జోజిన‌గ‌ర్ బాధితుల‌కు అండగా వైయ‌స్ఆర్‌సీపీ

ప్లాట్లు కూల్చివేసిన ప్రాంతానికి మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్

వచ్చే వారం వ‌స్తాన‌ని హామీ ఇచ్చిన పార్టీ అధినేత‌

ఆ హామీతో బాధిత కుటుంబాల్లో ఆనందం 

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ని క‌లిసిన అనంత‌రం మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ తో క‌లిసి మీడియాతో మాట్లాడిన జోజి న‌గ‌ర్ 42 ఫ్లాట్ కూల్చివేత‌ బాధితులు. 

తాడేప‌ల్లి: జోజిన‌గ‌ర్ 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని, వ‌చ్చేవారం తానే స్వ‌యంగా వ‌చ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని ప‌రిశీలిస్తాన‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ బాధితుల‌కు భ‌రోసా ఇచ్చారు. మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ నేతృత్వంలో 42 ప్లాట్ల‌కు సంబంధించి కూల్చివేత బాధితులు గురువారం తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌ని క‌లిసి త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. రెక్క‌ల క‌ష్టంతో కూలి చేసుకుని సంపాదించుకున్న డ‌బ్బుతో 25 ఏళ్ల క్రిత‌మే ఇక్క‌డ ఇళ్ల‌ను నిర్మించుకున్నామ‌ని, త‌మ‌కు ప్లాట్ రిజిస్ట్రేష‌న్, ఇంటి ప‌న్ను, క‌రెంట్ బిల్లుల ర‌శీదులున్నాయ‌ని చూపించారు. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు త‌మ ఇళ్ల జోలికి వెళ్లొద్ద‌ని సుప్రీంకోర్టు ఆర్డ‌ర్ ఉన్నా అధికారులు ప‌ట్టించుకోకుండా డిసెంబ‌ర్ 3న వేకువ‌జామున వంద‌ల సంఖ్య‌లో పోలీసులొచ్చి త‌మ ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేసి వెళ్లిపోయార‌ని బాధితులు వైయ‌స్ జ‌గ‌న్ ఎదుట వాపోయారు. అధికార టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల‌ను క‌లిసినా త‌మ గోడు వినిపించుకోలేద‌ని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ క‌నీసం పరామ‌ర్శ‌కు కూడా రాలేద‌ని క‌న్నీరుమున్నీర‌య్యారు. మీరే న్యాయం చేయాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ని వేడుకోగా అండ‌గా ఉంటాన‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. అనంత‌రం వారంతా త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని మీడియాకి వివ‌రించారు.. 
వారు ఏమ‌న్నారంటే..

పేదోళ్లంటే ఈ ప్రభుత్వానికి క‌డుపు మంట :  మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి పేద‌ల ప‌ట్ల చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కూలి చేసుకుని పైసా పైసా కూడ‌బెట్టుకుని ఇళ్లు నిర్మించుకున్నార‌న్న క‌నీస మాన‌వ‌త్వం లేకుండా ఈ ప్ర‌భుత్వం భ‌వానిపురం జోజిన‌గ‌ర్‌లో 42 ఇళ్ల‌ను కూల్చివేసింది. డిసెంబ‌ర్ 31 వ‌రకు ఇళ్ల జోలికి వెళ్ల‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా లెక్క‌చేయ‌కుండా వంద‌ల సంఖ్య‌లో పోలీసులు వేకువ‌జామున జోజిన‌గ‌ర్ ప్రాంతానికి చేరుకుని సామాన్లు బ‌య‌ట‌కు తీసుకొచ్చే స‌మ‌యం కూడా ఇవ్వ‌కుండా నేల‌మ‌ట్టం చేశారు. దేశ‌స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌ను సైతం బేఖాత‌ర్ చేస్తూ ప్ర‌భుత్వమే దుర్మార్గంగా పేద‌ల‌ను ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేసింది. ఈ ఇళ్ల విష‌య‌మై సాయం చేయాల‌ని బాధితులు చాలాకాలం నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కేశినేని చిన్నిల‌కు, మంత్రి నారా లోకేష్ ల‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేసినా ప‌ట్టించుకోలేదు. జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో ఫిర్యాదు చేసినా న్యాయం జ‌ర‌గలేదు. ఇప్పుడు వారంతా ఉండ‌టానికి నిలువ నీడ లేక చ‌లికి ఎండ‌కీ చెట్ల కింద‌, టెంట్ కింద కుటుంబాల‌తో త‌ల‌దాచుకుంటున్నారు. కొంత‌మంది ఈ ఇళ్ల‌ను క‌ట్నం కింద అల్లుళ్ల‌కి ఇచ్చిన ప‌రిస్థితి. వారికి ఏం స‌మాధానం చెప్పుకోవాలో తెలియ‌ని దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. అధికారులు కూల్చేసిన 42 ఇళ్ల‌కు 25 ఏళ్లుగా ఆస్తి ప‌న్ను క‌డుతున్నారు. క‌రెంట్ బిల్లు చెల్లిస్తున్నారు. విజ‌య‌వాడ ఉత్స‌వాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి త‌ప‌న‌ప‌డిన ఎంపీ కేశినేని చిన్ని క‌నీసం జోజిన‌గ‌ర్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన పాపాన పోలేదు. పేద‌ల ప‌ట్ల క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హరిస్తోంది. జోజిన‌గ‌ర్ వాసుల‌కు జ‌రిగిన అన్యాయంపై మా పార్టీ అధినేత‌ వైయ‌స్ జ‌గ‌న్ గారి ఆదేశాల‌తో ఇప్ప‌టికే ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌డం జ‌రిగింది. మా పార్టీ కార్పొరేట‌ర్లు కార్పొరేష‌న్‌లో ఈ విష‌యంపై గ‌ళ‌మెత్తితే వారి మీద అధికార పార్టీ కార్పొరేట‌ర్లు దాడికి దిగారు. బాధితుల‌ విన‌తి మేర‌కు వారిని మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారిని క‌లిపించ‌డం జ‌రిగింది. వారి క‌ష్టాల‌ను చూసిన జ‌గ‌న్ గారు.. ఎంతో చ‌లించి పోయారు. ఇళ్లు కట్టించడం చేత‌కాని ప్ర‌భుత్వం.. పేద‌లు క‌ష్టంతో క‌ట్టుకున్న ఇళ్ల‌ను కూల్చ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జోజిన‌గ‌ర్ బాధితులు కోరిన విధంగా వారికి అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. 

