చంద్రబాబూ... బోషడీకే అంటే అర్థం తెలుసా?

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సూటి ప్ర‌శ్న‌

తాడేప‌ల్లి:  చంద్రబాబుగారూ... బోషడీకే అంటే అర్థం తెలుసా? మీరు మాట్లాడించారు. మీ అధికార ప్రతినిధి మాట్లాడాడు. కాబట్టే దీనికి మీరు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. మిమ్మల్ని బోషడీకే అంటే మీరు ఊరుకుంటారా? అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, మేరుగ నాగార్జున, రాజన్న దొర, హఫీజ్‌ ఖాన్‌,  వసంత కృష్ణప్రసాద్ ప్ర‌శ్నించారు. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అని అడుగుతున్న చంద్రబాబుగారు, బూతులు మాట్లాడే స్వేచ్ఛను కూడా తెలుగుదేశం పార్టీ వాక్‌స్వాతంత్య్రంగా గుర్తిస్తోందా అన్నది సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రిని అసభ్య భావజాలంతో తిట్టించటం మీ కల్చర్‌లో భాగమా అన్నది చెప్పాలన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. 

తెలుగుదేశం పార్టీ కార్యాలయం మేం దాడి చేయలేదు. మీరు రెచ్చగొట్టి, మీరు బూతులు తిట్టి, మీరు ఎక్కడికక్కడ ప్రజల్ని కులాలవారీగా, మతాలవారీగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి... చివరికి మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని తెగ ఊగిపోతున్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడినా, ప్రతి ఎన్నికల్లో ఓడుతున్నా, మీదైన ట్రేడ్‌మార్క్‌ అహంకార భావజాలంతో  ప్రజలకు సిగ్గు లేదని మీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరే అనరాని మాటలన్నారు. సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్‌ ట్యాగ్‌ లైన్‌ను కూడా హత్య చేసి, ప్రజల్ని కూడా తిట్టటం మీ రాజకీయంలో భాగంగా మారింది. మరి ప్రజలకు కడుపు మండదా చంద్రబాబుగారూ?  ప్రజల్ని తిట్టినప్పుడు, వారు వారిదైన రీతిలో వారికి అవకాశం వచ్చినప్పుడు సమాధానం ఇస్తారు. అంతేకాక, మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థనూ తిట్టారు. పోలీసుల్ని, అధికారుల్ని, నాయకుల్ని తిట్టారు. చివరికి ఈ రాష్ట్రం మీదే కసి, ద్వేషం పెంచుకుని, మీకు అధికారం దక్కలేదని ప్రతి రోజూ పేదల ప్రభుత్వం మీద దాడి చేశారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని రకరకాల కేసుల ద్వారా అడ్డుకునేందుకు మీరు చేయని ప్రయత్నం లేదు. మీ 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో కనిపించేవన్నీ కుట్రలు, కుతంత్రాలే తప్ప ప్రజా తంత్రం మీద మీకు నమ్మకం ఎక్కడిది? 

మీరు ఏకంగా రాష్ట్ర పరువు ప్రతిష్ఠలమీద దాడి చేశారు. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు. డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటారా? తాడేపల్లిని తాలిబాన్లతో పోలుస్తారా? ఏపీలో హెరాయిన్‌ వాడుతున్నారా? ఎవరు వాడుతున్నారు? ఎవరు అమ్ముతున్నారు? ఎవరు కొంటున్నారు? మీ కొడుకు వాడుతున్నాడా? మీ కుటుంబాలు, మీ బంధుమిత్రులు డ్రగ్‌ ఎడిక్ట్స్‌గా మారారా?  మీ కొడుకును డ్రగ్‌ ఎడిక్ట్‌ అంటే మీకు కోపం రాదా? మరి ఈ రాష్ట్రంలో ఉన్న కోట్ల కుటుంబాలను టార్గెట్‌గా చేసి, వారి పిల్లలు డ్రగ్స్‌ వాడుతున్నారన్నట్టు మీరు మాట్లాడుతుంటే, మాట్లాడిస్తుంటే... రాష్ట్రంలో ఎక్కడా లేని హెరాయిన్‌ సంస్కృతిని  మీకు అధికారం పోయిందన్న కడుపు మంటతో కల్పించి బురద పూస్తుంటే... ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రికీ ఇదేం రాజకీయం అనిపించదా? ఇలా మాట్లాడుతున్నందుకు, మాట్లాడిస్తున్నందుకు మీకు సిగ్గు అనిపించలేదా? అంతర్జాతీయ క్రిమినల్స్‌ కంటే ఘోరమైన ఆలోచనలతో మీరు, మీ ఎల్లో మీడియా, మీ వర్గం నడుపుతున్నది పొలిటికల్‌ పార్టీనా... లేక క్రిమినల్‌ మాఫియానా? 

