అందుకే చంద్రబాబు పారిపోయారు

బెస్ట్‌ సీఎంగా వైయస్‌ జగన్‌ను ప్రజలు ప్రశంసిస్తున్నారు

చిత్తశుద్ధితో సీఎం వైయస్‌ జగన్‌ హామీలు నెరవేర్చుతున్నారు

శాసన మండలి రద్దు తీర్మానానికి మద్దతు పలికిన నగరి ఎమ్మెల్యే రోజా

అసెంబ్లీ: చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తారనే శాసనసభకు రాకుండా పారిపోయారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.  పెద్దల సభ సలహాలు ఇచ్చే వేదికలా ఉండాలని పేర్కొన్నారు. శాసన మండలి రద్దు తీర్మానంపై రోజా మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..సీఎం జగన్ ప్రవేశపెట్టిన శాసన మండలి రద్దు తీర్మానాన్ని మనఃస్ఫూర్తిగా ఆమోదిస్తూ, అన్ని ప్రాంతాల తరఫునా సీఎం గారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మోల్యే రోజ. శాసనసభలో మండలి రద్దు తీర్మానంపై రోజా ప్రసంగం యధాతథంగా -
 రాజ్యాంగం అన్ని ప్రాంతాలనీ సమానంగా చూడాలి, అభివృద్ధి సమానంగా ఉండాలని సూచిస్తుంది. అందుకే రాష్ట్రంలో గతంలో ఎవరూ చేయని ప్రయత్నం జగన్ గారు రాబోయేతరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసమే వికేంద్రీకరణ బిల్లు తెచ్చారు. తరతరాలుగా వివక్షకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తీర్చేందుకు ఇన్నాళ్లకు వచ్చాడని అందరూ సంతోషిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన ఈ 6నెలల కాలంలో 30 బిల్లులు తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకోసం చేసిన ఆ బిల్లులు చూసి తమ ఆశలు, ఆకాంక్షలు ఎవరు తీరుస్తారా అని ఆశగా ఎదురు చూసిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రజల చిరకాల కలలను సాకారం చేసారు వైయస్ జగన్. గాయం తెలిసిన వాడే సాయం చేయగలడని ప్రజలనుకుంటున్నారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో జగన్ గారు, తన పాదాలకు అయిన గాయాలను, తన శరీరానికి అయిన గాయాలను అన్నిటినీ మర్చిపోయి, ప్రజల గాయాలు తెలుసుకుని, వారు కోరుకున్నదానికి అనుగుణంగా చేయాలని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రవేశ పెడుతున్న చట్టాలు చూసి ప్రజలు ఆనందిస్తున్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, 5 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం, 13 జిల్లాల అభివృద్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి గారు తెచ్చిన వికేంద్రీకరణ బిల్లును ప్రజా తీర్పుతో గెలిచిన 151 మంది శాసన సభ్యులు ఆమోదించి శాసన మండలికి పంపిస్తే, అక్కడ దాన్ని అవమానించడం దురదృష్టకరం. ఈ విధంగా శాసన మండలివారు అవమానిస్తూ పోతుంటే, శాసన సభ్యులు చూస్తూ ఊరుకుంటే చంద్రబాబు లాంటి పొలిటికల్ క్రిమినల్స్ ఎంతకైనా దిగజారతారనే విషయాన్ని మనం గమనించాలి. శాసన మండలిలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. చంద్రబాబును ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ప్రజలు మొన్న ఎన్నికల్లో గొప్ప తీర్పు ఇచ్చారు. ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ సాధించనంత ఘన విజయాన్ని మా ముఖ్యమంత్రికి ఇచ్చారు. 50% ఓట్లు, 86% సీట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలను ఇచ్చారు. ఇది మామూలు విజయం కాదు. తెలుగు గడ్డమీద పుట్టిన ఎవ్వరికీ సాధ్యం కాని ఈ విజయాన్ని సాధించిన ఏకైక మొనగాడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజలకిచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తూ ఆరునెలల్లోనే దేశం గర్వించే ముఖ్యమంత్రిగా ఆయన పాలిస్తున్నారు. ఇటీవలే వచ్చిన ఇండియాటుడే సర్వేలో ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో నాల్గొవ బెస్టు ముఖ్యమంత్రిగా జగన్ గారిని ప్రజలు ప్రశంస్తున్నారు. అలాంటి సీఎం నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అలాంటి ప్రజానేత సభానాయకుడిగా ఉన్న ఈ శాసన సభని అవమానిస్తున్నారు.
