తిరుపతి సభ చంద్రబాబు భజన కోసమే

ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, చెట్టి ఫాల్గుణ

రియల్‌ ఎస్టేట్‌ కోసమే ఆ సభ నిర్వహణ

వారికి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు

కేవలం వారి భూముల ధరలు పెరగాలి

అందుకే చంద్రబాబు ఈ డ్రామా వ్యవహారం

మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉంది

అప్పుడే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి

ప్రెస్‌మీట్‌లో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు

విశాఖపట్నం:  తిరుపతి బహిరంగ సభ టీడీపీ, చంద్రబాబునాయుడుకు భజన కార్యక్రమంగా కొనసాగింద‌ని ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, చెట్టి ఫాల్గుణ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడుగారు కేవలం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల గురించి మాట్లాడారా లేక ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన తన అనుయాయుల గురించి మాట్లాడారా లేక రాష్ట్రంలోని 5 కోట్ల మంది గురించి మాట్లాడారా. ఎందుకంటే రాజధాని అంశం కేవలం అక్కడి ప్రజలకు సంబంధించింది మాత్రమే కాదు. అది  మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. కానీ ఇవాళ తిరుపతి సభ మొత్తం అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ గురించే జరిగినట్లు ఉంది. చంద్రబాబు మొత్తం దాని గురించే మాట్లాడారు.విశాఖపట్నంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.

అదే ప్రభుత్వ లక్ష్యం:
    మేం మొదటి నుంచి చెబుతున్నాం. అమరావతి కూడా రాజధాని. అక్కణ్నుంచి రాజధాని ఎక్కడికీ తరలి పోవడం లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడం కోసమే సీఎంగారు ఒక ఆలోచన చేశారు.
కానీ మీరు అక్కడ రియల్‌ ఎస్టేట్‌ కోసం భూములు కొన్నారు. అక్కడ ధరలు తగ్గుతాయని ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం.
    అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎంగారు మూడు రాజధానుల గురించి మాట్లాడితే, మీరు కేవలం అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ కోసమే మాట్లాడుతున్నారు. ఎంతసేపూ ఆ 33 వేల ఎకరాలు, 29 గ్రామాల గురించే మాట్లాడతారు. అంతే తప్ప, మిగిలిన ప్రాంతాలపై మీకసలు పట్టింపు లేదు.

త్యాగం అంటే అదీ:
    నిజానికి అమరావతిలో భూములు ఇవ్వడం త్యాగం కాదు. నాడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం వేల ఎకరాల భూములు ఇచ్చారు. అదీ త్యాగం అంటే. కానీ ఇవాళ అమరావతిలో ఉద్యమం చేస్తున్న వారు, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న వాళ్లు అందరూ రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ కోసమే తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు, ఇక్కడి రైతులకు నాడు చంద్రబాబు ఇస్తానన్న దాని కంటే ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. 

అది సరికాదు:
    కానీ అవేవీ పట్టించుకోకుండా, ఇవాళ అమరావతి రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ర్యాలీ చేస్తున్నారని అసత్యాలు చెబుతున్నారు. కానీ మేము ఆ పని ఎందుకు చేస్తాం? మీ ఆలోచననే ప్రజలది అని చెప్పడం సరికాదు. మీరు, మీ అనుయాయులు, అనుచరులు.. మొత్తం మీరే బాగుండాలా. వేరే ప్రాంతాల వారు బాగుండొద్దా?.

బాబు బాటలో వారు..:
    ఇక మీ దత్తపుత్రుడు. ఎక్కడికి వెళితే అక్కడ రాజధాని ఉండాలంటాడు. చంద్రబాబు ఏం చెబితే అదే మాట్లాడతాడు. ఇక బిజేపీ నేతలు కూడా ఇవాళ సభలో పాల్గొని చంద్రబాబునాయుడుగారికి వత్తాసు పలుకుతున్నారు. నిజానికి అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేసి అవినీతి వ్యవహారాలు చేశారని ఆ పార్టీ నేతలు చెబుతుంటే, ఇక్కడి వారు మాత్రం చంద్రబాబును సమర్థిస్తున్నారు. ఇక వామపక్షాలు ఏనాడో ఉనికి లేకుండా పోయి, చంద్రబాబు తోకపార్టీలుగా మారాయి.

మీకేమిటి సమస్య?:
    అసలు మూడు రాజధానులు ఉంటే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి? విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జుడీషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?.
    సీఎంగారు మూడు రాజ«ధానులపై తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు సమర్థిస్తుంటే, కేవలం చంద్రబాబుగారు మాత్రమే తప్పు పడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో ఎవరు పాల్గొన్నారో చూశాం. భూములకు ధరలు రావడం కోసం చంద్రబాబు నడిపిన యాత్ర అది.    
    సీఎంగారు మొన్న అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నారు. ఇవాళ తిరుపతిలో జరిగిన సభ ఒక పనికిమాలిన సభ. రియల్‌ ఎస్టేట్‌ కోసమే ఆ సభ అని స్పష్టం చేస్తున్నాం.
మూడు రాజధానులను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు.. అని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

Back to Top