● విజ‌య‌వాడ న‌డిబొడ్డునే ఇంత అన్యాయ‌మా? - అరుణ‌: 

డిసెంబ‌ర్ 3న మేమంతా చర్చిలో ప్రేయ‌ర్‌లో ఉండ‌గా వ‌చ్చి మా ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేశారు. ఇప్ప‌టికే మీ చ‌ర్చిని, మీ చ‌ర్చిన స‌మాధి చేసిన‌ట్టుగానే నిన్ను కూడా స‌మాధి చేస్తామ‌ని సుర‌క శ్రీనివాస‌రావు మ‌మ్మ‌ల్ని బెదిరించాడు. సుప్రీంకోర్టు ఆర్డ‌ర్ కాపీ ఉంద‌ని మా త‌మ్ముడు కాళ్లు ప‌ట్టుకుని ఎంత బ‌తిమాలినా విన‌లేదు. మేం 16 మంది లాయ‌ర్లు కూర్చుని లా రాశాం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి ఎవ‌రూ ఏం చేయ‌లేర‌ని చెబుతూ మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా బూతులు తిడుతూ సిగిరెట్ తాగి పొగ మా మొహాల మీద‌కు ఊదారు. 25 ఏళ్లుగా రెక్క‌ల క‌ష్టం మీద నిర్మించుకున్న ఇంటిని చ‌ర్చిని గంట‌లో నేల‌మ‌ట్టం చేసి పోయారు. ఇళ్ల‌కు సంబంధించి మాకు అన్ని అనుమ‌తులున్నాయి. అయినా పోలీసులు కూడా మా ఆవేద‌న ప‌ట్టించుకోలేదు. 42 ప్లాట్లు కూల్చ‌డానికి 200మంది పోలీసులు, వంద‌ల మంది రౌడీలు వ‌చ్చారంటే ఇది ప్ర‌జాస్వామ్య‌మేనా అని అనుమానం క‌లుగుతోంది. విజ‌య‌వాడ న‌డిబొడ్డున ఇంత అన్యాయం జ‌రుగుతుంటే మమ్మ‌ల్ని ఆదుకునే దిక్కుతోచ‌క మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారిని క‌లిస్తే వ‌చ్చే వారం ఆయ‌నే వ‌స్తామ‌ని చెప్పారు.  

● చెట్టుకింద‌నే ఉంటున్నాం - తంగా సుబ్బులు:

జోజిన‌గ‌ర్‌లో మాకు రెండు ఇళ్లున్నాయి. డిసెంబ‌ర్ మూడో తేదీన వేకువ‌జామున జేసీబీల‌తో వ‌చ్చి మాట్లాడేది విన‌కుండా మా ఇంటిని కూల్చేశారు. సామాన్లు స‌ర్దుకునే స‌మ‌యం కూడా ఇవ్వ‌కుండా నేల‌మ‌ట్టం చేసిపోయారు. మాకిప్పుడు నిలువ నీడ లేకుండా చేశారు. చెట్టుకింద‌నే వండుకుని తింటున్నాం. సుప్రీంకోర్టు ఆర్డ‌ర్ కాపీని ఫోన్లో చూపిస్తున్నా విన‌కుండా మా ఇళ్ల‌ను ధ్వంసం చేశారు. 2001లో రిజిస్ట్రేష‌న్ చేసుకుని 25 ఏళ్లుగా ఉంటున్నాం. బంగారు కుదువ పెట్టుకుని పైసాపైసా కూడ‌బెట్టుకుని ఇళ్ల‌ను క‌ట్టుకున్నాం. ఒక్క గంట‌లో మా జీవితాల‌ను రోడ్డుపాలు చేశారు. మాకింకా రూ. 9 ల‌క్ష‌ల అప్పు కూడా ఉంది. చేతిలో చిల్లిగ‌వ్వ లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్ర‌భుత్వ‌మే మాకు న్యాయం చేయాలి. 