మొన్న శాసన మండలిలో జరిగిన అంశాలు ఒకసారి చూస్తే నిబంధనల ప్రకారం ముందుగా వారు సెలక్ట్ కమిటీకి నోటీసులిచ్చి, సవరణలిచ్చి, దానిపై ఓటింగ్ పెట్టి, సెలెక్ట్ కమిటీకి పంపుతున్నామని చెబితే మాకు అభ్యంతరం ఉండేది కాదు. శాసన మండలికి కూడా కొన్ని అవకాశాలుంటాయి కాబట్టి, చట్ట ప్రకారం వారు వ్యవహరించి ఉంటే మేము గౌరవించేవాళ్లం. ప్రజలు ఛీకొట్టిన నాయకుడు గ్యాలరీలో కూర్చుని ఆదేశిస్తే, ప్రజలు ఎన్నుకున్న శాసన సభ పంపిన బిల్లును అక్కడ అవమానించారు. మండలి ఛైర్మన్ ను ఎవరూ ఏమీ అనడం లేదు కానీ చంద్రబాబు చేసిన కుట్ర దారుణమైనదని చెబుతున్నాం. ఇవాళ చంద్రబాబు అధికారం కోల్పోయిన అహంకారంతో ఎలా వ్యవహరిస్తున్నాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గుర్తించాలి. చంద్రబాబు చేస్తున్న దగుల్బాజీ రాజకీయాన్ని నిండు సభలో ఎక్కడ నిలదీస్తారో అని సభకు కూడా రాకుండా పారిపోయాడు. ఆయన తన పార్టీ ఆఫీసులో కూర్చుని శాసన మండలిని రద్దు చేయడం కుదరదు, రెండేళ్లు పడుతుంది, మళ్లీ నేను తీసుకొస్తాను అంటూ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు చేస్తున్నాడు. చంద్రబాబుగారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా - శాసన మండలి రద్దు కాదని మీరు భావించినప్పుడు శాసన సభకు రాకుండా ఎందుకు పారిపోయారు. అక్కడెక్కడో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే మాటలను మీరు, దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడకొచ్చి కూర్చుని మాట్లాడి ఉండొచ్చు కదా. శాసన మండలి అంటే పెద్దల సభ. పెద్దల సభకు ఎలాంటి వాళ్లను పంపాలి? మా నాయకుడు జగన్ గారు పెద్దల సభకు పంపిన వాళ్లంతా రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నావాళ్లు. మరి చంద్రబాబు ఏం చేసాడు? పెద్దల సభకు తనింట్లో ఉన్న దద్దమ్మని, దద్ధోజనాన్నీ పంపించాడు.
ఇప్పుడా దద్ధోజనం ఏమంటుందంటే దమ్ముంటే శాసన మండలిని రద్దు చేయండి చూద్దాం అంటోంది. ఈరోజు లోకేష్ కి ఈ శాసన సభ ద్వారా తెలియజేస్తున్నాను..బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్లి తొడ కొడితే, కోసి ఉప్పూకారం పెట్టి కూరైపోతుంది. ఇక మరొకళ్లు అఖిల భారత మేధావుల సంఘానికి అధ్యక్షుడు తానని తనకు తానే ప్రకటించుకున్న యనమల గారు. ఎన్టీఆర్ హయాంలో ఆయన వెన్నుపోటు, చంద్రబాబు హయాంలో పన్నుపోటు అందరికీ తెలిసిందే. ప్రభుత్వ సొమ్ముతో సింగపూరు వెళ్లి ఉన్నదంతాలు ఊడపీకి, జ్ఞానదంతాలు పెట్టించుకుని వచ్చినట్టున్నాడు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే, యనమల స్టీరింగులాంటివాడు. మేధావినని చెప్పుకునే యనమలకు సెలక్ట్ కమిటీకి బిల్లు పంపాలంటే ముందు నోటీస్ ఇవ్వాలన విషయం తెలియదా? వాళ్లు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఛైర్మన్ ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ల తోక ఝాడింపులకు, తాటాకుల చప్పుళ్లకు భయపడేవాళ్లెవరూ లేరు. శాసన మండలిలో, శాసన సభలో కానీ స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారో ఎన్నో నిదర్శనాలున్నాయి.
రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్ కు మైకు కూడా ఇవ్వకుండా, ఆయన అధికారాన్ని లాగేసి ఆయనను క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమయ్యారు. మహిళా డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మగారిని దారుణంగా విమర్శించి, ఆమె కన్నీళ్లుపెట్టుకునే పరిస్థితిని తెచ్చారు. మొన్నటి వరకూ స్పీకర్ స్థానంలో కూర్చొన్న వ్యక్తి రాజ్యాంగాన్ని, అసెంబ్లీని దిగజార్చేలా పూనుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని, వారిలో 4ని మంత్రులను చేసాడు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏగడ్డైనా కరవడానికి వెనుకాడడని స్పష్టంగా తెలుస్తోంది. పొలిటికల్ క్రిమినల్ ఎవరంటే ఎవ్వరైనా సరే చంద్రబాబు పేరు చెబుతారు. శాసన మండలి రద్దుపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ గారిని అన్ని ప్రాంతాల ప్రజలు ఆశీర్వదిస్తున్నారు.
పెద్దల సభ సలహాలిచ్చే వేదిక కావాలే తప్ప సంఘర్షణల వేదికగా మారకూడదు. పెద్దల సభ అంటే ప్రజాతీర్పును గౌరవించాలే కానీ దాన్ని అపహాస్యం చేసేలా ఉండకూడదు.
గతంలొ ఎన్టీఆర్ 1985లో శాసన మండలిని రద్దు చేసారు. తనను అవమానించారనే కారణంతోనే ఆ పని చేసారు. కానీ మా ముఖ్యమంత్రి 7 నెలల్లో ఎప్పుడూ ఆ ఆలోచన చేయలేదు. ఆయన ఆలోచనంతా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపించాలి, ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలి అని మాత్రమే. ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా, సీఎం గారు తానిచ్చిన వాగ్దానాలను చిత్త శుద్ధితో ముందుకు వెళ్లారు. ప్రజాతీర్పును అవమానిస్తే, శాసన సభను అవమానిస్తే, ప్రజా ప్రతినిధుల అభిప్రాయానికి విలువ లేదంటే ఒక్క క్షణం కూడా ఆ మండలికి ఉండే అర్హత లేదు. 22 ఏళ్ల ముందు రద్దైన మండలిని వైయస్సార్ గారు పునరుద్దరించారు. ప్రభుత్వానికి పెద్దలు సలహాలిస్తే బావుంటుంది, బిల్లుల్లో మంచి బెటర్మెంట్ సూచించేవాళ్లు ఉంటే బావుంటుందని మండలిని తెచ్చారు. నేడు ఆ వైయస్సార్ ఆశయాన్ని తూట్లు పొడిచే విధంగా టీడీపీ గద్దలు ఏ విధంగా ప్రవర్తించాయో చూసాం కాబట్టి, వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కనుకే ఆ శాసన మండలిని రద్దు చేయమని మేమంతా జగన్ మోహన రెడ్డిగారిని కోరడమైంది. మండలిని నేను మళ్లీ పునరుద్ధరిస్తానంటాడు చంద్రబాబు. 2004లో చంద్రబాబు శాసన మండలి గురించి శాసనసభలో మాట్లాడిన మాటలు వీడియోగా చూసాం. శాసన మండలివల్ల ఖర్చు తప్ప ఉపయగమే లేదు అని చెప్పాడు. అలాగే రాజ్యసభలో కూడా తన ఎంపలతో మండలికి వ్యతిరేకంగా మాట్లాడించాడు. నాడు అలా మాట్లాడిన పెద్ద మనిషి తన కొడుకు పదవి పోతుందనే సరికి యూటర్న్ తీసుకుని శాసన మండలి ఉండాలి, నేను శాసన మండలిని పునరుద్ధరిస్తా అంటున్నాడు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి ప్రజలకు మరోసారి క్లియర్ గా అర్థం అయ్యింది. రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకు శుభం కార్డు వేయాలని, ఇందుకోసం జగన్ మోహన్ రెడ్డిగారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మేము పూర్తిగా ఆమోదిస్తున్నాం. ఈ  దేశంలో 22 రాష్ట్రాల్లో శాసన మండలి లేకుండా ప్రజా ప్రతినిధులు శాసన సభలోనే చట్టాలు ఎలా చేస్తున్నారో మనమూ అలాగే శాసన సభద్వారానే చట్టాలు చేద్దాము. అదే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందిని మేమంతా భావిస్తున్నాం. కనుక జగన్ గారు ప్రవేశపెట్టిన మండలి రద్దు తీర్మానానికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. 

Back to Top