వెంకటేశ్వరశర్మతో వైయ‌స్ఆర్‌సీపీకి ఏ సంబంధం లేదు 

తాడేపల్లి: న్యాయవాది కోటంరాజు వెంకటేశ్వరశర్మ మీద మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైతే, వెంటనే ఆయన్ను మా పార్టీకి చెందిన వాడిగా చెబుతూ.. ఎల్లో మీడియాలోనూ, వారి అనుకూల సోషల్‌ మీడియాలోనూ అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లాకు చెందిన లీగల్‌సెల్‌ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నిజానికి వెంకటేశ్వరశర్మకు వైయ‌స్ఆర్‌సీపీతో కానీ, పారీ లీగల్‌ సెల్‌తో కానీ, ఏనాడూ ఏ విధమైన సంబంధం లేదని, ఆయన తమ పార్టీలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరని వారు స్పష్టం చేశారు. టీడీపీకి చెందిన కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, వైయ‌స్ఆర్‌సీపీతో పాటు, జగన్‌ని నిందిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా లీగల్‌సెల్‌ కోఆర్డినేటర్‌ ఒ.గవాస్కర్, అదే విభాగం అధ్యక్షుడు సీహెచ్‌.సాయిరాం ఆక్షేపించారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే..:

ఎంత వరకు సబబు? ఆలోచించండి:
న్యాయవాది కోటంరాజు వెంకటేశ్వరశర్మకు సంబంధించి ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎప్పుడూ మా పార్టీలో కానీ, పార్టీ లీగల్‌ సెల్‌లో కానీ, క్రియాశీలకంగా లేరు. ఆయన మీద నమోదైన కేసు పూర్తిగా వ్యక్తిగతం. కానీ టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, వీడియోలు రిలీజ్‌ చేసి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, జగన్‌ని అభాసుపాల్జేయాలని చూస్తున్నారు. కనీసం వాస్తవాలు కూడా  తెలుసుకోకుండా, పత్రికలు కూడా అలా ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అనేది ఆలోచించాలి.

వెంకటేశ్వరశర్మ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఏమేమో చేశారని నిందిస్తున్నారు. నిజానికి ఆయనకు పార్టీతో ఏనాడూ, ఏ విధమైన సంబంధం లేదు. అప్పుడు, ఇప్పుడు ఆయన ఏం చేసినా, అది పూర్తిగా వ్యక్తిగతం. అయినా ఆయన ఏదో చేశారని చూపుతూ, దాన్ని వైయ‌స్ఆర్‌సీపీకి అంటగడుతూ బురద చల్లడం అత్యంత హేయం. టీడీపీ కూటమి ప్రభుత్వం చివరకు లాయర్లను కూడా వదలడం లేదు.

ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం:
ఒక వైపు హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం మా పార్టీపై బురద చల్లుతూ.. వెంకటేశ్వరశర్మ ఏదో చేశారని, మా పార్టీకి అంటగడుతున్నారు. ఆ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదే వెంకటేశ్వరశర్మ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో అంటకాగారు. కావాలంటే ఈ ఫోటోలు చూడండి. (అంటూ ఆ ఫోటోలతో పాటు, నందమూరి బాలకృష్ణతో దిగిన ఫోటో కూడా మీడియాకు చూపారు). మరి అలా చూస్తే, వెంకటేశ్వరశర్మ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అనుకోవచ్చు కదా? లేకపోతే పల్లా శ్రీనివాసరావుతో ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? దీనికి టీడీపీ ఏం సమాధానం చెబుతుంది? 

ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఈ ఫోటోలు చూపుతున్నాయి. మరి వెంకటేశ్వరశర్మకు, టీడీపీతో ఏం సంబంధం? ఆయన టీడీపీకి చెందిన వారు అనుకోవచ్చు కదా? అదే వెంకటేశ్వరశర్మ గతంలో నందమూరి బాలకృష్ణతో కూడా ఫోటో దిగారు. మరి ఆయనతో ఏం సంబంధం? ఇవన్నీ చూస్తుంటే, వెంకటేశ్వరశర్మ టీడీపీ లీగల్‌సెల్‌ సభ్యుడా?. ఇంకా ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవితో కూడా వెంకటేశ్వరశర్మ కలిసి ఉన్నాడు. చిరంజీవితో, ఆ పార్టీతో కూడా ఆయనకు ఏం సంబంధం ఉంది? ఇప్పటికైనా ఆ మీడియా ఇలాంటి దుష్ప్రచారాన్ని విడనాడాలి. లేకపోతే చట్టపరంగా చర్య తీసుకుంటాం.

కేసు నమోదు కాగానే నింద మొదలు:
వెంకటేశ్వరశర్మపై మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగానే, వెంటనే ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఆయన వైయస్సార్‌సీపీకి చెందిన వారని, జగన్‌గారికి అత్యంత సన్నిహితుడని చెబుతూ బురద చల్లుతున్నాయి. మళ్లీ చెబుతున్నాం. వెంకటేశ్వరశర్మ ఏనాడూ మా పార్టీలో లేడు. ఆయనకు మా పార్టీతో ఏ సంబంధం లేదు. ఆయన జగన్‌ వ్యక్తిగత లాయర్‌ కాదు.

నిజానికి ఆ ఫోటోలు చూస్తుంటే, వెంకటేశ్వరశర్మకు మీ (టీడీపీ) పార్టీతోనే సంబంధాలు ఉన్నాయనిపిస్తోంది. ఆయన మీ పార్టీకి చెందిన వ్యక్తినే. మీకు డబ్బుల పంపకాల విషయంలో గొడవ అయింది కాబట్టే ఆయన మీద ఆరోపణలు చేస్తూ మాపైకి నెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వరశర్మ తమ్ముడు జనసేనలో ఉన్నాడని ఒ.గవాస్కర్, సీహెచ్‌.సాయిరాం వివరించారు. ప్రెస్‌మీట్‌లో వై.పుల్లారెడ్డి, నాగిరెడ్డి, జి.లావణ్య కూడా పాల్గొన్నారు.

Back to Top