విశాఖపట్నం: నాడు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు అని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నేడు ఫ్రీ బస్సు పథకానికి అడుగడుగునా షరతులు విధించడంపై వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దుర్గమ్మ సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని స్త్రీ వంచనగా మార్చివేశారని మండిపడ్డారు. కేవలం 5 రకాల బస్సులకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడాన్ని ఆక్షేపించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..: పచ్చి అద్దాలతో మోసం చేసిన కూటమి ప్రభుత్వం : మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణంపెద్ద, పెద్ద హెడ్డింగులతో అని పత్రికల్లోనూ, ప్రసార మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టింది. ప్రభుత్వం చేసిన హడావుడి చూసి రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది మహిళలు రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని ఎంతో ఆశగా ఎదురు చూశారు. మహిళల ఆశల్ని కూటమి ప్రభుత్వం బస్సు టైర్ల కింద తొక్కిపడేసింది. మహిళలు పవిత్రంగా భావించే శ్రావణమాసం శుక్రవారం నాడు కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ, ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ మహిళలకు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం కూటమి పార్టీలు ఊదరగొట్టాయి. తీరా ఇప్పుడు అమల్లోకి వచ్చేసరికి ఉచిత బస్సు కొన్ని ప్రాంతాలకే పరిమితం అంటూ షరతులు విధించి మహిళలను దారుణంగా మోసం చేశాయి. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్ లోకేష్ ఇంత దారుణంగా మోసం చేయడం సమంజసమా? గతంలో రాష్ట్రంలో మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఇదే దుర్గమ్మ పాదాల చెంత హామీ ఇచ్చారా? లేదా? ఇంత పచ్చి అబద్దాలు చెప్పి.. మహిళలు మోసం చేయడం అత్యంత దుర్మార్గం. స్త్రీ శక్తి. కండిషన్స్ అప్లై: ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా కిరీటాలు పెట్టుకున్న కూటమి నేతలంతా మీ మేనిఫెస్టో చూడండి. ఆ రోజు మీరు చెప్పిందేమిటి? ఇవాళ చేసిందేమిటి? రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడేమో 16 రకాల బస్సులంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణం, మిగిలిన బస్సుల్లో లేదు అని చెబుతున్నారు. అది కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి 6,700 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెబుతున్నారు. మరోసారి 8,300 బస్సులలో ఉచిత ప్రయాణం అని పదే, పదే మాట మారుస్తున్నారు. జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లోనే ఉచిత ప్రయాణం ఇచ్చారు. ఇది మహిళలను దారుణంగా మోసం చేయడమే కదా? సూపర్ హిట్ కాదు. అట్టర్ ఫ్లాప్: ఇన్ని ఆంక్షలతో ఇచ్చిన ఈ పథకానికి మరలా స్త్రీశక్తి అని గొప్ప పేరు పెట్టి మోసం చేస్తున్నారు. మీరు ఇచ్చింది స్త్రీ శక్తి కాదు, స్త్రీ వంచన అని రాష్ట్రంలో మహిళలందరికీ అర్ధం అయింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉచిత బోగస్ ప్రయాణంగా మార్చేశారు. మీరు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అది సూపర్ హిట్ కాదు సూపర్ ఛీట్ అన్న విషయం ప్రజలందరూ తెలుసుకున్నారు. అదో సూపర్ డూపర్ ఫ్లాప్ కార్యక్రమం. ఒక్క మహిళకు కూడా 3 సిలిండర్లు ఇవ్వకపోవడం సూపర్ హిట్టా? 