నెల్లూరు: ఆదర్శమైన పాలన అందిస్తూ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి ఆనాడు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పది అడుగులు ముందుకేస్తే.. ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ వంద అడుగులు ముందుకేశారన్నారు. నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అమ్మఒడి రెండో విడత ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ సీఎంలా ఉండాలని దేశమంతా చూసేలా వైయస్ జగన్ పాలన అందిస్తున్నారన్నారు. జగనన్నకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.
‘నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత రాజకీయాల్లో లేడు.. వందల కోట్ల ఆస్తులున్న కుటుంబం కాదు’. కష్టాలు, కన్నీళ్లు ఉండే సామాన్య మధ్య తరగతి కుటుంబీకుడినైన తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వైయస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, చివరి శ్వాస వరకు జగనన్న వెంటే నడుస్తానని, తాను తుదిశ్వాస విడిచిన రోజు ముఖ్యమంత్రిగానే తన అంత్యక్రియలకు సీఎం వైయస్ జగన్ హాజరు కావాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెప్పారు.