రాజ్యాంగ వ్యవస్థల్ని చంద్రబాబు భ్రష్టుపట్టించారు

నిమ్మగడ్డ రమేష్‌ తనను తాను ఎస్‌ఈసీఎగా ఎలా నియమించుకుంటారు

అడ్వకేట్‌ జనరల్‌ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేదు

మా పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం

గత పదేళ్లుగా మా పార్టీ గాంధేయ మార్గంలోనే నడుస్తోంది

న్యాయస్థానాలు, చట్టాలపై మా పార్టీకి పూర్తి నమ్మకం ఉంది

టీడీపీ సోషల్‌ మీడియా దుర్మార్గాలపై కేసులు పెడితే జైళ్లు సరిపోవు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. 151 సీట్లతో గెలిచిన ప్రజా ప్రభుత్వాన్ని కాదని, కౌన్సిల్‌లో తనకున్న బలంతో ఏపీలో ప్రజాస్వామ్యాన్ని, పరిపాలన వికేంద్రీకరణ, దళితులకు అందాల్సిన సామాజిక న్యాయం అందకుండా చేస్తున్నాడన్నారు. విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేష్‌ సమాధానం చెప్పలేదన్నారు. నా పోస్టు నాకు ఇచ్చేయండి అంటూ తనకు తాను సుమోటోగా ఆర్డర్లు రాసుకుంటున్నాడన్నారు. 

ఏ ఆర్డర్‌ అయినా కూడా ప్రభుత్వం నుంచి రావాలని, ఓ అధికారి తనను తాను నియమించుకోవడం ఎక్కడా చూడలేదన్నారు. బహుశా ఇది నిమ్మగడ్డ రమేష్‌కే చెల్లుతుందేమోనని అభిప్రాయ వ్యక్తం చేశారు. యాక్సిస్‌ ఆఫ్‌ హీవిల్‌గా కనిపించడం లేదా అని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తుల బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, మనందరిపై ఉందని తెలియజేశారు. 

ఇంకా ఏం మాట్లాడారంటే..
'ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం మొత్తం ఈరోజుకు మొదట ఒక 49 మందికి, రెండో లిస్టులో 44 మందికి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, పార్టీ కార్యకర్తలకు న్యాయం, చట్టం మీద అపారమైన నమ్మకం ఉంది. న్యాయస్థానాలను గౌరవించాం కాబట్టే అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మా పార్టీపై దొంగ కేసులు పెట్టినా.. పార్టీ అధ్యక్షులను అరెస్టు చేసి 16 నెలలు జైల్లో పెట్టినా శాంతియుతంగా కోర్టుల్లోనే పోరాటం చేస్తున్నాం. కోర్టులపై ఎటువంటి దూషణలు, అసాంఘిక చర్యలు పాల్పడలేదు. మాకు కోర్టులపై ఉన్న విశ్వాసానికి ఇదొక్కటే చిహ్నం. 

పదేళ్ల మా పార్టీ చరిత్రలో మేము గాంధేయ మార్గంలోనే నడిచాం. శాంతినే కోరుకుంటున్నాం. కానీ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా.. చట్ట విరుద్ధంగా చర్యలకు పాల్పడుతున్నారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు, మైనార్టీలకు అందరి ప్రయోజనాలను పరిరక్షించేందుకు పుట్టిన పార్టీ. ఆ వైపుగానే మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విధివిధానాలు కొనసాగుతాయి. 

సోషల్‌ మీడియా కార్యకర్తలు, 2014 నుంచి 2019 వరకు గత ప్రభుత్వం పెట్టిన కేసుల్లో నలిగిపోయారు. నీతి కోసం, నిజాయితీ కోసం వీర సైనికుల్లా సోషల్‌ మీడియా సైనికులు పనిచేశారు. ఇప్పుడు కోర్టు నోటీసులు ఇచ్చి 49+44 మంది తప్పు చేశారనో.. చేయలేదనో చెప్పడం లేదు. వీరిలో వైయస్‌ఆర్‌ సీపీ వారే ఉన్నారని చెప్పలేం. కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్లు నా పేరుతోనే ఫేక్‌ ఐడీలతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో అకౌంట్లు క్రియేట్‌ చేసి మా పార్టీ అధ్యక్షులను దూషించారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పనిచేస్తున్న వారు అయినా.. చేయకపోయినా వీరికి సపోర్టు చేస్తే కోర్టుల్లో ఎక్కడ కంటెమ్ట్‌ వస్తుందేమోనని భయపడే పరిస్థితుల్లో మేము లేము. గత ఐదున్నర సంవత్సరాలుగా ముఖ్యంగా సోషల్‌ మీడియా నేనే చూసుకుంటున్నా. మా కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. ఈరోజుకు ఒక కార్యకర్త అయినా కేసుల్లో ఇరుకున్నా.. వారికి అండగా ఉంటా. 

గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే తన అనుచరుడు అరెస్టు అయితే జైలుకు వెళ్లి మరీ చూసివచ్చారు. మా పార్టీకి చెందిన వారిని మేము దూరం చేసుకోం. అది పార్టీకి కార్యకర్తలకు ఉన్న సంబంధం. అలాగని కోర్టులను తప్పుబట్టడం లేదు. ఎవరైతే తప్పు చేశారో.. వారిని శిక్షించమనే మేము చెబుతాం. 

మా పార్టీ సానుభూతి పరులు, నిజాయితీగా ప్రభుత్వాన్ని సమర్థించేవారు 99 శాతం సందర్భాల్లో టీడీపీ దుర్మార్గాలకు స్పందనగా, వారి కవ్వింపులకు సమాధానంగా పోస్టులు పెట్టారు. టీడీపీ కవ్విస్తేనే పోస్టులు పెట్టారు కానీ, మా వాళ్లు కవ్వించింది ఒక్క సందర్భం లేదు. న్యాయ వ్యవస్థను కించపరచాలన్న ఉద్దేశం, అభిప్రాయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోని ఏ ఒక్క కార్యకర్తకు లేదు. మాకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది. 

గత పదేళ్లుగా టీడీపీ అరాచకాలకు శిక్షలు విధిస్తే ఇప్పుడు ఏరకంగా కేసులు పెట్టారో.. అదే రకంగా గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు ఇదే రకమైన పొరపాట్లు చేశారో.. వాటన్నింటిపై కేసులు పెడితే ఆంధ్రరాష్ట్రంలోని జైళ్లు సరిపోవు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 
 

Back to Top