2021 సంక్షేమ, అభివృద్ధి నామ సంవత్సరం

చంద్ర‌బాబుకు కడుపుమంట, ఏడుపు నామ సంవత్సరం

బీజేపీకి చీప్‌ లిక్కర్, పవన్‌కు పాట్నర్, ప్యాకేజీ వెతుక్కున్న సంవత్సరం

ఆర్థిక రధచక్రం ఆగినా.. ఆంధ్రరాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదు

30 మాసాల్లో డీబీటీ ద్వారా రూ.1.16 లక్షల కోట్ల సాయమందించాం

రెండున్నరేళ్లలో 95 శాతం వాగ్దానాలను నెరవేర్చి వైయస్‌ఆర్‌ సీపీ చరిత్ర సృష్టించింది

చిత్తశుద్ధితో వైయస్‌ఆర్‌ సీపీ అనేక విజయాలను సాధించిన సంవత్సరం 

అమరావతి రియల్‌ ఎస్టేట్‌ బినామీ భూస్వాములకు ఏడుపు నామ సంవత్సరం 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: 2021 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి అద్భుతమైన సంవత్సరం అని, సంక్షేమ, అభివృద్ధి నామ సంవత్సరమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు డ్రామ ఏడుపునామ సంవత్సరం అని, బీజేపీకి చీప్‌ లిక్కర్‌ నామ సంవత్సరం, పవన్‌ కల్యాణ్‌కు ఎప్పటి లాగానే కొత్త పాట్నర్, కొత్త ప్యాకేజీ కోసం వెత్తుకున్న సంవత్సరం, కమ్యూనిస్టు పార్టీలకు భూస్వామ్య అనుకూల పోరాటాలు చేసి భ్రష్టుపట్టిన సంవత్సరం అని అన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 సంవత్సరంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అన్నీ విజయాలే వరించాయని, పార్టీకి, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు.. ఇలా ఎక్కడ ఎన్నికలు పెట్టిన అద్భుతమైన విజయాలు సాధించిన మహత్తరమైన సంవత్సరం 2021 అని ఎమ్మెల్యే అంబటి గుర్తుచేశారు.

ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. 

‘ఆర్థిక రధచక్రం కదల్లేకున్నా.. ఆంధ్రరాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదు. కోవిడ్‌ వల్ల ఆర్థిక స్థితిగతులు మారాయి. ఆదాయాలు తగ్గాయి, ప్రపంచ ఆదాయాలు తగ్గాయి, ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలు కుంటుపడ్డాయి. అయినా ధైర్యంగా 30 మాసాల్లో రూ.1.16 లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాల ద్వారా, నవరత్నాల ద్వారా ప్రజలకు చేరవేసిన సంవత్సరమిది. డీబీటీ ద్వారా ప్రజలకు సాయమందించిన మంచి సంవత్సరం. 

వాగ్దానాల విషయానికొస్తే.. చరిత్రలో ఏ రాజకీయ పక్షం కూడా మేనిఫెస్టోను ప్రకటించి.. ఆ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అన్ని వాగ్దానాలను అమలు చేయాలని చిత్తశుద్ధితో ప్రయాణం చేస్తున్న రాజకీయ పార్టీ మాది. రెండున్నర సంవత్సరాల్లో 95 శాతం వాగ్దానాలను నెరవేర్చి చరిత్ర సృష్టించిన ఏకైక రాజకీయ పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ. 

ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని చాలా మంది పోరాటాలు చేశారు. కానీ, ఏ పోరాటం, ఏ అర్జీ లేకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పేదవాడికి సొంతింటి పట్టా ఇవ్వాలని 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి.. ఇళ్లు నిర్మించాలని తలపెట్టిన గొప్ప సంవత్సరం ఇది. కమ్యూనిస్టులు చాలా సందర్భాల్లో పేదవాడికి ఇల్లు, దున్నడానికి భూమి అని పోరాటాలు చేశారు. త్రిపుర, కేరళలలో ఎక్కడా జరగని విధంగా అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చి.. పేదలకు ఇళ్లు కట్టిస్తున్న గొప్ప సంవత్సరం ఇది. 

