కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన ప్రభుత్వ వైఫల్యం

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం

శ్రీకాకుళం జిల్లా పలాసలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

కాశీబుగ్గ ఆలయంలో దుర్ఘటన విషయం తెలిసి వెంటనే అక్కడికి వెళ్లిన మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, 
ధ‌ర్మాన ప్రసాదరావు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఇంకా పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, నాయకులు.

బాధితులకు పరామర్శ.

క్షతగాత్రులకు స్వయంగా వైద్య సేవలందించిన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు. 

టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో వరస దుర్ఘటనలు

ఆలయాల్లో ఇన్ని జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం

భక్తుల సంరక్షణ, భద్రతా చర్యల్లో బాధ్యతా రాహిత్యం

కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట

అది ప్రైవేటు వారిదంటూ ప్రభుత్వం కబుర్లు

పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తే పట్టించుకోరా?

ప్రజలు, భక్తుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిది కాదా?

సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి ధర్మాన

పలాస:  కార్తీక మాసంలో ఏకాదశి రోజున కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. స్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చినా, అక్కడ తగిన ఏర్పాట్లు చేయలేదని, మరోవైపు భద్రతా చర్యలపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి పెట్టలేదని ఆయన చెప్పారు. పైగా ఆ ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో లేదని చెప్పడం హేయమని, ఆలయం ఎవరిదైనా ప్రజలు, భక్తుల భద్రత బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే అని పలాసలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

● కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే:

    పవిత్ర దినాల్లో దేవాలయాలకు భక్తులు వెళ్లడం సహజం. కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు భారీఎత్తున భక్తులు వచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి, ఆయా చోట్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేవాలయం ప్రైవేట్‌ ఆధీనంలో ఉందా? ప్రభుత్వ ఆధీనంలో ఉందా అనేది అసలు ప్రశ్నే కాదు. ఆలయాల్లో తగిన ఏర్పాట్లు చేసి భక్తుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిది.
    కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినా, కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే బందోబస్తుకి వెళ్లారని తెలుస్తోంది. ఆ ఆలయానికి భక్తులు విపరీతంగా వస్తారని, రద్దీ ఉంటుందన్న విషయం దృష్టిలో ఉన్నా, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల 9 మంది మరణానికి దారి తీసింది. ఇద్దరు తీవ్ర గాయాల పాలుకాగా, మరో ఆరుగురు చిన్న చిన్న గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

● రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి:

    సింహాచలంలో పవిత్ర చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. అంతకు ముందు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. అక్కడా ప్రభుత్వ నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో ఇలా వరస ఘటనలు జరుగుతున్నా, వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. అలాంటి వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజలు, భక్తుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?

ఇకనైనా ప్రభుత్వం బుద్ది తెచ్చుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుని ప్రజలు, భక్తుల ప్రాణాలు కాపాడాలి. కాశీబుగ్గ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. అలాగే క్షతగాత్రులకు కూడా తగిన పరిహారం ప్రకటించి ఆదుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్‌ చేశారు

Back to Top