తాడేపల్లి: రాష్ట్రంలో కౌలురైతుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌలురైతులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సెంట్ భూమి కూడా లేని దాదాపు పది లక్షల మంది కౌలుదారుల పట్ల ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... రాష్ట్రంలో కౌలురైతులకు కార్డులను జారీ చేయడం ద్వారా ప్రభుత్వ పరంగా రైతాంగానికి అందించే అన్ని పథకాలను వారీకి వర్తింపచేసేవారు. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో సీసీఆర్సీ మేళాలు నిర్వహించి, కౌలురైతులను గుర్తించి, వారికి కార్డులను జారీ చేస్తుంటారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. నేటికీ కౌలుదారులకు కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించలేదు. ఎక్కడా సీసీఆర్సీ మేళాలు జరగడం లేదు. వ్యవసాయం పట్ల మొదటి నుంచి సీఎం చంద్రబాబుకు ఉన్న చిన్నచూపు ఇప్పుడు కౌలురైతుల పట్ల శాపంగా మారుతోంది. కౌలురైతులకు ప్రభుత్వ పరంగా దక్కాల్సిన చేయూతను వారికి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. కౌలు రైతులు బ్యాంకుల ఆంక్షలతో రుణాలకు దూరమై పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రూ.3 నుండి రూ. 5 వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌలు రైతులు ఇబ్బంది పడకూడదు అన్న సంకల్పంతో వైయస్ జగన్ ప్రభుత్వం 2024-2025 సీజన్లో 10 లక్షల మంది కౌలుదారులకు కార్డులు జారీ లక్ష్యంగా నిర్దేశించింది. 9.13 లక్షల మందికి కౌలుదారులకు కార్డులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరికి కార్డులు ఉన్నప్పటికీ పెట్టుబడి సాయంతో, పాటు ఏ ఒక్కరికి భీమా పరిహారం, నష్టపరిహారం వంటివి ఏమీ అందలేదు. పాత కౌలు చట్టం ప్రకారమే ఈ ఏడాది కూడా 10 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయాలని నిర్ణయించారు. అయితే భూ యజమానులు సమ్మతి తెలిపేందుకు ముందుకు రావడం లేదని అధికారులు సాకులు చెబుతున్నారు. వారిని ఒప్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది విఫలమయ్యారు. దీనిపై జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులకు దిశానిర్ధేశం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కౌలురైతులకు అండగా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో 70 నుండి 80 శాతం వరకు కౌలుదారులే ఉన్నారు. వారికి కౌలుదారీ కార్డులు కల్పించే విషయంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వ్యవసాయ అధికారులతో మేళాలు ఏర్పాటు చేసి కార్డులు జారీ చేసింది. ఈ కార్డుల వల్ల కౌలు రైతులకు విత్తనాల సబ్సిడీ, రైతుభరోసా, బ్యాంకు రుణాలు, సున్నావడ్డీ వంటి సంక్షేమ ఫలాలు అందేవి. రాష్ట్రంలో సెంట్ భూమి కూడా లేనివారు దాదాపు పదిలక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి ఈ కార్డులు ఇచ్చి, చట్టబద్దత కల్పించి, ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలను వారికి అందించేందుకు వైయస్ జగన్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం 2019-2024 మధ్య 25.94 లక్షల మంది కౌలుదారులకు కార్డులు జారీ చేసింది. వీటి ప్రామాణికంగానే పంట రుణాలతో పాటు వైయస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది. గడిచిన ఐదేళ్లలో 6.78 లక్షల మందికి రూ. 8,345 కోట్లు పంట రుణాలు ఇచ్చాం. 5.57 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలుదారులకు రూ.751.42 కోట్లును రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా అందించాం. 3.55 లక్షల మందికి రూ. 731.08 కోట్లు పంట భీమా పరిహారం అందింది. 2.42 లక్షల మందికి రూ. 