రైతులను ఆదుకున్న సంవత్సరం. కోవిడ్‌–19 ప్రపంచాన్ని వణికించింది. విభజన తరువాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా.. అయినా ఎక్కడా బెదురులేకుండా సీఎం వైయస్‌ జగన్‌ పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి.. వైద్య రంగాన్ని, కార్యకర్తలను, వలంటీర్లను కదిలించి కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న సంవత్సరం ఇది అని సగర్వంగా చెబుతున్నాను. 

ఆస్తులు, బంగారం, పొలాలు పోతాయి.. కానీ, విద్య దోచుకోలేరు. చదువు ఉన్నవారు ఎక్కడైనా బతకగలడు. పేదవాడిగా పుట్టి.. ధనవంతుడిగా ఎదగాలంటే విద్య చాలా అవసరమని భావించి విద్యకు బలమైన పునాదులు వేసిన సంవత్సరం ఇది. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతున్నాయి. జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను చదివించాలని తల్లులకు డబ్బులు అందించిన సంవత్సరమిది. విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, అంతేకాకుండా ఇంటర్నేషన్‌ స్థాయిలో మన విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని, ఇంగ్లిష్‌ మీడియం ఉంటేనే తప్ప సాధ్యం కాదని భావించి.. ఆంగ్ల మాధ్యమాన్ని అతి సమర్థవంతంగా అమలు చేసిన సంవత్సరం ఇది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అనేక విజయాలను సాధించిన సంవత్సరం ఇది. 

ప్రతిపక్షాలు తెలుగుదేశం, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్‌ అన్నింటికీ కడుపుమంట నామసంవత్సరం. ఎందుకంటే.. ఇంతటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన చరిత్ర వారికి ఎక్కడా లేదు. టీడీపీకి లేదు, కాంగ్రెస్‌ ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదు. బీజేపీ అమలు చేసిన సందర్భాలు లేవు. కమ్యూనిస్టులు కూడా ఎప్పుడూ ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్ర వారికి లేదు. అందువల్ల వారికి కడుపుమంట. 

సిద్ధాంతాలు మర్చిపోయి.. ఓటమిపాలై అందరూ పెనవేసుకొని వైయస్‌ఆర్‌ సీపీపైకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అయినా.. ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రజలు వైయస్‌ఆర్‌ సీపీకి అండగా ఉన్నారు. 

అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది. నేను గుంటూరు వ్యక్తిని చెబుతున్నాను.. శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది. మిగతా ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేయాలనే  దృక్పథంతో సమగ్రమైన ప్రణాళికతో వెళ్తుంటే.. దాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు. వారికిది ఏడుపు నామ సంవత్సరం. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో లేని విధంగా రియలెస్టేట్‌ బినామీ భూస్వాముల పోరాటాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. భూస్వాములకు అనుకూలంగా ఉద్యమాలు చేసి భ్రష్టుపట్టిపోయిన చరిత్ర కమ్యూనిస్టులది. 

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేదలకు కల్పతరువుగా భావించేది. నామమాత్రపు రుసుము రూ.10 వేలు, 15 వేలు, 20 వేలతో ఇల్లును సొంతం చేసుకునే అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెడితే.. దానిపై బజారుకొచ్చి ఏడుస్తున్న సంవత్సరం ఇది. ఓటీఎస్‌ దిగ్విజయంగా అమలు జరుగుతుంది. 

పాడి రైతుకు అధికలాభం చేకూర్చాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే.. డెయిరీల పార్టీ టీడీపీ రోడ్డుకెక్కి గందరగోళం చేసి.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిని ఏర్పరుచుకున్న సంవత్సరం. 

గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వంపై నెపం మోపి చంద్రబాబు ఏడుస్తున్న సంవత్సరం ఇది. అప్పులు ఇవ్వడానికి వీల్లేదని, సంక్షేమ కార్యక్రమాలు జరగొద్దని తెలుగుదేశం పార్టీ, ఇతర పక్షాలు లిటికేషన్లు పెట్టి వెంటాడుతున్న సంవత్సరం ఇది’.
 

తాజా వీడియోలు

Back to Top