ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ జాబితాలో చేర్పించారు

టీడీపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఫిర్యాదు 
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘంను కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైయ‌స్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మీడియాకు పూర్తి వివరాల్ని తెలిపారు. 

‘‘అమెరికా సర్వర్‌లో ఓటర్ల డేటా స్టోర్‌ చేస్తున్నారు. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్‌ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాం. సీఈసీ కూడా మా విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించింది.. అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు.  

ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76 వేల 580 ఓట్లను ఒకే ఫొటోతో ఇంటి పేరు​ మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్లు ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్లుగా టీడీపీ సానుభుతిపరుల పేరు నమోదు చేశారని.. హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు, ఒడిషాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని తెలిపారు.  

ఈ దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్‌వెవల్‌ అధికారులపై టీడీపి నేతలు దాడులు చేస్తున్నారనివైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను  తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులను బీఎల్‌ఓలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని కూడా తెలియజేశారు. విచారణ సమయంలో నిజాలు వెలుగు చూస్తుండడంతో బీఎల్ఓలను టీడీపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Back to Top