తాడేపల్లి: ఉత్తరాంధ్ర అభివృద్ధికి..చంద్రబాబు కుళ్లు బుద్ధికి మధ్యనే ఇవాళ పోరాటం జరుగుతుందని, ఇది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీల మధ్య పోరాటం కాదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ..ఒక ప్రాంతానికి నష్టం కలిగించేలా వ్యవహరించడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల వ్యతిరేకత మధ్య చంద్రబాబు విశాఖలో పర్యటించడం సరైంది కాదని, ఆయన్ను వెనక్కి పంపించడం సమంజసమైన నిర్ణయమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులని, పోలీసులు సంయమనం పాటించి అద్భుతంగా వ్యవహరించారని కితాబు ఇచ్చారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు మూడో విడత ప్రజా చైతన్య యాత్రగా ఉత్తరాంధ్ర పర్యటనకు ఈ రోజు వెళ్లారు. విశాఖపట్నంలోని ఎయిర్‌పోర్టులో చంద్రబాబు 11.45 గంటలకు దిగితే అప్పటి నుంచి ఉధ్రిక్తత నెలకొంది. వేలాది మంది ఉత్తరాంధ్ర ప్రజలు ఎయిర్ పోర్టుకు తరలివచ్చి గో బ్యాక్ చంద్రబాబు..ఈ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు లేదని నినదించారు. నిరసనకారులు చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిల్స్ వేసి నిరసన తెలిపారు. ఇది మంచి పద్ధతా? కాదా? అన్న అంశాలను పక్కన పెడితే..ఒక నాయకుడు ఒక ప్రాంతానికి వెళ్తే ఇలాంటి దాడులు జరగడం సమర్ధించడం లేదు. ఎందుకు ఉత్తరాంధ్ర ప్రజలు అంతగా రియక్ట్ అయ్యారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరుతో వెళ్లి వారికి ఏం చెప్పాలనుకున్నారు.
అమరావతిలోనే రాజధాని ఉండాలని చంద్రబాబు అంటున్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్న ఆలోచన చేశారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని భావించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర వెళ్లి ప్రజలను ఏవిధంగా చైతన్యవంతం చేస్తారు. ఉత్తరాంధ్ర రాజధానిగా పనికిరాదని చెప్పదలుచుకున్నారా?. అమరావతిలో చంద్రబాబుకు, ఆయన తాబేదారులకు ఉన్న భూములకు విలువ పెంచుకునేందుకు ఒక్కటే రాజధాని అంటున్నారు. అలాంటి సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలు నిన్ను ఎలా స్వాగతిస్తారు?. హారతి పట్టి స్వాగతం పలుకుతారా?. చంద్రబాబును అడ్డుకున్న వారిలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు కూడా ఉండవచ్చు. కానీ ఇది కాదు ముఖ్యం. ఆ ప్రాంతం వెనుకబడిందిగా భావించి జేఏసీకి సంబంధించిన అనేక ప్రజా సంఘాలు, అనేక మంది చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు. ఉత్తరాంధ్రను నాశనం చేస్తానని విశాఖకు వెళ్తున్న ఉత్తరాంధ్ర ద్రోహిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఐదు వేల మంది రాయలసీమ నుంచి వచ్చారని టీడీపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. ఒక్కరు కూడా పులివెందుల నుంచి విశాఖ వెళ్లలేదు. ఇది వైయస్‌ఆర్‌సీపీకి, తెలుగు దేశం పార్టీకి మధ్య జరుగుతున్న పోరాటం కాదు..ఉత్తరాంధ్ర అభివృద్ధికి, బాబు కుళ్లు బుద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం. అందువల్లే చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పి పంపించారు. ఇది అప్రజాస్వామ్యమైన విధానమని చంద్రబాబు అన్నారు. కొన్ని మీడియాలు కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో మరిచిపోయారా?. 2017లో వైయస్ జగన్ క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖకు వెళ్లారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా విశాఖ ఎయిర్ పోర్టులో దిగితే అప్పుడు ఏం చేశారో మరిచిపోయారు. ఎయిర్ పోర్టు రన్‌వే మీదికి సివిల్ పోలీసులు వచ్చి ఆపేశారు. రన్‌వే ధర్నా చేసినా పట్టించుకోలేదు. ఆ రోజు మీరు అలా చేశారని, మేం ఇవాళ ఇలా చేయడం లేదు. ఈ రోజు ప్రజలే మిమ్మల్ని తిప్పి పంపించారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు మరో విధంగా మాట్లాడటం సమంజసం కాదు. అలాగే మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా మహిళా సదస్సులో పాల్గొనేందుకు వెళ్తే ..ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారో అర్థం కాకుండా తిప్పి తిప్పి హైదరాబాద్‌లో వదిలేశారు. ఆ రోజు లేని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తు వచ్చిందా? ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడటంతో పోలీసులకు మరోదారి లేక మిమ్మల్ని వెనక్కి పంపించారు. ఐదు వేల మంది ప్రజలపై లాఠిచార్జ్ చేసి, బాష్పవాయువులు ప్రయోగించి చంద్రబాబును పంపించాలా? కాస్త చంద్రబాబుకు జ్ఞానం ఉంటే..ఆయనే స్వచ్ఛందంగా తిరిగి వెళ్లాలి. కాగితం ఇస్తే తిరిగి వెళ్తామని చంద్రబాబు చెప్పడం బాధాకరం. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని, రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు. కుప్పంలో జరిగిన చైతన్య యాత్రలో ఓ రైతు ఏమన్నారో విన్నాం.మీ పాలనలో అవినీతి జరిగిందని నీ యాత్రలోనే ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇవాళ సిగ్గు లేకుండా ఉత్తరాంధ్రకు ఎలా వెళ్తారు..మీకు రాజధాని అవసరం లేదని ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా?. ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదు.
విశాఖపట్నం చాలా శాంతి స్వభావం కలిగిన నగరం. ఆ ప్రాంతంలోని పౌరులు శాంతి సౌఖ్యాలు కోరుకుంటారు. వైయస్ జగన్ రాజధాని అక్కడ పెడితే పులివెందుల ప్రజలు వస్తారని అసత్య ప్రచారాలు చేస్తూ ఆ ప్రాంత ప్రజలను కలుషితం చేయాలని చంద్రబాబు దుర్మార్గపు బుద్ధితో మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి. ధర్మంగా, న్యాయంగా ప్రజా చైతన్య యాత్రలు చేసుకోండి తప్పు లేదు. ఒక ప్రాంతాన్ని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా, నష్టం చేసే విధంగా మాట్లాడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు మిమ్మల్ని వెలెస్తారు..అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చంద్రబాబుకు చెప్పదలుచుకున్నాను. ఇవాళ విశాఖలో పోలీసులు వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. విశాఖ నుంచి వెనక్కి పంపించడం సమంజసమైన నిర్ణయంగా భావిస్తున్నట్లు చెప్పారు.