టీడీపీ నేత‌ల అరాచ‌క వీడియోలు ఎందుకు బ‌య‌ట‌కు రాలేదు

వైయస్‌ఆర్‌సీపీపై నిందమోపి టీడీపీని కాపాడాలనే వాళ్ల‌ తాపత్రయం

రిగ్గింగ్‌ జరుగుతుందని ఎస్పీకి ఎమ్మెల్యే పిన్నెల్లి ఫోన్‌ చేసినా స్పందన లేదు

మాచర్ల చుట్టూ తిరిగిన ఎస్పీ.. పాల్వాయ్‌గేట్‌ బూత్‌ వద్దకు ఎందుకు రాలేదు 

పోలింగ్‌ బూత్‌లలో టీడీపీ గూండాలు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు

పోలింగ్ రోజున పోలీసుల వైఖ‌రి ఈసీకి క‌న‌బ‌డ‌లేదా..?

ఆ రెండు గ్రామాల్లో డీఎస్పీలను పెట్టి.. ఒప్పిచర్ల, తుమ్మురుకోట, చింతపల్లి, పాల్వాయ్‌గేట్‌లో ఎందుకు పెట్టలేదు

టీడీపీ వాళ్లు ఈవీఎంల‌ను ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బ‌య‌ట‌కు రాలేదు

ఇదంతా ఒక ప్రీప్లాన్డ్‌గా జరిగినట్టుగా అనిపిస్తుంది

ఈవీఎంలు ధ్వంసమైన బూత్‌ల వీడియోలన్నీ ఈసీ రిలీజ్‌ చేయాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌

నరసరావుపేట: పోలింగ్‌ రోజు 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెబుతున్న ఈసీ.. ఆ వీడియోలను ఎందుకు బయటపెట్టలేదు..? కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్‌ అయ్యింది..? వీడియో ఈసీ రిలీజ్‌ చేసిందా.. వేరే వ్యక్తులు లీక్‌ చేశారా..? దానిపై ఈసీ ఎందుకు చర్యలు చేపట్టలేదు..? కేవలం వైయస్‌ఆర్‌ సీపీపై నింద వేయాలనే క్రమంలో టీడీపీని ఈసీ కాపాడుతున్న మాట వాస్తవం కాదా..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌యాదవ్‌ ప్రశ్నించారు. తుమ్మురుకోట, చింతపల్లి, పాల్వాయ్‌గేట్‌లో విపరీతంగా రిగ్గింగ్‌ జరుగుతుందని, ఆ ప్రాంతంలో ఓటర్లను టీడీపీ గూండాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి పోలీసులకు చెబుతున్నా  పట్టించుకోలేదు, ఎస్పీకి ఫోన్‌ చేసినా కనీసం స్పందించలేదన్నారు. నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. 

అనిల్‌ కుమార్‌యాదవ్‌ ఇంకా ఏమన్నారంటే..
పోలింగ్‌ రోజు ముట్టుగూరు గ్రామంలో టీడీపీ నేతలు ఎస్సీ, బీసీలపై దాడి చేశారు. 9చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని ఈసీ చెబుతోంది, కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో మాత్రమే ఎందుకు, ఎలా రిలీజ్‌ అయ్యింది. 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే మిగతా 8 ఘటనల వీడియోలు ఎందుకు రిలీజ్‌ కాలేదు. ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తుమ్మురుకోటలో టీడీపీ వారు ఈవీఎం ధ్వంసం చేశారు. చింతపల్లిలో రిగ్గింగ్‌ చేశారు. ఒప్పిచర్లలో ఓటు వేస్తున్న ఎస్టీలను బూత్‌లో నుంచి కొట్టుకుంటూ బయటకులాక్కొచ్చారు. 

