తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్నిసార్లు సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్, లోకేష్‌లు వీకెండ్‌లలో ప్రభుత్వ ధనంతో హైదరాబాద్‌కు వెళ్ళి వస్తున్నారో సవివరంగా కథనం రాసే దమ్ము ఎల్లో మీడియా 'ఈనాడు'కు ఉందా అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ తన సొంత డబ్బుతో బెంగుళూరుకు వెళుతుంటే, ప్రతిసారీ దానిపై కథనాలను రాసి ఈనాడు శునకానందం పొందుతోందని మండిపడ్డారు. నిత్యం చంద్రబాబుకు భజన చేసేందుకే ఈనాడు పత్రికను నడుపుతున్నాను అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆ పత్రిక నిర్వాహకుడు చెరుకూరి కిరణ్ తన పత్రికపేరును 'చంద్రనాడు' అని మార్చుకుంటే సరిగ్గా సరిపోతుందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... మాజీ సీఎం వైయస్ జగన్ 51 సార్లు బెంగుళూరు వెళ్ళారంటూ ఈనాడు పత్రికలో వార్త రాశారు. నిత్యం వైయస్ఆర్‌సీపీ నాయకులు, వైయస్ జగన్ గారి మీద పడి బుదరచల్లడమే తప్ప ప్రజాసమస్యల గురించి ఆ పత్రికకు పట్టదు. ఈనాడు పత్రిక ప్రారంభించి ముప్పై ఏళ్ళయ్యిందని, జర్నలిజం విలువలు కాపాడుతున్నామని చెప్పుకునే రామోజీ కుమారుడు చెరుకూరి కిరణ్ తన పత్రికను చంద్రబాబుకు పాదాక్రాంతం చేశాడు. ప్రజలకు పనికివచ్చేది, ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే కథనాలు రాసే ధైర్యం ఈనాడుకు ఉందా? 2019-24 కాలంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నిరోజులు ఉన్నారు? కరోనా సమయంలో రెండు సంవత్సరాల పాటు అసలు రాష్ట్రం వైపే చంద్రబాబు చూడలేదు. గత ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఈ 65 వారాల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ప్రజాధనంతో ఎన్నిసార్లు పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్‌కు వెళ్ళారో ఈనాడులో రాసే దమ్ము రామోజీ కుమారుడు కిరణ్‌కు ఉందా? వైయస్ జగన్ గారు తన సొంత సొమ్ముతోనే బెంగుళూరుకు వెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఆయన తక్షణం స్పందిస్తున్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిపిచేందుకు బాధిత వర్గాలకు స్వయంగా వెళ్ళి, అండగా నిలుస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ తక్షణం అక్కడిక వెళ్ళి వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు అరవైకి పైగా చంద్రబాబు అండ్ కో ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో ప్రభుత్వ ధనంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్ళారో వివరంగా ఈనాడు ఒక కథనం రాస్తే ఆ పత్రిక నిస్పక్షపాతంగా పనిచేస్తుందని ప్రజలు నమ్ముతారు. నిత్యం వైయస్ జగన్‌పైన బురదచల్లాలనే లక్ష్యంతోనే ఈనాడు పత్రికను నడుపుతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక తప్పుడు కథనం రాయాలి, ఆయనపై అసత్య ప్రచారం నిర్వహించాలన్నదే ఈనాడు పత్రిక ధ్యేయం. చలో మెడికల్ కాలేజీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైయస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. విద్యార్ధి, యువత, ప్రజానీకం ఈ కార్యక్రమంలో ఉవ్వెత్తున పాల్గొని తమ నిరసనలు వ్యక్తం చేశారు. దీనిని డైవర్ట్ చేసేందుకు లిక్కర్ స్కాం అంటూ ఈనాడులో తప్పుడు వార్తలు రాశారు. ఇదేనా ఈనాడు పాటిస్తున్న జర్నలిజం విలువలు?