జేసీబీల‌తో ఫుడ్‌కోర్టు తొల‌గించ‌డం దుర్మార్గం

విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కేకే రాజు ఆగ్ర‌హం

విశాఖ‌: బ‌ల‌వంతంగా  జేసీబీల‌తో ఫుడ్ కోర్టులు తొల‌గించి పేద‌ల‌పై ప్ర‌తాపం చూపుతారా అంటూ విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కేకే రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారి పొట్ట కొట్టడం దుర్మార్గ‌మ‌ని మండిప‌డ్డారు.  విశాఖ‌లో నైట్‌ ఫుడ్‌కోర్ట్‌లో బడ్డీలను తొల‌గించ‌డం హేయమైన చర్యగా అభివర్ణించారు.  శ‌నివారం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ.. `దశాబ్దాలుగా నిర్వహిస్తున్న షాపులను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు.  జేసీబీల‌తో దుకాణాలు తొలగిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు.  ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులు తొలగిస్తున్నారు. షాపులు పెట్టుకున్న వారు జీవీఎంసీకి పన్ను చెల్లిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని షాపులు తొలగించ‌డం స‌రికాదు. షాపులకు పోలీసులకు ఏమిటి సంబంధం. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత షాపులు తొలగించాలి. భూ కబ్జాలకు, అక్రమంగా బిల్డింగ్ లు కడుతున్న వారిపై చర్యలు తీసుకోండి. మీ ప్రతాపం పేదలు మీద చూపించ వద్దు.. వైజాగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాపులను జేసీబీలతో పచ్చడి చేస్తున్నారు. మానవత్వం లేకుండా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయంలో ఇలాంటి చర్యలకు పాల్పడలేదు`అని కేకే రాజు స్ప‌ష్టం చేశారు.

Back to Top