కర్నూలు: ఉల్లి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. కనీసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి వారి నుంచి పంట కొనుగోళ్లు చేయకపోవడం దారుణమని వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదన్న ఆయన, రైతుల పట్ల సీఎం చంద్రబాబు ఇకనైనా వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేని పక్షంలో నేపాల్ పరిస్థితి ఇక్కడా ఉత్పన్నం అవుతుందని కర్నూలు లోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఎస్వీ మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రెస్‌మీట్‌లో ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ● కొనుగోలు చేయక పరిహారమా?: కనీస గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులు చివరకు పంటను రోడ్ల మీద పారవేస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ, ఉల్లి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది. తొలుత క్వింటా ఉల్లికి రూ.1200 గిట్టుబాటు ధరపై హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఎక్కడా పంట మాత్రం కొనుగోలు చేయలేదు. దీనిపై మా పార్టీ ఆందోళనకు దిగడంతో, ఉల్లి రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే, పరిహారం చెల్లిస్తారు. కానీ, ఇక్కడ ప్రభుత్వం విచిత్రంగా ఉల్లికి గిట్టుబాటు ధర ఇచ్చి, కొనుగోలు చేయకుండా, రైతులకు పరిహారం ఇస్తామని చెబుతోంది. ● పరిహారం ఇచ్చినా ఎకరాకు రూ.80 వేలు నష్టం: ఉల్లి ఎకరాకు దాదాపు 100 క్వింటాళ్ల వరకు పండుతుంది. అలా ఒక హెక్టార్‌లో దాదాపు 250 క్వింటాళ్ల ఉల్లి ఉత్పత్తి అవుతుంది. క్వింటా ఉల్లికి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రూ.1200. ఆ ప్రకారం ఒక హెక్టార్‌లో పండే ఉల్లికి రైతులకు రూ.3 లక్షల ఆదాయం రావాలి. కానీ, ఈ ప్రభుత్వం ఉల్లి రైతులకు ఒక్కో హెక్టార్‌కు రూ.50 వేల పరిహారం ఇస్తామని చెబుతోంది. నిజంగా అలా ఇచ్చినా, ఉల్లి రైతు ఒక్కో ఎకరానికి రూ.80 వేల చొప్పున నష్టపోతాడు. మరి ఈ ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకున్నట్లు! పైగా ఇస్తామన్న పరిహారానికి సంబంధించి, ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదు. అలాంటప్పుడు అసలు ఆ పరిహారం ఎప్పుడిస్తారో కూడా తెలియడం లేదు. అయినా కూటమి నేతలు మాత్రం గొప్పలు చెబుతున్నారు. ‘ఉల్లి రైతులకు విపత్తులు వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెక్టారుకు రూ.25 వేలు ఇస్తాయి. కానీ, మేము రూ.50 వేలు ఇస్తున్నాం’ అని ఘనంగా చెప్పుకుంటున్నారు. ● కొనుగోళ్లు నిలిపి వేయడం దారుణం: ఉల్లి రైతులను ఏ విధంగానూ ఆదుకోని ప్రభుత్వం పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది. రైతుల వద్ద 2.67 లక్షల టన్నుల ఉల్లి పంట ఉండగా, ఇప్పటి వరకు రూ.13 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అలాంటప్పుడు మిగిలిన ఉల్లి పంట కొనుగోలు చేయాలంటే ప్రభుత్వానికి రూ.300 కోట్లు అవసరం. మరోవైపు ఉల్లి కొనుగోలు నిలిపి వేస్తున్నట్లు ఇప్పటికే మార్కెట్‌లో ప్రకటించారు. రైతులకు ఇస్తామన్న పరిహారంపై విధివిధానాలు ప్రకటించకుండానే, మార్కెట్లలో ఉల్లి కొనుగోళ్లు నిలిపి వేస్తామని ప్రకటించడం దుర్మార్గమని ఎస్వీ మోహన్‌రెడ్డి ఆక్షేపించారు.