30 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి ఎగనామం పెట్టడం సూపర్ హిట్టా? తొలి ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో తొలి ఏడాది నుంచే అమలు చేస్తే.. వీళ్లు తొలి ఏడాదే ఈ పథకాన్ని ఎగరగొట్టింది కాక.. రెండో ఏడాది ఈ పథకంలో 30 లక్షల మందికి ఎగ్గొట్టారు, దాన్ని సూపర్ హిట్ అంటారా? అలాగే రెండు కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి పథకానికి రూ.33 వేల కోట్లు కేటాంచాల్సి ఉండగా.. ఇంతవరకు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సూపర్ హిట్టా? కోటిమందికి నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడాన్ని సూపర్ హిట్ అంటారా? ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వకపోవడం సూపర్ హిట్టా? ఇక రైతు భరోసా విషయానికొస్తే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దానికి ఎగనామం పెట్టారు. రెండో ఏడాది కూడా 7 లక్షల మంది రైతులకు ఎగనామం పెడుతూ... మిగిలిన వాళ్లకు కూడా కేవలం రూ.5వేలు మాత్రమే ఇచ్చారు. మొత్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న 53 లక్షల మంది రైతులకు రూ.35 వేలు చొప్పున ఎగనామం పెట్టడం సూపర్ హిట్టా? ఇంత దారుణంగా రాష్ట్ర ప్రజలను మోసం, దగా చేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఏ మొహం పెట్టుకుని ప్రకటిస్తున్నారు చంద్రబాబుగారూ? ఆ రోజు ఓట్ల కోసం అనేక మాటలు చెప్పి ఇప్పుడు వాటిని నీటిమూటలు చేసారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని అర్ధం అయితే... చంద్రబాబు చర్యలతో ప్రజలు సీఎం చీటింగ్ మాష్టర్ అని అనుకునేటట్టు చేశారు. మోసం చేయడంలో మాష్టర్స్ డిగ్రీ పొందిన విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. మహిళలను ఈ స్దాయిలో మోసం చేయడం గతంలో ఎప్పుడూ కనీ వినీ ఎరగం. కూటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వమిది: కూటమి పాలన చూసి ప్రజలందరూ ఇది కూటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వం అని, వీరు చేస్తున్నది సుపరిపాలన కాదని శుద్ద దండగ పాలన అని, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వమని ప్రజలు అర్దం చేసుకున్నారు. తాను సేఫ్ డ్రైవర్ని అన్న చంద్రబాబు... మీరు బస్సు ఎక్కై ఎవరైనా టిక్కెట్ అడిగితే ఆరోజు తన పేరుచెప్పమన్నారు. కానీ ఇవాళ కండక్టర్లు కేవలం 5 రకాల బస్సుల్లో తప్ప మిగిలిన అన్ని రకాల బస్సులలో మహిళల నుంచి ముక్కుపిండి టిక్కెట్ వసూలు చేస్తున్నారు. ఇది మోసం కాదా? ఎన్నికల్లో అనేక హామీలిచ్చారు. ఇంటింటికి వెళ్లి బాండ్లు కూడా పంపిణీ చేయడంతో పాటు బహిరంగ సభల్లో మీరిచ్చిన హామీలను ప్రజలు మర్చిపోలేదు చంద్రబాబూ? మీ మేనిఫెస్టెలో మీతో పాటు పవన్ కల్యాణ్ ఫోటో కూడా ముద్రించారు. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే రాశారు. ఇవాళ కేవలం 5 బస్సులకే దాన్ని పరిమితం చేస్తూ మహిళలను నిట్టనిలువుగా మోసం చేస్తున్నారు. కేవలం పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులతో మాత్రమే ఉచిత బస్సు పథకం అమలవుతుంది. మిగిలిన వాటిలో నాన్ స్టాప్, డీలక్స్, ఆల్ట్రా డీలక్స్, ఇంద్ర, వెన్నల, గరుడ, అమరావతి ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం లేదు. ఇవాళ రాష్ట్రంలో 11,256 ఆర్టీసీ బస్సులంటే వాటన్నింటికీ అమలు చేస్తామని.. కొద్ది వాటికే పరిమితం చేయడం ఎంత వరకు సమంజసం రాష్ట్రంలో మహిళలందరూ ప్రశ్నిస్తున్నారు? తిరుపతికి 14 బస్సులు మారాలా?: కూటమి ప్రభుత్వంలో చాలా మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు. మహిళా మంత్రులు కూడా ఉన్నారు . మీరు, మేమూ కలిసి మీరు చెప్పిన ఉచిత బస్సు ఎక్కి తిరుపతికి వెళ్దాం. ఆ బస్సు తీసుకువెళ్తుందో లేదో చూద్దాం? ఉచిత బస్సు కోసం వేసిన సబ్ కమిటీలో హోంమంత్రి అనిత, పక్క జిల్లాకు చెదిన మంత్రి గుమ్మడి సంధ్యారాణిలు కూడా సభ్యులుగా ఉన్నారు. మీలో ఎవరు వచ్చినా ఆ బస్సు తిరుపతి నేరుగా తీసుకెళ్తుందో లేదో చెప్పాలి. అంటే తిరుపతి వెళ్లాలంటే 13,14 బస్సులు మారితే తప్ప తిరుపతి చేరుకోలేదని పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం మహిళలు లగేజీ పట్టుకుని అంత దూరం అన్ని బస్సులు మారి తిరుపతి వెళ్లాల్సిన పరిస్ధితి కల్పించారు. ఈ రాష్ట్రంలో 1560 ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో .... 