● ప‌రామ‌ర్శకు అధికార పార్టీ నాయ‌కులు రాలేదు - విజయలక్ష్మి: 

డిసెంబర్ మూడన  విధ్వంసం జరిగింది. శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్లే ఇదంతా చేశారు. 42 కుటుంబాలం ఒక్క‌సారిగా కట్టు బట్టలతో రోడ్డున పడిపోయాం. ఇప్పటికీ ఇంకా అక్కడే ఆ శిథిలాల మీధ్య‌నే బతుకుతున్నాం. కానీ ప్రభుత్వం త‌ర‌ఫున ఎవ‌రూ మమ్మల్ని కనీసం చూడటానికి కూడా రాలేదు. మేము ఎంత పోరాడుతున్నామంటే వెళ్ల‌ని ఆఫీస్ లేదు, ఎక్కని మెట్టు లేదు. టీడీపీ, జ‌న‌సేన పార్టీలు మా గోడు వినిపించుకోలేదు. వైయ‌స్ జగన్ గారిని క‌లిసి మా గోడు చెప్పుకుందామ‌ని ఇంత దూరం వచ్చాం.

వైయ‌స్ జ‌గ‌న్ గారి మాట‌తో న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశ క‌లిగింది:  లలిత కుమారి 

ఒక సామాన్యుని ఇళ్లు కూల్చడానికి ఇంతమంది లాయర్లు ఇంత బందోబస్తు అవసరమా? అదే ఆ ప్లేస్ లో ఎవరైనా అధికార పార్టీ నాయ‌కుల ఇళ్లుంటే ఇంతవరకు తీసుకొచ్చేవారా? మేము సామాన్యులము, ఏమీ చేయలేము. మాకు అండ లేదని.. ఈ విధ్వంసానికి తెగ‌బ‌డ్డారు. ఇంట్లో ఉండేవాళ్ళం. ఈరోజున ఇలా ఇళ్లు కూల్చి మమ్మల్ని రోడ్డు మీదకు లాగారు. చెట్ల కింద ఎవరికి వాళ్ళు తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం. ఇన్ని రోజులు ఎక్కని గుమ్మం లేదు. దిగని మెట్లు లేవు. జగన్ గారు వస్తాను అని మాకు హామీ ఇచ్చారు. ఆయన వ‌ల్ల మాకు న్యాయం జరుగుతుంద‌నే ఆశతో ఉన్నాం.  

  సుప్రీంకోర్టు ఆర్డ‌ర్ కాపీ ఉందన్నా ఆగ‌లేదు - ల‌క్ష్మణ్‌: 

వెలంప‌ల్లి శ్రీనివాస్ గారి ద్వారా ఈరోజు మేము జగనన్నను కలవడం జరిగింది. జగనన్న కూడా మా బాధ విని చ‌లించిపోయారు. వ‌చ్చే వారం మా ఫ్లాట్స్ దగ్గరికి వచ్చి చూస్తాన‌ని హామీ ఇచ్చారు. మా 42 ప్లాట్స్ బాధితుల‌కు వైయ‌స్సార్సీపీ అన్నివిధాలుగా అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటూ ట్యాక్సులు క‌డుతున్న ఇంటినే కూల్చేశారు. సుప్రీంకోర్టు ఆర్డ‌ర్ ఉంద‌ని చూపిస్తున్నా వినిపించుకోలేదు. మా ఆశల‌ను ఒక్క రోజులో నాశ‌నం చేసి వెళ్లిపోయారు. మేం ఈ రాష్ట్రంలో ఉండాలా? ఎక్క‌డికైనా వెళ్లిపోవాలా?  జ‌గ‌న్ గారిని క‌లిసిన త‌ర్వాత‌నే మాకు న్యాయం జ‌రుగుతుంద‌న్న భ‌రోసా క‌లిగింది.

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన జోజిన‌గ‌ర్ ఇళ్ల కూల్చివేత బాధితులు

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత  వైయస్‌ జగన్‌ను కలిసి తమ ఆవేదన చెప్పుకున్న విజయవాడ జోజినగర్‌ ఇళ్ళ కూల్చివేత బాధితులు

వైయస్‌ జగన్‌ వద్ద కన్నీటి పర్యంతం అయిన బాధితులు, పక్కా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. 

బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ వెలంపల్లి శ్రీనివాసరావు

Back to Top