తాడేపల్లి: రాబోయే దశాబ్ధం పాటు వైయస్ జగన్ మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన సాగుతోందని చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి కారణంగానే చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
దారుణంగా చంద్రబాబు వ్యవహారశైలి:
2019 సాధారణ ఎన్నికల కంటే మిన్నగా పంచాయితీ ఎన్నికల్లో సీఎం శ్రీ వైయస్ జగన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చిందని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికల్లోనూ 90% దాకా వార్డులు, 100% కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలుస్తామన్న ధీమాతో ఉన్నామని ఆయన వెల్లడించారు. ఇదేమీ పొగరుతో చెప్పటం లేదని, ప్రజలంతా శ్రీ జగన్ వెన్నంటే ఉన్నారని ఆయనే సీఎంగా, పాలకుడిగా, కుటుంబ పెద్దగా మున్ముందు ఉండాలని ప్రేమతో స్పందిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వ్యవహార శైలి చూస్తే.. ఎబ్బెట్టుగా, నీచంగా, అసహ్యంగా కామెడీగా కనిపిస్తోందని సజ్జల మండిపడ్డారు.
పరాకాష్టకు ఫ్రస్ట్రేషన్:
పంచాయితీ ఎన్నికల్లో దిమ్మ తిరిగే దెబ్బ తగలటం, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్న కుప్పం కోటలు కూడా బద్ధలు కావటంతో చంద్రబాబులో ఈ నిరాశ, నిస్పృహ ఆవరించిందని, దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మూడు రోజులుగా చంద్రబాబులోని ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకు చేరుకుందని, విశాఖలో ఆ ఫ్రస్ట్రేషన్ ఒక స్థాయిలో ఉంటే విజయవాడలో పీక్‌కు చేరిందని, అందుకే చంద్రబాబు అలా మాట్లాడుతున్నారని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఇప్పుడు గుంటూరులోనూ అలాగే మాట్లాడుతున్నారన్న ఆయన, పోలీసులు అంటే భయపడుతున్నారంటూ పదే పదే తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని పేర్కొన్నారు.
అధికారం శాశ్వతం అనుకుంటున్నారు:
‘ఆ ఉక్రోశం, ఆక్రోశం ఏంటో అర్థం కావటం లేదు. హైదరాబాద్‌లో పాచి పనుల కోసం పోతారు తప్ప.. ఇక్కడ ఏమీ చేయటం లేదని చంద్రబాబు ఆక్రోశం వెల్లబుచ్చుతున్నారు. సీఎం శ్రీ వైయస్ జగన్ వెయ్యి, రెండు వేల రూపాయలు ఇస్తే, తీసుకొని తాగి పడుకోండని చంద్రబాబు అనడం సరి కాదు. పూర్వం రాజుల్లో ఎవరికైనా ఒక్కరే పుట్టి.. వారే రాజు అనుకున్నా.. వారు కూడా అధికారం శాశ్వతం అది తన జన్మహక్కుగా భావించి ఉండరు. కానీ చంద్రబాబుకు ప్రజలతో సంబంధం లేదు. అలా అని అధికారం వారసత్వంగా వచ్చిందీ కాదు. మామను వెన్నుపోటు పొడిచి కుట్రతో చంద్రబాబు అధికారం తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఎన్నికల ముందు అటో, ఇటో జంప్ చేస్తూనే వారినీ వీరినీ కలుపుకొని కూటములు ఏర్పాటు చేసుకొని అధికారంలోకి రెండుసార్లు (1999, 2014) చంద్రబాబు వచ్చారు’ అని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.
చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి:
‘చంద్రబాబు ఎవడబ్బ సొత్తు అన్నట్లుగా అధికారం ఏమీ.. ఖర్జూర నాయుడు సొత్తుగా భావిస్తున్నారో ఏమో అర్థం కావటం లేదు. లేక ప్రజలు శాశ్వతంగా తన బానిసలుగా ఉంటారని వంద రూపాయల ప్రామిసరీ నోటు మీద రాసిచ్చారేమో అని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారు. చంద్రబాబు మాటల్లో ఆ దర్పం కనిపించింది. నిన్నటి నుంచి చంద్రబాబు మాటల్లో అహంభావం, విపరీత ధోరణి కనిపిస్తోంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ ఎవ్వరూ ఇలా ప్రవర్తించరు’.
