తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబుతో కలిసి ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, టీడీపీ ఆఫీస్‌లో క్రిస్మస్ వేడుకల పేరుతో సీఎం వైయస్ జగన్‌పై, ప్రభుత్వంపై చంద్రబాబు అడ్డగోలు విమర్శలు చేశాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 49 సంవత్సరాల వయస్సులో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చక్కటి పాలన అందిస్తున్న సీఎం వైయస్ జగన్‌ను చూసి ఓర్వలేకపోతున్న చంద్రబాబు.. తన కుమారుడు ప్రయోజకుడు కాలేకపోతున్నాడు.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోతున్నాడనే ఈర్ష్యతో ఇష్టమొచ్చినట్టుగా సీఎంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవ విద్యా సంస్థలు, సంస్థల మీద సీఎం కన్నుపడిందని, వాటిని దోచేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడని అబద్ధాలను చంద్రబాబు వండివారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సాయం అందిస్తున్న సీఎం పుట్టిన రోజును ప్రజలు ఘనంగా జరుపుకున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, విద్యార్థులకు, గ్రామానికి, రాష్ట్రానికి ఏదేదో చేశానని చెప్పుకునే ప్రయత్నం చేశాడని.. చంద్రబాబు చేసిందేమీ లేదని, చేసినట్టుగా కలలు కంటున్నాడని ఎమ్మెల్యే అంబటి అన్నారు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్ నిర్మించాలని చంద్రబాబు అనుకున్నాడట.. కానీ ఓఆర్‌ఆర్, పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్ నిర్మించింది దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఐటీని తెచ్చింది తానేనని చంద్రబాబు ఎప్పుడూ చెప్పుకుంటాడని, నిజానికి ఐటీవర్థిల్లింది వైయస్‌ఆర్ హయాంలోనే అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడం.. తరువాత తుంగలో తొక్కేయడం చంద్రబాబుకు అలవాటు అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. డ్వాక్రా సంఘాల రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తానని చేసి ఎన్నికల తరువాత తుంగలో తొక్కేశాడని మండిపడ్డారు. సీఎంను విమర్శించడం తప్ప.. చంద్రబాబుకు ఏమీ గుర్తుండదని ఎద్దేవా చేశారు. సీఎం వైయస్ జగన్ తాను ఇచ్చిన వాగ్దానాల్లో 95 శాతం నెరవేర్చారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని నెరవేర్చారు..? అని ప్రశ్నించారు. వాస్తవాలను మాట్లాడలేని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నాడని, తన పాలనలో పలానా మంచి పథకం అమలు చేశానని ధైర్యంగా చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.