జీహెచ్‌ఎంసీ యాక్టు చూపించి క‌డ‌ప మేయర్‌పై చర్యలా?

వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు రవీంద్రనాథ్ రెడ్డి
 

వైయ‌స్ఆర్ జిల్లా:  గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్‌ఎంసీ) యాక్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చూపించి క‌డ‌ప‌ మేయర్ సురేష్‌బాబుపై చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉంద‌ని వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిప‌డ్డారు. కూటమి పాలనలో అభివృద్ధి లేదు.. కానీ కక్ష సాధింపులో మాత్రం ముందుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు . రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. కుర్చీల కోసం కుమ్ములాట నడుస్తోందని ఫైర్ అయ్యారు. గురువారం క‌డ‌ప న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో రవీంద్రనాథ్ రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో అభివృద్ధి లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కక్ష సాధింపులో భాగంగా రాక్షసానందం పొందుతున్నారు. వాళ్ళు పెడుతున్న కేసులు ఏవీ కోర్టుల్లో నిలబడటం లేదు. కడప మేయర్ సురేష్ బాబు విషయంలోనూ అదే తీరులో వెళ్తున్నారు. అసలు యాక్ట్ లేదు.. మనం జీహెచ్‌ఎంసీ యాక్టు అమలు చేసుకుంటున్నాం. మన రాష్ట్రానికి అసలు యాక్ట్ లేనే లేదు. జీహెచ్‌ఎంసీ యాక్టు చూపించి మా మేయర్‌పై చర్యలు తీసుకోవడం విడ్డూరం. మేయర్ కుమారుడి సంస్థకు కమిషనర్ రిజిస్టర్ చేస్తారు.. అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదు?

ఆరోపణల్లో ఏదైనా అవినీతి చూపించలేదు. కుర్చీల కోసం కుమ్ములాట కోసం ఇదంతా జరుగుతోంది. వాళ్ళ పత్రికలే కుర్చీల కోసమే ఇదంతా జరుగుతుందని రాసింది. ఎమ్మెల్యేలకు చాలా కంపెనీలు ఉన్నాయి.. మరి వాళ్ళు కాంట్రాక్టులు చేయవచ్చా?. మేయర్ తన వివరణలో తన దృష్టికి రాలేదని వివరణ కూడా ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై మాకు గౌరవం ఉంది.. న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి నేరుగా ఫిర్యాదు చేసారట.. దీనిలో ఇక రాజకీయం లేక ఏముంది?. నగరానికి ఆమె ఒక్క పైసా నిధులు తీసుకురాక పోగా కక్ష సాధింపులకు దిగడం సరికాదు.

వేదికపై మేయర్ ఒక్కరే కూర్చోవాలి.. అది చట్టం. నీకు కుర్చీ వేయలేదని కక్ష సాధింపు అంటే ఎలా?. దీనికి మేయర్ ఇంటిపై చెత్త వేయిస్తారా?. తప్పుడు ఫిర్యాదులు చేస్తారా?. ఈ ప్రభుత్వం రాగానే అవిశ్వాసం పెట్టీ దించాలని ప్రయత్నం చేశారు. అది వీలు కాకపోవడంతో ఈ రకంగా కక్ష సాధింపునకు దిగుతున్నారు. చిన్న విషయాన్ని చూపి అనర్హత అనడం దారుణం’ అంటూ మండిపడ్డారు. 

Back to Top