‘ప్రజలను చంద్రబాబు ఘోరంగా అవమానిస్తున్నారు. మీకు సిగ్గులేదు, ఎగ్గులేదు.. అంటూ ప్రజల్ని అనడం ఏంటి?. అసలు చంద్రబాబు తనకు తాను ప్రశ్నించుకోవాలి. మనదీ ఒక బతుకేనా? కుక్కల వలె, నక్కల వలె! అని తనను తాను చంద్రబాబు ప్రశ్నించుకోవాలి. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబుకు ప్రజలు రాం.. రాం చెప్పినా పేడపురుగు వలే పట్టుకొని ఉన్నారు. ఇక, చంద్రబాబుకు శాశ్వతంగా బుద్ధి చెప్పేలా 100% ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన సమయం ఆసన్నమైంది’.
నాడు ఎన్నెన్నో కుట్రలు:
‘ఏ రాజకీయ నాయకుడైనా, పార్టీ అయినా ప్రజలకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పి ఎన్నికల్లో ఆశీస్సులు కోరుకోవటం తప్పితే మరే మార్గమూ ప్రజాస్వామ్యంలో లేదు. లోపం ఉంటే పార్టీల్లో, నాయకుల్లో ఉంటుంది. 2014లో శ్రీ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారనుకొని, అధికారంలోకి వస్తామని అనుకున్న సమయంలోనూ వరుస ఎన్నికల రావటం ఓట్లు బాగా వచ్చినా సీట్లు రాకపోయినా ప్రజలను శ్రీ జగన్ ఒక్కమాట అనలేదు. ప్రజాతీర్పును అత్యంత వినమ్రంగా శిరసావహిస్తున్నానని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తానని శ్రీ జగన్ గారు ఆనాడు చెప్పిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. ఆ తర్వాత ఐదేళ్లలోనూ వైయస్‌ఆర్‌సీపీని చంద్రబాబు వేధించి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. శ్రీ జగన్ గారిని డీమోరలైజ్ చేయాలని చంద్రబాబు ఎన్ని చేసినా ఏమీ బెదరలేదు. ప్రజలను ఏ ఒక్కరోజు కూడా ఒక్కమాట అనలేదు’.
‘ఇక్కడ నాయకులు ప్రజలకు సేవ చేయటానికే ఉంది. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా.. వారిని ఏమీ అనటానికి వీల్లేదు. ప్రజలకు నమ్మకం కలిగితేనే అధికారం ఇస్తారు. అసలు చంద్రబాబుపై ఆయనకే నమ్మకం లేదు. ఆయనపై ఆ కుటుంబంలోనూ నమ్మకం లేదు. అడ్డదారులు, వెన్నుపోట్లు, ఓట్లు కొనుక్కోవటం మాత్రమే చంద్రబాబుకు తెల్సు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటుకు రూ.5 కోట్లు పోసి కొనాలని చూశారు కూడా. 2019లో ప్రజలు తిరస్కరించి విస్ఫష్ట తీర్పును ఇచ్చారు. ఆనాడు చంద్రబాబు ప్రలోభాలకు ఎవ్వరూ లొంగలేదు’.
నోరు తెరిస్తే బూతులు:
‘మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేశ్‌లు బూతులు, బెదిరింపులు చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకుల్ని, ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారినే కాదు.. ప్రజలపై కూడా బూతులు మాట్లాడుతున్నారు. లోకేశ్ కూడా తండ్రిని మించి తనయుడ్ని కావాలని బూతులు తిట్టడంలో పోటీ పడుతున్నారు. ఏం పీకుతారు.. అంటూ.. అంటుంటే... బాయిలర్ కోళ్లను వేడినీళ్లలో ముంచి తీస్తే ఎలా ఉంటుందో అలా తండ్రీకొడుకులు ఉన్నారని సజ్జల సెటైర్ వేశారు. ఇక పీకటానికి ఏమి ఉంది. అయినా ప్రజలను బూతులు తిట్టడం ఏంటి? మరోవైపు బావమరిది బాలకృష్ణ కూడా హిందూపురంలో జనాలపై పడి కొడుతున్నారు. అభిమానంతో పూలుచల్లిన మహిళా కార్యకర్తపై మరీ అన్యాయంగా అశోకగజపతిరాజు కూడా చేయి చేసుకున్నారు. ఆ ఫ్రస్టేషన్ నాయకుడి నుంచి కింది వారి వరకు వెళ్లింది’.
