బాబుకు బుద్ధి చెప్పేందుకు రేపు ‘చలో ఆత్మకూరు’

బాధితులకు చంద్రబాబు సమాధానం చెప్పాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్‌

గుంటూరు: రాష్ట్రంలో గందరగోళ వాతావరణం సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడులో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని కుట్ర రాజకీయాలకు చంద్రబాబు తెరలేపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో ప్రశాంతమైన వాతావరణం ఉందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత పల్నాడులో మరింత ప్రశాంతత చేకూరింది. కక్షసాధింపులకు వైయస్‌ఆర్‌ సీపీ పోకూడదనే పాలసీ సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్నారన్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత దారుణాలు జరిగాయో రాష్ట్రమంతా తెలుసన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై దాడులు చేసి గాయపర్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయని గుర్తుచేశారు. యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్, అప్పుడు మంత్రిగా ఉన్న పుల్లారావు, వినుకొండలో ఆంజనేయులు లాంటి వాళ్లు ఎంత కక్షపూరిత వాతావరణం పల్నాడులో సృష్టించారన్నారు. 

పల్నాడు కక్షలు సృష్టించి ఒక ముఠా కట్టుకొని రాజకీయం చేయాలని చంద్రబాబు నీచంగా ప్రవర్తిస్తున్నాడని అంబటి ధ్వజమెత్తారు. దీన్ని ఎదుర్కోవడానికి సమావేశమయ్యామన్నారు. చంద్రబాబు చలో ఆత్మకూరు వెళ్తున్నారని, వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభ్యులం, ముఖ్యనాయకులతో చలో ఆత్మకూరు వెళ్లబోతున్నామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్తెనపల్లిలో కోడెల బాధితులను, మాచర్లలో టీడీపీ బాధితులు, గురజాలలో యరపతినేని బాధితులు, వినుకొండలో ఆంజనేయులు బాధితులు, చిలకలూరిపేటలో పుల్లారావు బాధితులతో కలిసి చలో ఆత్మకూరు వెళ్తున్నామన్నారు. 

బుడుగుల సుబ్బారావు అనే వ్యక్తి నుంచి కోడెల శివప్రసాద్‌ 18 ఎకరాలు ఆక్రమించుకున్నాడని, కోళ్ల ఫాం ఉంటే అది కూల్చి ఫాంలోని కోళ్లను తిన్నారని అంబటి చెప్పారు. రండి గ్రామానికి అంటే కోడెల శివప్రసాద్‌ సూచనల మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి ఊర్లో నుంచి వెళ్లగొట్టారని, తాను గెలిచిన తరువాత సుబ్బారావు మళ్లీ గ్రామంలోకి వచ్చారన్నారు. అదే విధంగా అచ్చయ్య అని ప్రగతి ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ యజమాని రూ. 20 లక్షలు కోడెల శివప్రసాద్‌కు ఇస్తే కేసు పెడితే ఇటీవల రూ. 10 లక్షలు తిరిగి ఇచ్చారన్నారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయన్నారు. బాధితులందరితో చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపట్టామని, వీరందరికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 

Back to Top