విశాఖపట్నం:వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న హాకర్లపై కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే వారు ఏర్పాటు చేసుకున్న దుకాణాలను జేసీబీలతో నేలమట్టం చేశారని విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షాపుల అక్రమ తొలగింపు గురించి వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుంటే మాకేం సంబంధం లేదని జీవీఎంసీ అధికారులు, పోలీసులు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని.. పక్కా కుట్రతోనే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నగరంలో లేని సమయంలో ఈ కూల్చివేతలకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందని కెకె రాజు ఆరోపించారు. బాధితులకు ప్రత్యామ్నాయం చూపే వరకు షాపులు, ఫుడ్ కోర్టు తొలగిస్తే అంగీకరించేది లేదని కెకె రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. షాపుల అక్రమ తొలగింపుపై సోమవారం వైయస్ఆర్‌సీపీ నాయకులంతా జీవీఎంసీ కమిషనర్‌ని కలుస్తామని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా హాకర్స్ జోన్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా వీధి వ్యాపారాలను ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు వ్యాపారుల కోసం జోన్లు ఏర్పాటు చేసిన జీవీఎంసీ అధికారులే నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని కూల్చివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ● పక్కా ప్లాన్‌తో కుట్రపూరితంగా దుకాణాల తొలగింపు విశాఖ నగరంలో రోడ్డుపై రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్న స్ట్రీట్ వెండార్ల పట్ల ఈ ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది. రోడ్డుపైనే రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వేలాది కుటుంబాలను కూటమి ప్రభుత్వం రోడ్డు పాలు చేసింది. రోడ్డుపై వ్యాపారం చేసుకునే వారందరికీ మేలు కలిగేలా గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో హాకర్స్ జోన్లు ఏర్పాటు చేసి జీవీఎంసీ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి వ్యాపారాలు కొనసాగించుకునే అవకాశం కల్పించడం జరిగింది. కానీ గత రెండు రోజులుగా నాటకీయ పరిస్థితుల మధ్య వ్యాపారులెవరికీ కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అత్యంత అమానవీయంగా దౌర్జన్యంగా జేసీబీలను తీసుకొచ్చి బడ్డీ కొట్లను ధ్వంసం చేస్తున్నారు. ఈ విధ్వంసం గురించి కూటమి నాయకులెవరికీ తెలియదని బాధిత వ్యాపారులకు, నగర ప్రజలకు భ్రమ కల్పించేందుకు కార్పోరేటర్లను మేయర్‌తో సహా స్టడీ టూర్ పేరుతో విజయవాడకి పంపారు. ఇంకోవైపు కూటమి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాల పేరుతో మూడు రోజులుగా రాజధానిలోనే ఉంటున్నారు. పక్కా కుట్రతో ఇలాంటి అవకాశాన్ని వారే సృష్టించుకుని వ్యాపారుల మీద జేసీబీలతో విరుచుకుపడ్డారు. షాపులను ఎవరు తొలగించమంటున్నారని పోలీసులను ప్రశ్నిస్తుంటే జీవీఎంసీ అధికారులేమో పోలీస్ కమిషనర్ తొలగించమని చెప్పారని, పోలీసులను అడిగితే జీవీఎంసీ కమిషనర్ తొలగించమన్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడితే అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న కొన్ని షాపులను మాత్రమే తొలగించమని చెప్పామని అంటున్నారు. ఇతర షాపులు, ఫుడ్ కోర్టులు, మెకానిక్ షాపులు తొలగించమని చెప్పలేదని వారే చెబుతున్నారు. ఒకవైపు రోడ్డు విస్తరణ పనులకు వ్యతిరేకం అంటూనే వీధి వ్యాపారుల పొట్ట కొట్టడం దుర్మార్గం. ● విశాఖ నగరం మీద కూటమి కుట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే విశాఖలో కోట్ల విలువైన భూములను పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టి సొత్తంతా విజయవాడకు తరలించుకుపోతున్నారు. ఇప్పుడు ఏకంగా రోడ్డు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారిని సైతం రోడ్డుపాలు చేశారు. ఇలాంటి విధానం సరైంది కాదు. దీన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాతే ఆక్రమణలు తొలగించాలి. గతంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో విశాఖ అభివృద్ధిలో భాగంగా ప్రతి జంక్షన్ ను అభివృద్ధి చేశాం. ఈ కార్యక్రమంలో వీధి వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకుండా 24 హ్యాకర్ జోన్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాం. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైనా నిర్మాణాలు తొలగించాల్సి వస్తే బాధితులతో మాట్లాడి వారికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్లిందే కానీ ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకోలేదు. ● వైయస్ఆర్‌సీపీ హయాంలో హాకర్స్ జోన్ల ఏర్పాటు ప్రభుత్వానికి చేతనైతే అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను, పార్కింగ్ లేకుండా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్సులను కూల్చివేయాలి. వాటి మీద చర్యలు తీసుకున్న తర్వాతే వీధి వ్యాపారుల జోలికొస్తే బాగుంటుంది. అంతేకానీ రెక్కాడితే కానీ డొక్కాడని వ్యాపారులను రోడ్డుపాలు చేస్తే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. ప్రత్యామ్నాయం చూపించే వరకు షాపుల తొలగించే పనులు ఆపేయాలి. వ్యాపారుల ఇబ్బందులను మానవీయ కోణంలో చూడాలే కానీ ఏకంగా దుకాణాలనే జేసీబీలతో కుప్పకూల్చడం దారుణమైన చర్య. వారికి కోరినంత సమయం ఇవ్వాలి. ప్రభుత్వం కూల్చిన చాలా దుకాణాలు 20 ఏళ్లకుపైగా వ్యాపారాలు జరుగుతున్నవే. ముందూ వెనుక చూడకుండా ప్రైవేటు స్థలంలో ఉన్న నిర్మాణాలను సైతం ఇష్టారాజ్యంగా కూల్చేస్తున్నారు. ● అమరావతి కోసం విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు కూటమి ప్రభుత్వం అమరావతి ఇమేజ్ ని పెంచడానికి విశాఖ బ్రాండ్‌ను నాశనం చేస్తున్నారు. పెట్టుబడులన్నీ అమరావతికి తరలిస్తున్నారు. ఇంటర్నేషనల్ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకోవడానికి అమరావతి బాగుండదు కనుక వాటి కోసం మాత్రమే విశాఖను ఫంక్షన్ హాల్‌లా వాడుకుంటున్నారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతికి పెట్టుబడులు రావనేది చంద్రబాబు భయం. అందులో భాగంగానే విశాఖపట్నం ప్రశాంతమైన నగరం కాదనే ముద్ర వేసే కుట్రలు జరుగుతున్నాయి. దానికోసం ప్రశాంత నగరంలో పదే పదే అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు ప్రత్యామ్నాయం చూపించే వరకు కూడా వైయస్ఆర్‌సీపీ పోరాడుతుంది. హాకర్ల తరఫున సోమవారం జీవీఎంసీ కమిషనర్‌ని కలిసి వారి ఉపాధికి నష్టం జరగకుండా న్యాయం చేయాలని కోరతాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన, వారు చెప్పినట్టు అసాంఘిక కార్యక్రమాలు జరిగి ఉంటే వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలే కానీ అందర్నీ ఇబ్బంది పెట్టడం తగదు. వ్యాపారుల సమస్యల పట్ల మానవీయకోణంలో ఆలోచించాలి.