పాల్వాయ్‌గేట్‌లో బీసీ, ఎస్సీ మహిళలు ఓటు వేసేందుకు వెళ్తుంటే కొట్టి తరిమేస్తుంటే.. ఎమ్మెల్యే పిన్నెల్లి ఎస్పీకి ఫోన్‌ చేసినా, మాచర్ల చుట్టూ తిరిగారు కానీ పాల్వాయ్‌గేట్‌ వద్దకు రావాలనే ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీప్లాన్డ్‌గా జరిగినట్టుగా అనిపిస్తుంది. గంటన్నరసేపు ఎమ్మెల్యే నిలబడి ఫోన్‌ చేసినా స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఏం చేస్తారు. అధికారులకు స్పందించాల్సిన బాధ్యత లేదా..? ఏడు బూత్‌ల వద్ద ఈవీఎంలు పగులగొడితే రీపోలింగ్‌ ఎందుకుపెట్టలేదు. 

బూత్‌లో వైయస్‌ఆర్‌ సీపీ ఏజెంట్‌ కూడా లేకుండా చేసి పోలీస్‌ను కూర్చోబెట్టి రిగ్గింగ్‌ చేయించిన మాట వాస్తవం కాదా..? పాల్వాయ్‌గేట్‌ వద్ద పిన్నెల్లి కుమారుడి తల పగలగొట్టారు, ఎమ్మెల్యేపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అనేక రకాల అరాచకాలు చేసిన టీడీపీకి వత్తాసుగా పోలీసులు పనిచేశారు. రెండు గ్రామాలు కర్లకుంట, కేపీ గూడెంలో డీఎస్పీలను పెట్టి ప్రతి ఓటర్‌ను ఇది నీ ఓటా అని పరిశీలన చేయించిన అధికారులు.. ఒప్పిచర్ల, తుమ్మురుకోట, చింతపల్లి, పాల్వాయ్‌గేట్‌లో ఎందుకు పరిశీలన చేయలేదు. ఎందుకు డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐని కూడా పెట్టలేదు. కనీసం ఆ బూత్‌ల ఫుటేజ్‌లను రిలీజ్‌ చేయండి. 

రిగ్గింగ్‌ జరిగింది రీపోలింగ్‌ జరపండి అని ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే ఇంత వరకు స్పందించలేదు. 13వ తేదీన పోలింగ్‌ జరిగింది.. ఆరోజున వీడియో ఎందుకు రిలీజ్‌ చేయలేదు. ఈరోజున ఆ వీడియో ఎలా రిలీజ్‌ అయ్యింది. మిగిలిన వీడియోలు ఎందుకు రిలీజ్‌ చేయలేదు. వైయస్‌ఆర్‌ సీపీపై నింద వేయాలనే క్రమంలో టీడీపీని ఈసీ కాపాడుతున్న మాట వాస్తవం కాదా..? 

ఎన్నికలు పూర్తయిన తర్వాత కారంపూడి పోతురాజుకుంటలో బుడగ జంగాల ఇళ్ల మీద టీడీపీ గూండాలు దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకెళ్లింది వాస్తవం కాదా..? ఎందుకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. ఒప్పిచర్ల, చింతపల్లి, తుమ్మురుకోట, పాల్వాయ్‌గేట్‌ బూత్‌ల వీడియోలు రిలీజ్‌ చేయాలి. ఆరోజు పోలింగ్‌ సరళిని కూడా రిలీజ్‌ చేయండి. ఎమ్మెల్యే గ్రామంలో డీఎస్పీ జగదీశ్‌ను ఉదయం నుంచి బందోబస్తులో ఉంచారు. మరి మిగిలిన గ్రామాల్లో ఎందుకు నియమించలేదు. ఇదంతా చూస్తుంటే ఎవరికైనా అనుమానం కలుగుతుంది. పోలింగ్ రోజున పోలీసుల వైఖ‌రి ఈసీకి క‌న‌బ‌డ‌లేదా..? టీడీపీ రిగ్గింగ్‌కు పాల్ప‌డిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి. ఈసీ తీరుపై న్యాయ‌పోరాటం చేస్తాం. 

 

Back to Top