స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఒప్పుకోం

రాజ్యసభ చర్చలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టీకరణ

న్యూఢిల్లీ: వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో నవరత్న సంస్థగా భాసిల్లుతున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంత మాత్రం సమర్ధించబోదని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల పునఃవ్యవస్థీకరణ, పునరుద్దరణ, పునరుజ్జీవనానికిక అవసరమైన ప్రణాళిక, చర్యలను రూపొందించడానికి బదులుగా వాటిని ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు తమపై ఉంచిన సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశలో పనిచేస్తాయి. తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ప్రైవేట్‌ రంగ సంస్థలు కొంత మేర ఉపాధి కల్పించినా లాభార్జనే ఏకైక ధ్యేయంగా కంపెనీలను నడుపుతాయన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయింపు సంపూర్ణంగా జరిగిన తర్వాతే మిగిలిన గనులను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న టన్ను ఖనిజానికి ఇంత మొత్తం రాయల్టీ మైనింగ్‌ లీజుదారుడు చెల్లించే నిబంధన స్థానంలో మైనింగ్‌ ఆదాయంలో ప్రభుత్వం వాటా పొందేలా ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్నారు. దీని వల్ల 50 మైనింగ్‌ బ్లాక్‌లు ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్తాయన్నారు. ఈ బ్లాక్‌ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.50 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. అయితే పవర్‌ ప్లాంట్‌ల నుంచి రావాల్సిన రూ.17 వేల కోట్ల బకాయిలను రాబట్టలేక కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ఈరోజు తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. పవర్‌ ప్లాంట్‌ల నుంచి బకాయిలను రాబట్టి కోల్‌ ఇండియాను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలన్నారు. తద్వారా ఆ సంస్థలో పని చేస్తున్న వేలాది ఉద్యోగుల భవిష్యత్తును కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్ణీత కాలపరిమితో రాష్ట్ర ప్రభుత్వం గనుల వేలంను నిర్వహించలేని పక్షంలో ఆ గనులను వేలం వేసే హక్కును కేంద్ర ప్రభుత్వం పొందేలా బిల్లులో ప్రతిపాదించారు. ఇది భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్న ఫెడరల్‌ స్ఫూర్తికే విరుద్ధమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ రాజ్యసభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై జరుగుతున్న చర్చ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top