950 నాన్ స్టాప్ సర్వీసులుంటే వాటికి ఉచిత బస్సు సౌకర్యం లేదని చెప్పారు. అలాంటప్పుడు కొద్ది బస్సులతో ఎక్కడకని ప్రయాణం చేస్తారు ? ఇది మోసం కాదా? ‘నేను సేఫ్ డ్రైవర్ని అని పదే, పదే చెప్పుకునే చంద్రబాబు గారు... ఆ రోజు ఉచిత ప్రయాణానికి ఒక్క షరతు పెట్టకుండా ఇవాళ ఎందుకు ఇన్ని షరతులు విధించారు. మీ షరతులతో మహిళలు కనీసం శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం నాన్ స్టాప్ బస్సులో వెళ్లడానికి కూడా లేదు. విజయనగరం నుంచి విశాఖ, వైజాగ్ నుంచి నర్సీపట్నం కూడా నాన్ స్టాప్ లో వెళ్లడానికి లేదు. ఎవరిని మభ్యపెట్టడానికి ఈ షరతులు ? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి జనసేన ఎన్నికల ప్రచారం యాడ్ లో ఓ మహిళ మాట్లాడుతూ... ఒక మహిళ తిరుపతి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం , శ్రీకాళహస్తి ముక్కులన్నీ ఉండిపోయాయి. ఇవి తీరాలంటే కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే... కూటమి గెలవగానే ముక్కులు తీర్చుకోవచ్చని తన భర్తకు చెబుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారెని నేరుగా ప్రశ్నిస్తున్నాం. ఏ బస్సు ఎక్కితే నేరుగా ఈ ముక్కులన్నీ తీరుతాయే సమాధానం చెప్పాలి ? ఇవాళ తిరుపతి నో ఫ్రీ బస్ ? శ్రీకాళహస్తికి నో ఫ్రీ బస్ ? శ్రీశైలంకి నో ఫ్రీ బస్?, విజయవాడకి నో ఫ్రీ బస్?, అన్నవరానికి నో ఫ్రీ బస్ ? అలాంటప్పుడు ఈ తరహా యాడ్ లతో ఎందుకు మహిళలను మోసం చేశారు? ఆ రోజు ఉచిత బస్సులతో టిక్కెట్ అడిగితే మహిళలను మొహం చూపించమని చెప్పిన చంద్రబాబు ఇవాళ మొహం చాటేశారు. రెండున్నర కోట్ల మంది మహిళలను మీరు ఉచిత బస్సు పేరుతో మోసం చేసారు. గతంలోచంద్రబాబు ఫ్రీ బస్ అంటే రైట్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ మహిళలకి ఏ బస్సు ఎక్కితే ఉచితమో అర్దం కావడం లేదు. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణమివ్వాలి: అన్ని బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేయాలంటే నెలకు రూ.౩౦౦ కోట్లు ఖర్చు కాగా.. ఏడాదికి సుమారుగా రూ.౩వేల కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగిన ఖర్చు కంటే ఇది తక్కువే. మీరు తిరిగే స్పెషల్ ఫ్లైట్లకు మాత్రం ఎలాంటి షరతులు ఉండవు. పేద మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మాత్రం అన్నీ షరతులే. చివరగా ఉచిత బస్సు పథకం ద్వారా చంద్రబాబు ఏపీఎస్ ఆర్టీసీ నిర్వచనాన్నే మార్చివేసారు. ఏ అంటే ఆడపడుతులను పి ఇంటే పైసా ఖర్చు లేకుండా ఎస్ అంటే సంతోషంగా ఆర్ అంతే రాష్ట్రమంతా టి అంతే తిరిగే సౌకర్యం కల్పిస్తానని చెప్పి... సి అంటే చీట్ చేసిన చంద్రబాబు అని అర్ధం మార్చివేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఏసీ బస్సులు, నాన్ స్టాప్ బస్సులలో కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలి... లేని పక్షంలో మహిళలతో పాటు పోరాటం చేస్తాం. లోకేష్ మహిళా గౌరవం గురించి మాట్లాడ్డం సిగ్గుచేటు: మంత్రి లోకేష్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. మహిళల అంటే గౌరవం లేదని మాట్లాడుతున్నారు. చెల్లి రాఖీ కట్టలేదని విమర్శిస్తున్నారు. మీరు