చంద్రబాబుగారూ... ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉండే మీరు, ఇంతకీ ఈ రోజు విజయవాడలో  చెప్పా పెట్టకుండా ఎందుకు దిగారు? కరకట్ట పక్కన ఎందుకు నక్కి ఉన్నారు? మీ పార్టీ ఆఫీసుకు రాకుండా ఎందుకు దాక్కున్నారు? ఏ మంటలు పెట్టటానికి ఏపీలో అడుగుపెట్టారు? రెండున్నరేళ్ళుగా, అందులో ఏడాదిన్నర కోవిడ్‌ కాలంలో కూడా చెక్కు చెదరని నిశ్చయంతో పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడలేక ఇంతకు దిగజారతారా? ఆర్టికల్‌ 356 ప్రయోగించాలా? మీ వంటి వ్యవస్థల్ని మేనేజ్‌ చేసే మాఫియాల వల్ల ఈ రాష్ట్రంలో పేదలకు జరిగిన మంచి ఏమిటి? పేదలకు, దిగువ మధ్యతరగతికి అనేక మేళ్ళు చేసే జగన్‌గారి ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన కష్టం, నష్టం ఏమిటి? 

ఈ రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా ఫెయిల్‌ అయిందంటున్నారు. ఫెయిల్‌ అయింది ప్రతిపక్ష నాయకుడిగా మీరు. ఫెయిల్‌ అయింది మీ కొడుకు. ఫెయిల్‌ అయింది మొత్తంగా మీ ఎల్లో మీడియా. లా అండ్‌ ఆర్డర్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. మీ వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలుగా చూపించకండి. మీకు జగన్‌గారిని జనంలో ఎదుర్కొనే శక్తి లేక 2009 మొదలు ఈ రోజు వరకు ఎన్ని దొంగ దెబ్బలు కొట్టేందుకు  ప్రయత్నించారో అందరికీ తెలుసు. మీ కొడుకు శక్తి మీద మీకు నమ్మకం లేదు. మీ పార్టీ గెలవదని మీకు తెలుసు. పంచాయతీ ఎన్నికల నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలవలేని పరిస్థితి మీది. సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేని పరిస్థితికి వచ్చారు. ఎటు చూసినా మీకు భవిష్యత్తు లేదు... కాబట్టే మీరు, మీ దత్తపుత్రుడు కలిసి రెచ్చగొట్టే భాషను వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు, మాట్లాడిస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా పచ్చిబూతుల్ని ప్రెస్‌మీట్లుగా మలచారు. 

చివరికి మీరు, మీ దత్తపుత్రుడితో కూడా మీకు కావాల్సిన స్టేట్‌మెంట్‌ ఇప్పించుకున్నారు. కూడబలుక్కుని ఎవరు ఏం చేయాలో బాగా డ్రామా ఆడించారు. అమిత్‌షా గారికి ఫోన్‌ చేశానని... కేంద్ర అధికారులతో మాట్లాడానని... గవర్నరుగారితో కూడా మాట్లాడానని టీవీల్లో బ్రేకింగ్స్‌ వేయించుకున్నారు. మంచిది. వారందరికీ ఏం చెప్పారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బోషడీకే అని తిట్టించా అని ఒక్క నిజాన్ని వారిలో ఎవరికైనా చెప్పారా? తిరుపతిలో ఇదే అమిత్‌షాగారిమీద అలిపిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దాడి చేయించిన మీరు ఏ మొహం పెట్టుకుని ఆయనకు ఫోన్‌ చేశారు? ఎన్టీఆర్‌మీద మీరు విసిరించిన చెప్పులు, రాళ్ళు గురించి చెప్పారా? ప్రజల సంక్షేమం గురించి ఏ ఆలోచనా చేయలేని మీరు... 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పేరు చెపితే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకు రాని నాయకత్వానికి మారుపేరైన మీరు... సంక్షేమం ద్వారా కాకుండా సంఘర్షణ ద్వారా మాత్రమే మీడియా స్పేస్‌ కోసం ప్రయత్నించే స్థాయికి దిగజారారు.

 సిగ్గు పడండి చంద్రబాబుగారూ!

Back to Top