చంద్రబాబు ప్రచార యావకు 11 మంది అమాయకులు బలి

ఇరుకు సందుల్లో మీటింగ్‌లు పెట్టి అమాయకులను చంపేశారు

గుంటూరులో 30 వేల టోకెన్లు పంచి కేవలం 2 వేల మందికి సరుకులిచ్చారు

తన మీటింగ్‌ల వల్ల 11 మంది మృతిచెందినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు

నిరుపేద ప్రజల ప్రాణాలు తీసి.. శాంతిభద్రతలు అంటూ డ్రామాలు

ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకే జీవో నంబర్‌.1 తెచ్చారు

వైయస్‌ఆర్‌ సీపీ లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌రెడ్డి

తాడేపల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రచార యావకు 11 మంది అమాయకులు బలైపోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు బహిరంగ సభలకు విపరీతంగా జనం వస్తున్నారనే ప్రచారం కల్పించాలనే దుగ్దతో ప్లాన్డ్‌ ప్రచారం ఇరుకు సందుల్లో మీటింగ్‌లు పెట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో 30 వేల మందికి టోకెన్లు పంపిణీ చేసి.. కేవలం 2 వేల మందికి సరిపడా మాత్రమే సరుకులు, చీరలు తెచ్చారని, అవి కూడా ట్రాక్టర్ల నుంచి విసిరేయడం మూలంగా తొక్కిసలాట జరిగి ముగ్గురు నిరుపేద మహిళలు చనిపోయారన్నారు. చంద్రబాబు మీటింగ్‌ల వల్ల సంభవించే మరణాలను అరికట్టాలని, అమాయక ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకే ప్రభుత్వం జీవో నంబర్‌.1 తీసుకొచ్చిందని చెప్పారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కందుకూరులో సభకు అనుమతిచ్చిన ప్రాంతానికి 50 మీటర్ల ముందు చంద్రబాబు తన వాహనాన్ని నిలిపారని, ఆ ఇరుకు సందులో వేలమంది ప్రజలను తోసి.. ఆ రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు కట్టారన్నారు. ఉన్న ఆ కొద్దిపాటి స్థలంలోనే జనాన్ని నింపి.. బాబు బహిరంగ సభకు విపరీతంగా జనం వచ్చారని చూపించేందుకు, డ్రోన్‌ కెమెరాలతో వీడియోలు, ఫొటోలు తీసి ప్రచారం చేసుకోవాలని కుట్ర మూలంగానే తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారన్నారు. అంతమంది కళ్లముందే కనిపోయినా.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం ఎంత దౌర్భాగ్యమైన విషయమో ప్రజలంతా గమనించాలన్నారు. 

గుంటూరులో ఒక ఎన్‌ఆర్‌ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ చంద్రన్న కానుక పేరుతో నిత్యావసర సరుకులు ఇస్తామని దాదాపు 30 వేల టోకెన్లు పంపిణీ చేశాడని, ఆ సభకు అనుమతి తీసుకుంది కూడా తెలుగుదేశం పార్టీ నేతలేనని చెప్పారు. చీరలు, సరుకుల కోసం పేద ప్రజలు వస్తే వారిని నాలుగు గంటల పాటు వెయిట్‌ చేపించి.. చంద్రబాబు మాట్లాడిన తరువాత కేవలం 2 వేల మందికి చీరలు, సరుకులు తీసుకువచ్చి.. అందరికీ అందని పద్ధతుల్లో ట్రాక్టర్‌ నుంచి బిస్కెట్లలా జనానికి విసిరేయడంతో తొక్కిసలాట జరిగి మరో ముగ్గురు చనిపోయారన్నారు. ఆ దుర్ఘటనకు బాధ్యుడైన చంద్రబాబు కనీస మానవత్వం లేకుండా.. ఎన్‌ఆర్‌ఐ పేరు చెప్పి తప్పించుకున్నాడన్నారు.  

తన పబ్లిసిటీ పిచ్చి కోసం మనుషులు చనిపోయినా పర్వాలేదనే రీతిలో చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. అధికారం కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదనే మానవత్వం లేని చర్యల మూలంగానే ఇలాంటి దుర్ఘటనలు జరిగాయన్నారు. తప్పంతా తాను చేసి.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి.. ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేదు కాబట్టే మరణాలు సంభవించాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు అబద్ధపు ప్రచారాలు తారాస్థాయికి చేరాయని, కర్ణాటకలో ఒక స్వామీజీ  అంతిమయాత్ర వీడియోలు, ఫొటోలను చంద్రబాబు కుప్పం పర్యటనకు జత చేసుకొని విపరీతంగా జనం వచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నాడని గుర్తుచేశారు. 

అమాయక ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రభుత్వం జీవో నంబర్‌.1 తీసుకువచ్చిందని, దానిపై కూడా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మనోహర్‌రెడ్డి అన్నారు. ఆ జీవోలో కొత్త అంశాలు ఏమీ లేవని, ర్యాలీలపై నిషేధం విధించబడలేదన్నారు. 1860లోని పోలీస్‌ చట్టాన్ని ఉటంకిస్తూ దానిలోని కొన్ని సెక్షన్‌లను పొందుపరుస్తూ.. దాన్ని రెగ్యులేట్‌ చేస్తే కొన్ని గైడ్‌లైన్స్‌ మాత్రమే పెట్టడం జరిగిందని చెప్పారు. రోడ్లపైన, రోడ్ల మార్జిన్స్‌ పైన సభలు పెట్టడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, వాటిని నివారించేందుకు బహిరంగ సభలు జాతీయ, రాష్ట్ర రహదారులపై పెట్టకూడదని కొన్ని రెగ్యులేషన్స్‌ విధిస్తూ జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. పోలీసుల అనుమతి తీసుకొని ర్యాలీలు, మీటింగ్‌లు జరుపుకోవచ్చని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందన్నారు. 
 

Back to Top