ష‌ర్మిల మాట‌లు విడ్డూరం 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి

రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు

చంద్రబాబు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి

వైయ‌స్ఆర్ జిల్లా:  అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో వైయ‌స్ జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. అదానీ వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని అన్నారు  . గురువారం రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

అదానీ కంపెనీ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే.. కేంద్ర ప్రభుత్వ సంస్థ  సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో అదానీ లంచం ఎందుకిస్తారు.? అదానీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు.

 షర్మిల పనిగట్టుకుని వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విమర్శలు చేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే.. ఏకంగా వైయ‌స్ జగన్‌కు 1,750 కోట్లు లంచం ఇచ్చారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. వైయ‌స్ జగన్‌ హయాంలో రాష్ట్రానికి తక్కువతో విద్యుత్ కొని ఆదా చేస్తే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి. 

 గడచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న శివప్రసాద్‌రెడ్డి..  అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని పాలిస్తూ ఏపీ ప్రజలను గాలికి వదిలేశారన్నారు. నాడు కేబినెట్ చర్చల అనంతరం 2.49 పైసలకే మన ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేసింది. కానీ, ఇప్పుడు రామోజీరావు కొడుకు, రాధాక్రిష్ణలు, షర్మిల, టీడీపీ నేతలు పక్కనే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా రూ 5.30 పైసలతో  విద్యుత్ కొనుగోలు చేసింద‌ని శివప్రసాద్‌రెడ్డి గుర్తు చేశారు.

అమెరికా కేసులో వైయ‌స్ జగన్ పేరుందని దుష్ప్రచారం చేస్తున్నారు.. అక్కడ వేసిన చార్జ్ షీట్ లో ఎక్కడా వైయ‌స్ జగన్ పేరూ లేదు.. ఏపీ ప్రభుత్వం పేరూ లేదు అని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని ప్రశ్నించే గొంతును నొక్కేందుకు వీళ్లు చట్టాలు తెస్తున్నారు. ప్రజల సమస్యలను మేం మాట్లాడుతున్నాం అని నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూడా పీడీ యాక్ట్ పెడతారా? అని ప్రశ్నించారాయన.

 చెవిరెడ్డి చేసిన నేరం ఏంటి? ఓ ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శిస్తే కేసు పెడతారా?. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలవవద్దని మీరు ఇలాంటి కేసులు పెడుతున్నారా?. మీరు మాత్రం ప్రతి రోజూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడొచ్చు.. మేం పేదల పక్షాన నిలిస్తే కేసులు పెడతారా? అని శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు.

Back to Top