‘మొన్న విజయవాడలోనూ టీడీపీ నాయకులు కులపార్టీగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగా చెప్పారు. ఇదంతా కళ్ల ముందు కనపడుతోంది. ఎన్టీఆర్ హయాంలో వైభవంగా వెలిగిన పార్టీ ఈరోజు తుప్పుపట్టి ఎక్కడికక్కడ బద్దలైపోయి.. అవసాన దశలో ఉన్న పరిస్థితి అందరికీ కనపడుతోంది’.
100కు 100 మార్కులు:
‘2019 ఎన్నికలప్పుడు అవకాశం రాగానే చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో పడేశారు. శ్రీ జగన్ గారిపై పూర్తి విశ్వాసంతో అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ 20 నెలల్లో 100కి 100 మార్కులు సీఎం శ్రీ జగన్ గారు సంపాదించుకున్నారు. ప్రజాసేవకుడిగా, వారి ఇంట్లో సభ్యుడిగా, రాష్ట్రానికి ధర్మకర్తగా, న్యాయమైన, స్వచ్ఛమైన, అవినీతిరహితమైన పాలనను ప్రజల ఇళ్ల ముంగిళ్లకు తీసుకువెళ్లి వారి ఆశీస్సులను శ్రీ జగన్ సంపాదించుకున్నారు’.
ఎన్ని కుతంత్రాలు చేసినా?:
‘చంద్రబాబు వయస్సు చూసి కావొచ్చు. లోకేశ్ చేతగానితనం కావొచ్చు. టీడీపీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు చంద్రబాబుపై విశ్వాసం లేదు. చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే అని చాలా బలంగా నమ్ముతున్నారని ఈ ఎన్నికల్లో కనిపిస్తోంది. అందుకే నామినేషన్లు వేయటానికి టీడీపీకి అభ్యర్థులూ దొరకలేదు. వేసిన తర్వాత కూడా ప్రజలకు ఏం చెప్పాలో తెలియక విత్‌డ్రాయల్స్ జరిగాయి. పైగా ఇవన్నీ దౌర్జన్యంతో చేయిస్తున్నారని చంద్రబాబు ఎత్తుగడలు వేశారు. ఎస్‌ఈసీ భుజంపై తుపాకి పెట్టి కాల్చాలని చంద్రబాబు ప్రయత్నించారు కూడా. అవి కూడా చెల్లలేదు. ప్రజాతీర్పు చాలా స్పష్టంగా కనిపించేసరికి అవన్నీ కూడా చెల్లని ఖాతాలోకి వెళ్లిపోయాయి. చంద్రబాబు ఆరోపణలకు ప్రజలు వీసమెత్తు విలువ ఇవ్వలేదన్న సంగతి మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపిస్తోంది’.
అనైతికంగా విమర్శలు:
‘20 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న టీడీపీ పరిస్థితి ఇప్పుడు ఘోరంగా తయారైంది. 2014లో చంద్రబాబుకు ప్రజలు చరిత్రాత్మక అవకాశం ఇస్తే.. అంతే ఘోరంగా టీడీపీ ఓడింది. చివరకు సీపీఐ, జనసేన, ఏ అభ్యర్థి ఉన్నా, కులాల పరంగా అయినా సరే.. ఏ పార్టీకి అయినా టీడీపీ మద్దతు ఇస్తోంది. ఈ చర్యల ద్వారా టీడీపీ దివాళా తీసిందని చెప్పవచ్చు. అధికారం చంద్రబాబు జన్మ హక్కు కాదు. నిన్న, ఇవాళ చంద్రబాబు మాటలు వింటే సంఘవిద్రోహశక్తులు మాట్లాడే మాటల్లా ఉన్నాయి. పైగా జనం నాశనమైపోవాలని కోరుకున్నట్లు మాటలు ఉన్నాయి. 70 ఏళ్ల రాజకీయ నాయకుడ్ని తెలుగుదేశం తమ్ముళ్లే సామాజిక బహిష్కరణ చేసేట్లు ఉన్నారు’.
‘నిన్న విజయవాడ రోడ్‌షోలో ఓవైపు అభ్యర్థి ప్రజలకు నమస్కారం పెడుతుంటే.. మరోవైపు చంద్రబాబు ప్రజల్ని తిడుతున్నారు. దీంతో దిక్కుతోచక ఆ అభ్యర్థి చంద్రబాబు వైపే చూస్తున్నారు. అలాంటి సమయంలో ఎలా స్పందించాలో తెలియని స్థితిలో ఆ కార్పొరేటర్ అభ్యర్థి ఉన్నారు’.