253.56 కోట్లు పంట నష్టపరిహారం అందించడం జరిగింది. పండిచిన ధాన్యంను కొనలేని దుస్థితి రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యంను కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. పశ్చిమ గోదావరిజిల్లాలో పదిలక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించింది. మిగిలిన మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను ఎవరు కొనుగోలు చేయాలి? గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కోనుగోలు చేసేలా చూశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణపై మొద్దునిద్ర పోతోంది. రైతుల ఉసురు పోసుకుంటోంది. కూటమి ప్రభుత్వానికి పట్టని పొగాకు రైతు కష్టాలు రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. కనీస మద్దతుధర లేక పొగాకు రైతులు బెంబేలెత్తుతున్నారు. ధరలు దారుణంగా పతనం కావడంతో రైతులు ఎం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. శ్రీమా కంపెనీ నారుతో పంట సాగు చేయండి, కొనే బాధ్యత మాది అని సదరు కంపెనీ ప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మి ప్రకాశం జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున సదరు కంపెనీ నారుతో సాగు చేశారు. ఇప్పుడు పంట చేతికొచ్చాక నాణ్యత లేదంటూ ధర తెగ్గొయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వేలం ప్రారంభమైన తొలినాలలో క్వింటా పొగాకు రూ.12 వేలకు కొనుగోలు చేసిన కంపెనీలు, తరువాత ఆ సొమ్మును రైతులకు ముందుగా అందించిన నారు, క్యూరింగ్ కోసం సమకూర్చిన పట్టలు తదితర అంశాలను చూపి వారికి ఇచ్చే సొమ్ములోనూ మినహాయింపులు చేసుకుని, మిగిలిందే రైతులకు ఇస్తున్నారు. బర్లీ పొగాకు కొనుగోళ్ళకు ముందుకు రాని కంపెనీలు ఈ ఏడాది జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో బర్లీ పొగాకు సాగు చేశారు. ఎకరాకు రూ 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి పొగాకు పండించిన సరైన దిగబడి రాలేదు. గత ఏడాది తొలి విరుపులు ఆడుగాకు సైతం క్వింటా రూ. 8 నుంచి రూ.10 వేలు పలికింది. మలి విరుపులో క్వింటా రూ. 15వేల నుండి రూ. 18 వేలకు కొనుగోలు చేశారు. అయితే ఈ ఏడాది క్వింటా మలి విరుపు ఆకు రూ.10 వేలు కూడా పలకడం లేదు. ప్రైవేట్ కంపెనీలు పొగాకు కొనుగోలుకు ముందుకు రాకపోతే టుబాకో బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బర్లీ పొగాకు రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని 20 రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించినా, నేటికి ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. రెండవ విడతలో నాణ్యత సాగుగా చూసి తొలి విడతలో చెల్లించిన ధర కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. వేలంలో పాల్గొనకుండా కంపెనీల ప్రతినిధులు ముఖం చాటేస్తున్నారు. గత మూడు నెలలుగా రైతులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినా బర్లీ పొగాకు కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. పత్తి, మిరప సాగులో నష్టాలు చవిచూసిన రైతులు పొగాకు కంపెనీల మాటలు నమ్మి బర్లి సాగు చేసి దగాపడ్డారు. పొగాకును విక్రయించేందుకు సిద్దం చేసి రెండు నెలలకు పైగా అయ్యింది. వేసవిలో ఎండలు ఎక్కువ కావడంతో ఆకు పాడైపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బేళ్లు ఆరబెట్టాలి, ఆకును తిరగేయాలి లేదంటే లోపలకు గాలి చేరి ఆకు కుళ్ళిపోయి రంగు మారే ప్రమాదం ఉంది. పొగాకు రైతుకు అండగా వైయస్ఆర్‌సీపీ గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం లో సుమారు రూ.500 కోట్లు ప్రత్యేక నిధి కేటాయించి మార్క్ ఫేడ్ ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేశాం. కూటమి ప్రభుత్వం సైతం తక్షణం పొగాకు రైతులను ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి. ఒకవైపు రేటు లేక పూర్తిగా నష్టపోయే పరిస్తితుల్లో పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం వారిని ఆదుకునే చర్యలపై ఏ మాత్రం స్పందించడం లేదు. పోగాకు రైతుకు అండగా ప్రభుత్వ దిగివచ్చే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.