చెప్పినవన్నీ మీ తండ్రి చంద్రబాబుకే వర్తిస్తాయన్న విషయం గుర్తుపెట్టుకొండి. మీ మేనత్తలు ఏనాడైనా మీ తండ్రికి రాఖీ కట్టారా ? జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చాలాసార్లు ఆయనకి రాఖీ కట్టారు. ఇటీవల రూ.200 కోట్ల ఖర్చు పెట్టి అమరావతిలో కడుతున్న ఇంటికి మీరు ఇటీవలే భూమి పూజ చేశారు. మరి ఆ ఇంటి గహప్రవేశానికి మీ మేనత్తను పిలవలేదా లోకేష్ ? హైదరాబాద్ లో బారీ రాజభవనం కట్టారు, ఆ ఇంటి గహప్రవేశానికి ఎందుకు మీ మేనత్తను పిలవలేదు ? మీరు తల్లి గురించి మాట్లాడుతున్నారు కదా.. మీ నాన్నగారి తల్లికి మీరు ఎంత గౌరవం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకం గురించి అడుగుతున్నారు కదా? మీ తండ్రి చంద్రబాబు హెరిటేజ్ ఆస్తులలో మీ మేనత్తకి ఎంత వాటా ఇచ్చారు ? మీకు ఇలాంటి వ్యక్తిగత విషయాలు మాట్లాడే అర్హత ఉందా లోకేష్ ? ఇవేవీ చేయకుండా ప్రజలను మభ్యపెట్టటానికే మీరు ఇలాంటి మాట్లలు మాట్లాడుతున్నారు. తన సొంత అన్నయ్య ముఖ్యమంత్రి అయితే ఎలాంటి భరోసా లభిస్తుందో ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఉన్నఆడబిడ్డలందరూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ రకమైన భద్రత పొందింది. అదే మీ తండ్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కోడలి మగ బిడ్డను కంటానంటే అత్త ఒద్దంటుందా ? అంటూ ఆడబిడ్డ పుట్టుకనే అవహేళన చేశారు. ఆయన కుమారుడిగా మీరు ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చే గౌరవం గురించి మాట్లాడుతున్నారు. మహిళలను గౌరవించే అలవాటు మీకుందా? గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి భార్యనే విమర్శించిన మీరా మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారు. రూ.5 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్ తల్లిని మీరు ఐ–టీడీపీ ద్వారా విమర్శించిన విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయిన గౌరవ నందమూరి తారకరామారావు గారి భార్య లక్ష్మీ పార్వతిని ఈ రోజుకి కూడా మీరు ఎంత దారుణంగా తూలనాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. లోకేష్ మహిళల గౌరవం గురించి మాట్లాడుతారు? ఇంకా మహిళలను మభ్యపెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తారు. ఆడబిడ్డలను వేధించిన టీడీపీ నేతలపై చర్యలేవి? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళా భద్రతపై చంద్రబాబు ఒకే పాట పాడతారు. ఆడబిడ్డ జోలికి ఎవరు వచ్చినా అదే వారికి ఆఖరి రోజు అని గొప్పగా చెబుతుంటారు. మాటల్లో తప్ప ఇది చేతల్లో ఎప్పుడూ అమలు కాలేదు. మీ టీడీపీ ఎమ్మెల్యే నజీర్ వేధింపులకు టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్న చేసింది. మీ పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేస్తారా చంద్రబాబూ ? కళ్యాణదుర్గంలో మీ ఎమ్మెల్యే అనుచరుడి వేధింపుల వల్ల నిండు గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. తన ఆవేదన వాయిర్ రికార్డ్ చేసింది. ఇంత దారుణంగా మీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహిళలను వేధిస్తుంటే.. మీరు డైలాగులు చెప్పడం తప్ప చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. మీ ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులతో మన రాష్ట్రంలో రక్షణ లేక ఓ బాధిత మహిళ పక్కరాష్ట్రంలోకి వెళ్లి ప్రెస్మీట్ పెట్టింది. మీ పార్టీ నాయకుల వల్లే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రోజుకి 70 వరకు మహిళలపై అఘాయిత్యాల జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని వరుదు కళ్యాణి నిలదీశారు.