంఘీబావం తెలిపితే వారిని కలుపుకుపోవాలి, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ కార్యక్రమాలు విజయవంతం అవ్వాలి, ప్రజల అభిప్రాయం ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయాలి, కూటమి ప్రభుత్వం దిగిరావాలి, వారి ఆకాంక్షలు నెరవేరాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
 

Back to Top