కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓటు వేయాలి..?

ఈ రెండు పార్టీలకు ఉప ఎన్నికలో డిపాజిట్లు కూడా రావు

ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిదే విజయం

బద్వేలులో బీజేపీతో కలిసి తిరుగుతున్న జనసేన నాయకులు 

ఈ ద్వంద్వ వైఖరిపై పవన్‌ కల్యాణ్‌ తక్షణమే క్లారిటీ ఇవ్వాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: బద్వేలు ప్రజలంతా పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చక్కటి పరిపాలన అందిస్తున్నాడని దేశానికి, రాష్ట్రానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోరారు. ఏ ప్రలోభాలు లేకుండా ఓటర్లు బూత్‌ దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరుకుంటున్నామన్నారు. బద్వేలులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణాంతరం ఉప ఎన్నిక అనివార్యమైందని, పార్టీ అభ్యర్థిగా దివంగత వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్‌ సుధను వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారన్నారు. ఆ నిర్ణయానికి సానుకూలంగా తెలుగుదేశం, జనసేన పోటీకి నిరాకరణ తెలిపాయన్నారు. 

ఉప ఎన్నికలో వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్‌ సుధ విజయం సాధిస్తారనేది అందరికీ తెలిసిన సత్యమన్నారు. గెలిచే ఎన్నిక అయినా.. గత ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య 44 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారని, అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో ప్రచారానికి వచ్చామన్నారు. రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలతో రాష్ట్రంలోని పేద ప్రజానీకం చాలా ఆనందంగా ఉందన్నారు. సంక్షేమ పాలనను అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపర్చేందుకు బద్వేలు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆంధ్రరాష్ట్ర ప్రజల మనోభావాలకు అతీతంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ విభజిస్తే.. కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతూ బీజేపీ వ్యవహరించిందన్నారు. విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన బీజేపీ.. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రాష్ట్రాన్ని ప్రజలను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. వీరికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్‌లు రాకుండా వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించి దేశానికి, రాష్ట్రానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోరారు. 

తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ రాజకీయ సయోధ్య కుదుర్చుకొని ప్రయాణం చేస్తున్న రాజకీయ పక్షాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. బద్వేలులో జనసేన నాయకులు బీజేపీతో కలిసి తిరుగుతున్నారని, సంప్రదాయాన్ని పాటిస్తూ పోటీకి దూరంగా ఉన్నామని చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. ఏంటీ లాలూచీ కుస్తీ అని ప్రశ్నించారు. బయట ఒకటి చెప్పి.. బద్వేలులో మరొకటి చేస్తారా..? పవన్‌ కల్యాణ్‌ దీనికి తక్షణమే క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యే అంబటి డిమాండ్‌ చేశారు. నిజాయితీ పరుడని చెప్పుకునే పవన్‌ ఇలాంటి ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఏ రాజకీయ పార్టీ రంగు ఏమిటో బద్వేలు ఎన్నికల్లో బయటపడుతుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 
 

Back to Top