ఇళ్ల పట్టాలపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

పెత్తందార్లతో యుద్ధం చేసి పేదలను గెలిపించిన లీడ‌ర్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ 

వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారంటే ఎంతవరకైనా పోరాడుతారు

సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకంత బాధ..?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల పక్షాన నిలబడిన బలమైన లీడర్‌ సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌

తాడేపల్లి: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని అడ్డుకోవడం కరెక్ట్‌ కాదు.. రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పడం చరిత్రలో సువర్ణాధ్యాయమని అన్నారు. పెత్తందార్లతో యుద్ధం చేసి పేదలను గెలిపించిన లీడ‌ర్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేదల పక్షాన బలమైన నాయకుడిగా నిలబడ్డారని చెప్పడానికి సుప్రీం కోర్టు తీర్పు నిదర్శనమన్నారు. అమరావతిలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకంత బాధ అని పెత్తందార్లను ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ చెప్పారు. 

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో  ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాడికి అమరావతిలో సెంటు స్థలం ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు, సుప్రీం కోర్టులలో వాదనలు, టీవీల్లో చర్చలు, మేధావులతో చర్చలు ఈ విధంగా అడ్డుకుంటున్నారంటే పేదవాడంటే వారికి ఎంత చులకనో ఒకసారి రాష్ట్రంలోని పేద వర్గాలు ఆలోచన చేయాలని కోరారు. కోర్టుల్లో వాదనలు వినిపించేందుకు చాలా కాస్ట్‌లీ లాయర్లను నియమించుకున్నారన్నారు. 

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తి.. పేదవాడికి ఇళ్లు కట్టించేందుకు ప్రభుత్వం ముందుకువస్తుంటే దాన్ని ప్రోత్సహించాలి కానీ, ఇవ్వొద్దని చెప్పడానికి వీల్లేదని దేశ అత్యున్నత న్యాయం చెప్పే పరిస్థితిని వారు తెచ్చుకున్నారన్నారు. పేదవాడికి సెంటు స్థలం ఇవ్వడాన్ని భూస్వాములు, పెద్దమనుషులు వ్యతిరేకిస్తున్నారని, హైకోర్టులో, సుప్రీం కోర్టులో, టీవీలు, పత్రికల్లో నానా యాగీ చేశారని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లాంటి స్ట్రాంగ్‌ లీడర్‌ పేదల పక్షాన నిలబడ్డారు కాబట్టి సరిపోయింది కానీ, వేరే నాయకుడై ఉంటే పెత్తందార్లు పెట్టే మానసిక యుద్ధానికి భయపడేవారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు పేదల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి వారు చేస్తున్న మానసిక యుద్ధాన్ని తట్టుకొని నిలబడి సాధించారన్నారు. పేదల పక్షాన ఇంత బలంగా నిలబడిన ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదన్నారు. పేదలకు ఇంగ్లిష్‌ మీడియం పెడతామంటే వద్దని కోర్టులకు వెళ్లారని గుర్తుచేశారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదల పక్షాన నిలబడి పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ చెప్పారు.  సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసేవరకు పెత్తందార్లు ప్రయత్నం చేశారంటే.. వారిలో  ఎంత ఫ్యూడల్‌ భావజాలం దాగి ఉందో, పేదల వ్యతిరేక భావజాలం ఎంతుందో అర్థం అవుతుందన్నారు. రాజధానిలో పేదలు ఉండకూడదని ఎవరైనా వాదిస్తారా..? 50 వేల ఎకరాల్లో కేవలం 900 ఎకరాలు పేదల ఇళ్ల స్థలాలకు ఇస్తే ఇంత యాగీ చేస్తారా..? దయచేసి సభ్యసమాజానికి, పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. పేదల పక్షాన ఉంటారా..? పెత్తందార్ల పక్షాన ఉంటారా..? అని నిలదీశారు. సీఎం వైయస్‌ జగన్‌ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని స్వాగతించలేరా..? ఇకనైనా బుద్ధి మార్చుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సూచించారు. 
 

Back to Top