తాడేపల్లి: ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ బతుకంతా కుట్రలేనని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతిలో ఐఏఎస్‌లపై వచ్చిన ‘హనీ ట్రాప్–ఇద్దరు కలెక్టర్ల కహానీ’ తప్పుడు కథనాలపై ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమ్మ పాలు తాగుతూ బతికావా? నాగు పాము విషం తాగి బతికావా? రాధాకృష్ణా..? అని ప్రశ్నించారు. విషసర్పంలా వెంటాడుతున్న ఆయన ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్థిరపర్చలేరని స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్‌కు ప్రజా మద్దతు ఉందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్రోకర్ వ్యవస్థకు ఆద్యుడు ఎవరు? అంటే.. నారా చంద్రబాబు అని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఒకప్పుడు సైకిల్‌పై తిరిగే రాధాకృష్ణ ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడని ప్రశ్నించారు. వ్యవస్థపై, బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వారిపై విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు. ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వైశ్రాయ్ హోటల్ హానీ ట్రాప్ చేయలేదా? అని నిలదీశారు. రాధాకృష్ణ ఒక బ్రోకర్ అని, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలోనూ జిల్లా కలెక్టర్లు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి 24 గంటలు కష్టపడుతున్నారన్నారు. అలాంటి వారిపై రాధాకృష్ణ విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు. వ్యవస్థల్ని భ్రష్టుపట్టిస్తూ.. శిఖండిల్లా అడ్డుపడుతున్నాడని ధ్వజమెత్తారు. ఇంకో 25 ఏళ్ల పాటు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే.. ‘రాధాకృష్ణ నీ కోరలు పీకుతాం’ అన్నారు. ఈరోజు ఐఏఎస్ అధికారులు, సివిల్ సర్వెంట్స్‌పై వెనకుండి విషపు రాతలు రాయిస్తున్న రాధాకృష్ణ, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సివిల్ సర్వెంట్లకు అండగా ఉంటామన్నారు.