గడప వద్దకే పథకాలు:
‘చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటేనే.. శ్రీ జగన్ గారి విలువ చెప్పటానికి వీలవుతుంది. ఒక పిట్టల దొరగానో, కామెడీగానో చంద్రబాబును భావించాలి. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో శ్రీ జగన్ అమలు చేసిన సంక్షేమం, అన్ని కుటుంబాల కోసం వేసిన అడుగులు 95% ప్రజల జీవితాలను తాకాయి. ఆ స్పర్మతో ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇది ప్రజలకు తెల్సు. ఈ ప్రభుత్వం చేసిన పనుల వల్ల మళ్లీ మమ్మల్ని ఆశీర్వదించి కరపత్రం ద్వారా ప్రజల ముందుకు వచ్చాం. రాష్ట్రంలో ఓటర్లకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ జగన్ గారు చేస్తున్న పనులు అన్నీ వార్డు, గ్రామ సెక్రటేరియట్ల ద్వారా పాలన ప్రజల ముందుకే వచ్చింది’.
ఇదే మా విజ్ఞప్తి:
‘ఏదైనా సమస్య ఉన్నా.. త్వరగా పరిష్కారం కావాలంటే అధికార చట్రంలో పంచాయితీల్లో తీర్పులాగే మున్సిపాల్టీలోనూ, కార్పొరేషన్‌లో వైయస్‌ఆర్‌సీపీ నాయకుల్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చటానికి వైయస్‌ఆర్‌సీపీ ప్రతినిధులు ఉంటే.. శ్రీ జగన్ పథకాలు, ఆశయాలు పూర్తి చేసుకోవటానికి వీలవుతుంది. అందుకోసం రాష్ట్రమంతా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ఆదరించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం’ అని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
– ప్రజల్ని రెచ్చగొట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. 2019లోనే అమరావతి ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు. అందువల్లే లోకేశ్ నిలబడిన మంగళగిరిలో ఓడిపోయారు. రెండోసారి ప్రజలు పంచాయితీ ఎన్నికల్లోనూ చంద్రబాబును కొట్టారు. చంద్రబాబు పిలుపు ఇచ్చి ఎంత గాలి కొట్టాలని చూసినా ఫలితం కనిపించటం లేదు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సిన మాటలు. అచ్చం ఒక మానసిక రోగిలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. అందుకే వారిని రోగులుగా చూసి క్షమించి వదిలేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మీరు భయపడుతున్నారని పోలీసు వ్యవస్థనే చంద్రబాబు అవమానిస్తున్నారు.
– అమరావతి రెఫరెండంగా అవసం లేదు. శ్రీ జగన్ పాలనను రెఫరెండంగా చూస్తున్నారు. ఛాలెంజ్‌లు, చిన్న చిన్న వాటిని చూపించి చేయాల్సిన అవసరం లేదు. ఒక పాజిటివ్ ధోరణితో పోతున్నాం. రేపు స్వీప్ చేసిన తర్వాత మేమే అనాలి. అవతల సమ ఉజ్జీ ఉంటే కదా? ఆయన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయటానికి అయినా, రిప్లై ఇవ్వడానికి అయినా?
– మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ వాస్తవం. ప్రజలు తన మీద పెట్టిన విశ్వాసంతో శ్రీ జగన్ తీసుకున్న నిర్ణయం అది. దాన్ని తప్పు పడుతున్న చంద్రబాబు, తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఏమీ చేయలేదు. విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని అంటే కనీసం నాగార్జున యూనివర్శిటీ వద్ద ఏర్పాటు చేయాలి.. ఎక్కడో 20 కి.మీ అవతల నిర్మించి గుంటూరు–విజయవాడ మధ్య అంటే ఏమనాలి? నిజానికి మోసం చేసింది చంద్రబాబే. అమరావతిపై ప్రేమ ఉంటే.. చంద్రబాబు నాలుగేళ్లలో ఏం చేశారు?. ఎందుకు పనులు పూర్తి చేయలేదు?. మొండి గోడలు మాత్రమే లేపి.. కనీస సదుపాయాలు ఎందుకు కల్పించలేదో చంద్రబాబునే ప్రశ్నించాలి. వికేంద్రీకరణ తప్పదు. విజయవాడ–గుంటూరు కూడా తప్పకుండా అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా శ్రీ జగన్ గారు అభివృద్ధి చేస్తారు. ఆ విషయాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టే నిన్న పంచాయితీ ఎన్నికల్లో స్వీప్ చేశాం. రేపు మున్సిపల్ ఎన్నికల్లోనూ స్వీప్ చేస్తాం.