అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్వీట్‌
 

ఢిల్లీ: తనపై అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.

‘అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్  సీతమ్మధార ఆఫీస్‌లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను.

 ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను’ అని అన్నారు. 

 ఈ వ్యవహారంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తా. 

చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్‌​ మెయిల్‌ చేసి డబ్బు వసూల్‌ చేసే వ్యక్తిని కాదు. రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని  కాదు. అన్ని హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తా. మహాన్యూస్‌ వంశీకృష్ణను వదలను. పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్‌ మోషన్‌ మూవ్‌  చేస్తా’ అని విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. 

Back to Top